Home జిల్లా వార్తలు ఎవడైతే.. నాకేంటి

ఎవడైతే.. నాకేంటి

వైయస్సార్‌ కాంగ్రెస్‌పార్టీలో జగన్‌ ఆత్మాహుతి దళం అన్నట్లుగా ఓ టీమ్‌ వుంది. ఈ టీమ్‌ సభ్యులు గెలిచినా, ఓడినా చివరకు చచ్చినా జగనన్నతోనే మా ప్రయాణం అన్నట్లుంటారు. అలాంటి టీమ్‌లో ఒక సభ్యుడే నెల్లూరు నగర ఎమ్మెల్యే పి.అనిల్‌కుమార్‌యాదవ్‌. 2014 ఎన్నికల్లో నెల్లూరు నగర అసెంబ్లీ నుండి భారీమెజార్టీతో గెలిచిన అనిల్‌, ఈ నాలుగేళ్ళ కాలంలో జగన్‌కు వీరవిధేయుడయ్యాడు. ప్రభుత్వంపైకి విమర్శలతో ఉరకడంలో జగన్‌ చేతిలో అస్త్రమయ్యాడు. జగన్‌కు అత్యంత నమ్మకస్తుడిగా వుంటూ తన నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోనే వైసిపి కార్యకర్తలు, అభిమానులకు మరింత చేరువయ్యాడు.

ఈ నాలుగేళ్ళలో అటు అసెంబ్లీలోనూ, ఇటు ప్రజలలోనూ అనిల్‌ దూకుడును అందరూ చూస్తున్నారు. ఓపక్క పార్టీపరమైన కార్యక్రమాలలో చురుకుగా వుంటూనే, మరోపక్క తన నియోజకవర్గ ప్రజలకు కూడా దగ్గరగా వుంటున్నాడు అనిల్‌. తన నియోజకవర్గంలోని ప్రజల సమస్యలపై స్పందిస్తుండడం, వారి కోసం పోరాటాలు చేయడం చూస్తున్నాం.

తెలుగుదేశం నాయకులకు జిల్లాలో కొన్ని నియోజకవర్గా లలో సమర్ధులైన అభ్యర్థుల సమస్య వుంది. ఆత్మకూరు, నెల్లూరురూరల్‌, సూళ్ళూరుపేట నియోజకవర్గాలతో పాటు జిల్లా కేంద్రమైన నెల్లూరు నగరంలోనూ గట్టి అభ్యర్థిని వెదకడం, అది కూడా అనిల్‌ను ఢీకొట్టే అభ్యర్థిని ఎంపిక చేయడం వారికి సమస్యగా వుంది. నగరం టిక్కెట్‌ రేసులో ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, అబ్దుల్‌ అజీజ్‌, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, తాళ్ళపాక అనూరాధలు వున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అనిల్‌కు వాళ్లైతే గట్టిపోటీ ఇవ్వలేరని పార్టీ వర్గాలలోనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే నెల్లూరు నియోజకవర్గం నుండి తెలుగు దేశం అభ్యర్థిగా మంత్రి నారాయణ పేరు చాలా రోజులుగా ప్రచారంలో వుంది. నారాయణకు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలనే ఆసక్తి లేదు. అది కూడా నెల్లూరుజిల్లా నుండి పోటీ చేయాలనుకోవడం లేదు. కాని, చంద్రబాబు నువ్వు దిగాల్సిందేనని ఆదేశిస్తే మాత్రం నారాయణకు పోటీ చేయక తప్పదు.

నెల్లూరు నగరం నుండి నారాయణకే కాదు, నారా లోకేష్‌, నారా చంద్రబాబునాయుడులు పోటీ చేసినా వెనక్కుతగ్గేది లేదని, బస్తీమే సవాల్‌ అంటున్నాడు అనిల్‌! వచ్చే ఎన్నికల్లో తన ప్రత్యర్థి మంత్రి నారాయణే అన్న భావంతోనే అనిల్‌ రాజకీయంగా అడుగులు వేస్తున్నాడు. నారాయణను అన్నివిధాలా ఢీకొట్టడానికి శక్తియుక్తులు కూడగడుతున్నాడు.

నగరంలో నారాయణకు అనుకూల అంశం సొంత కులమైన కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువుగా వుండడం. ఇక నారాయణ ఆర్ధిక బలం ముందు అనిల్‌ నిలబడలేడు. నారాయణ ఎందుకైనా మంచిదనే ముందుచూపుతో ఇటీవల నగర రాజకీయాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నాడు. పార్కులు, డ్రైన్లు, కాలువల పూడికతీత, ఇళ్ళ నిర్మాణం వంటి కార్యక్రమాలు విరివిగా చేయిస్తున్నాడు. ఆర్ధికంగా నారాయణను ఎదుర్కోవడం అనిల్‌కు కష్టమే! కానీ రాజకీయంగా మోటుకోగల తెలివితేటలు, వాగ్ధాటి అనిల్‌కున్నాయి. నారాయణ విద్యాసంస్థలపై అనిల్‌ తొలి నుండి దాడి చేస్తున్నాడు. టీడీపీ అధికారంలోకి వచ్చాక, నారాయణ మంత్రి అయ్యాక ఆయనపై మొదటి విమర్శల తూటా పేల్చింది అనీలే! అవకాశం చిక్కినప్పుడల్లా నారాయణ విద్యాసంస్థల మీద, అక్కడి ఫీజుల మీద, ఆ సంస్థలలో జరిగే విద్యార్థుల ఆత్మహత్యల మీద అనిల్‌ తరచూ విరుచుకుపడు తున్నాడు. ఇక నెల్లూరులో మంత్రి పర్యవేక్షణలో జరుగుతున్న ‘హౌస్‌ ఫర్‌ ఆల్‌’ ఇళ్ళ నిర్మాణంలో అక్రమాలపై తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పిస్తున్నది కూడా అనీలే!

తాజాగా మరోసారి అనిల్‌ ‘నారాయణ’ మీదకు ఆరోప ణాస్త్రాలు సంధించాడు. నారాయణ విద్యాసంస్థల్లో వసూలు చేసే ఫీజలుపై పోరాటం మొదలుపెట్టాడు. నారాయణ విద్యా సంస్థలు ఫీజుల దాహంతో జనాన్ని పీల్చి పిప్పి చేస్తున్నాయనే దిశగా ప్రజలపై బలమైన ముద్ర వేసి, నారాయణపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చేలా అనిల్‌ పావులు కదుపుతున్నాడు.

నెల్లూరు నగరంలో టీడీపీ అభ్యర్థిగా నారాయణ పోటీలోకి దిగితే ఇది అనిల్‌కు కాదు, నారాయణకే సవాల్‌గా మారుతుంది. అనిల్‌కు గెలుపోటములు సమస్య కాదు. ఒకసారి ఓడాడు, మరోసారి గెలిచాడు. రేపు నారాయణ చేతిలో అతను ఓడిపోయినా అతనికి పోయేదేమీ లేదు. పార్టీ గెలిచి, తాను ఓడిపోతే పెద్ద లెక్కలోకి కూడా తీసుకోడు. వైసిపి అధికారంలోకి వస్తే పార్టీలో అనిల్‌ ప్రాధాన్యత అలాగే వుంటుంది. కాని, ఇక్కడ నారాయణకే సమస్య! గెలిస్తే ఫర్వాలేదు, ఓడిపోతే మాత్రం నారాయణ పరిస్థితి గాలి తీసిన ట్యూబ్‌లా అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here