Home జిల్లా వార్తలు ఎన్ని కష్టాలొచ్చినా… గుండెదిటవుతో ముందుకు సాగిన కమిటీ

ఎన్ని కష్టాలొచ్చినా… గుండెదిటవుతో ముందుకు సాగిన కమిటీ

ఒక విద్యాలయం నెలకొల్పి నిర్వహించడమంటే మాటలతో పనికాదు. నెలకొల్పడం ఒక ఎత్తయితే, నిర్వహణ మరింత కష్టం. నేటి కార్పొరేట్‌ స్కూళ్ళకు జనం పరుగులు తీస్తున్నారంటే..తమ పిల్లలు బాగా చదువుకోవాలని తపనపడడమే ప్రధాన కారణం. అయితే, స్వాతంత్య్రం రాముందు ఆడపిల్లలకు చదువెందుకనే ఆ రోజుల్లో.. వారిని చైతన్యవంతం చేసి, బడిబాట పట్టించేందుకు నాటి సమాజసేవాభిలాషులు..స్వాతంత్య్రసమరయోధులు పడిన కష్టం అంతా ఇంతా కాదు.

కస్తూరిదేవి విద్యాలయం స్థాపనకు ముందు జిల్లాలో ఆడపిల్లలకు బడులంటూ ఏమీ లేవు. వారు చదువుకోవాలని వారి తల్లిదండ్రులు ఆరాటపడకపోగా, బడికి పంపడానికి కూడా ఇష్టపడేవారు కాదు. అలాంటి పరిస్థితుల్లో జాతీయభావాలతో ఆడపిల్లలకు విద్యాలయం నెలకొల్పడం ఒక బృహత్తర ప్రయత్నమైతే, ఆ తర్వాత దాని నిర్వహణ మరెంతో కష్టతరమైంది. పేద, మధ్యతరగతి ఆడపిల్లలు ఎంతోమంది చదువుకునేందుకు వీలుగా ఈ విద్యాలయం ప్రారంభం కావడంతో ప్రజల్లోనూ చైతన్యం వచ్చింది. క్రమేణా ఆడపిల్లలు బడికి వచ్చి చదువుకోవడం ప్రారంభించారు. అయితే, పెరుగుతున్న విద్యార్థినులతో అటు పాఠశాల, ఇటు హాస్టల్‌ నిర్వహణ రానురాను కష్టతరంగా మారింది. నిర్వహణకు అవసరమైన నిధులు పుష్కలంగా ఉండేవి కావు. ఉపాధ్యాయులకు జీతాలివ్వాలి, హాస్టల్‌ పిల్లలకు భోజనం పెట్టాలి. వారికి మంచి వసతి కల్పించాలి. ఏది కావాలన్నా డబ్బుతో పని. ఎంతోమంది దాతలు చేయూతనిచ్చినా ఆ మొత్తాలన్నీ రోజురోజుకూ కరిగిపోయి, నిర్వహణ భారమైపోయినా. విద్యాలయం నిర్వహణలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, అడ్డంకులు ఎదురైనా ఆ మహనీయులు మాత్రం గుండెదిటవుతో ధీరులుగానే నిలచి విద్యాలయాన్ని ముందుకు నడిపించారు.

ఎంతోమంది బాలికల జీవితాలకు వెలుగులనిచ్చే ఈ విద్యాదీపం ఆరిపోకుండా తమ రెండుచేతులూ అడ్డుపెట్టి కాపాడుకుంటూ వచ్చిన వారి త్యాగశీలత, సేవాభావం ఏనాటికీ విస్మరించరానివి. ఆ మహానుభావుల రుణం మనం ఏనాటికీ తీర్చుకోలేం. విద్యాలయం నెలకొల్పినప్పటి నుంచి నేటి దాకా ఈ విద్యాలయం పూర్వచరిత్రను చూస్తుంటే నాటి మహనీయుల అలుపెరుగని కృషితో, కమిటీలోని ప్రముఖుల ప్రోత్సాహంతో..ఎంతోమంది దాతలు, సమాజసేవాభిలాషుల సహకారంతో ఈ విద్యాలయం ఎన్నో సమస్యలను దాటుకుంటూ..క్రమేణా పురోగతిని సాధించిందనే విషయం తేటతెల్లమవుతుంది. విద్యాలయం పూర్వచరిత్రలో ఇలాంటి అంశాలు నాటి మహనీయుల దేశభక్తిని..విద్యాభిమానాన్నే కాక.. వారి ఔదార్యాన్ని, ఔన్నత్యాన్ని కూడా మన కళ్ళకు కట్టినట్లుగా స్పష్టం చేస్తాయి.

విద్యాభివృద్ధే లక్ష్యంగా…

విద్యాలయ పరిరక్షణే ధ్యేయంగా…

కస్తూరిదేవి విద్యాలయానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల్లో ప్రధానమైనది బాలికలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే. అందుకు ఎంత కష్టమైనా సరే వెనుకంజ వేయకుండా కమిటీసభ్యులు కృషి చేసేవారు. విద్యాభివృద్ధే లక్ష్యంగా…విద్యాలయం పరిరక్షణే ధ్యేయంగా… కమిటీ ఎప్పటికప్పడు నిర్ణయాలు తీసుకుంటూ ఉండేది. పాఠశాలను స్థాపిం చిన తొలినాళ్ళలో పాఠశాలలో బాలికలు చదువుపట్ల పెద్దగా ఆసక్తి కనపరచకపోయినా, క్రమేణా విద్య యొక్క విశిష్టతను గ్రహించి బడికి వచ్చేందుకు

ఉత్సాహం చూపేవారు. అదేవిధంగా కమిటీ కూడా పాఠశాలలో ఉత్తీర్ణత శాతం తగ్గినా, నిరాశకు గురి కాకుండా వారు బాగా చదువుకుని సమాజంలో రాణించేలా నిరంతరం కృషిచేసేవారు. మరోవైపు విద్యాలయం పటిష్టతకు, విద్యాలయంలో వసతుల కల్పనకు చర్యలు తీసుకునేవారు.

1969లో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు కూడా జరిపి విద్యాలయానికి కొత్త కళ తీసుకురావాలను కున్నారు. 1966 మార్చి 10న జరిగిన కమిటీ సమావేశంలో స్కూల్‌ వార్షికోత్సవం జరిపే విషయం విద్యాలయం కమిటీ చర్చించింది. ఆ మేరకు ఏప్రిల్‌ 16న ఆ కార్యక్రమం జరపాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్‌ 2న జరిగిన సమావేశంలో వార్షికోత్సవ వేడుకలకు 300రూపాయలు మంజూరుచేస్తూ సమా వేశంలో తీర్మానించారు. అంతేకాదు, విద్యాలయానికి ఇరువైపులా కాంపౌండ్‌వాల్స్‌ నిర్మాణం విషయం చర్చించుకున్నారు. 2-7-1966 నాటి సమావేశంలో 1965-66 సంవత్సరానికి సంబంధించి ట్వల్త్‌క్లాస్‌ పబ్లిక్‌ పరీక్షల ఉత్తీర్ణత విషయం చర్చించి, ఉత్తీర్ణత మరింత మెరుగుపడేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. విద్యాలయంలో కిండర్‌గార్టెన్‌ స్కూల్‌ కూడా ఏర్పాటుచేయాలనే ప్రతిపాదన కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇలా ఎప్పటికప్పుడు సంయమనంతో ఆచితూచి అడుగులేసుకుంటూ..వారు విద్యాలయం అభివృద్ధికి బాటలు వేశారు.

కళాశాల ఏర్పాటుకు ముందుచూపుతో కమిటీ సమాలోచనలు :

1967 ఆగస్టు 25న జరిగిన సమావేశంలో ఆ ఏడాది జరిగిన ట్వల్త్‌ క్లాస్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను కమిటీ సమీక్షించింది. ఫలితాల పెరుగుదలకు విద్యాబోధన మెరుగుదలకు అవసరమైన చర్యలు తీసుకుంది. 4-10-1966న జరిగిన సమావేశంలో కస్తూరిదేవి హాస్టల్‌లో వంటగది నిర్మాణానికి అప్పట్లో 22వేల రూపాయలు వెచ్చించాలని ఆమోదిస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది. ఇక్కడొక ముఖ్యమైన విషయం ఏమిటంటే విద్యాలయానికి అప్పట్లో ఆర్ధిక పరిపుష్టి లేక నిర్వహణ అవస్తగా ఉన్నప్పటికీ, భవి ష్యత్తులో విద్యార్థినులు కళాశాల విద్య చదువుకు నేందుకు ఇబ్బందులు లేకుండా ఉండాలని విద్యా లయం ప్రాంగణంలో బాలికలకు కళాశాల విద్య కూడా అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఇక్కడ కాలేజీ ఏర్పాటుకు కూడా కమిటీ సభ్యులు ఆలోచనలు చేయడం వారి సేవానిరతికి.. ముందుచూపుకు నిదర్శనం. కమిటీ సభ్యులు ఈ కాలేజీ ఏర్పాటుకు ఎంతో ఉత్సాహం చూపారు. ఈ నేపథ్యంలో ఇక్కడ జూనియర్‌ కాలేజీ ఏర్పాటుకు ప్రభుత్వం నుంచి వచ్చిన ప్రతిపాదనను కమిటీ 1968 మార్చి 3న జరిగిన సమావేశంలో సంతోషంగా ఆమోదించింది. ఆ తర్వాత ఈ ఏడాది ట్వల్త్‌క్లాస్‌ పరీక్షా ఫలితాలను సమీక్షించి ఫిజికల్‌ సైన్స్‌లో బాలికలు వెనుకబడు తుండడం గమనించి ఆ సబ్జెక్ట్‌ను విద్యార్థినులకు బాగా బోధించేందుకు తగు ఏర్పాట్లుచేస్తూ కమిటీ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బాలికల హాస్టల్‌ కోసం డైనింగ్‌హాల్‌, కిచెన్‌-స్టోర్‌రూమ్‌ల ఏర్పాటుకు కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలోనే శ్రీ ఎం.గోపాల కృష్ణారెడ్డిగారిని కమిటీ సభ్యునిగా కోఆప్ట్‌ చేసుకుంటూ కమిటీ తీర్మానించింది. నాటి కమిటీ సమావేశంలో శ్రీయుతులు టి.రామిరెడ్డి, ఏ.పద్మనాభరెడ్డి, ఎం.పిచ్చి రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, ఎస్‌.శంకర్‌, పి.శాంతిదేవి, శుభప్రద, జి.వి సుబ్బరామయ్య గార్లు ఉన్నారు.

1969 నాటికి కూడా తీరని కష్టాలే :

విద్యార్థినుల సంఖ్య క్రమేణా పెరుగుతుండడం, అర్ధిక ఇబ్బందులు కూడా పెరగడం, పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లు వసతులు కల్పించలేక మదన పడుతుండడం ఇలాంటి కష్టాలతోనే కమిటీ తరచూ చర్చలు జరిపేది. ఈ కష్టాలను అధిగమించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించుకునేవారు. కమిటీకి 1969 నాటికి కూడా విద్యాలయ ఆర్ధిక పరిస్థితి లోటుగా ఉండడంతో ఆ సమస్యను ఎలా అధిగమించాలన్నది పెద్దసమస్యగా ఉండేది.

ఈ నేపథ్యంలో, సుమారు 17ఏళ్ళుగా ఈ విద్యా లయానికి, కమిటీకి ఎంతో సేవలందిస్తుండిన ఏ.పద్మ నాభరెడ్డి బి.ఎ(లిట్‌) గారు 1968 నవంబరు 29న హైదరాబాద్‌లో మరణించారు. కమిటీ నిర్వాహకులకు ఇది మరో విషాదమైంది. కస్తూరిదేవి విద్యాలయం కమిటీకి కార్యదర్శిగా, కోశాధికారిగా, కరెస్పాండెంట్‌గా అనితరసాధ్యమైన సేవలు చేసిన ఆయన మృతికి కమిటీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. డిసెంబర్‌ 1, 1968న జరిగిన సమావేశంలో ఆ మేరకు సంతాపం ప్రకటించింది. ఆ తర్వాత ఆయన స్థానంలో ఎవరిని నియమించుకోవాలనే విషయం చర్చకు వచ్చి, ఎన్నిక ద్వారా ఆ స్థానాన్ని భర్తీ చేయాలని భావించి మరుసటి రోజు ఎన్నిక నిర్వహించాలని నిర్ణయించారు. 2-12-1968న జరిగిన కమిటీ సమావేశంలో ఆ స్థానానికి సికె శుభప్రదగారు సెక్రటరీ, ట్రెజరర్‌గా, పాఠశాల కరెస్పాండెంట్‌గా ఎన్నికై, పూర్తిస్థాయి అధికారాలతో విద్యాలయం బాధ్యతలు చేపట్టడం జరిగింది. శుభప్రదగారు కమిటీ బాధ్యతలు స్వీకరిం చిన తర్వాత విద్యాలయానికి సంబంధించిన అభివృద్ధి మరింత ముందుకుసాగింది. అయితే అప్పటికే విద్యా లయ ఆర్ధిక పరిస్థితి లోటుగా ఉండేది. 1969 జనవరి 13న జరిగిన కమిటీ సమావేశంలో విద్యాల యానికి, హాస్టల్‌కు కొత్త ఇనుపగేట్లు పెట్టించాలని, ప్రధాన గేటు వద్ద ‘శ్రీ కస్తూరిదేవి బాలికల విద్యా లయం-నెల్లూరు’ అని, హాస్టల్‌ గేటుకు ప్రముఖ వదాన్యులు శ్రీ రేబాల పట్టాభిరామిరెడ్డి-సుజాతమ్మల పేర్లతో బోర్డులు ఏర్పాటుచేయాలని నిర్ణయిస్తూ కమిటీ తీర్మానించింది. ఆర్థిక ఇబ్బందులను అధిగమించ డానికి, విద్యాలయాన్ని ముందుకు నడిపించడానికి ప్రభుత్వం నుంచి విద్యాలయానికి రావాల్సిన అరియర్స్‌ను రాబట్టుకునేందుకు తగు చర్యలు తీసు కోవాలని నిర్ణయించుకున్నారు. ఇదిలావుంటే, కమిటీ విశ్రాంత సభ్యునిగా ఉన్న మేనకూరు దశరధ రామరెడ్డిగారు మృతిచెందడంతో కమిటీ విచారం వ్యక్తం చేస్తూ అదేరోజు జరిగిన కమిటీ సమావేశంలో ఆయనకు తమ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ఆరోజు జరిగిన కమిటీ సమావేశంలో శ్రీయుతులు టి.రామిరెడ్డి, ఎం.ఆదిశేషారెడ్డి, ఎస్‌.శంకర్‌; వై.వెంకటేశ్వర్లు, ఎం.పిచ్చిరెడ్డి, సికె శుభప్రదగార్లు పాల్గొని ఆయా అంశాలకు సంబంధించిన విషయా లను కూలంకుషంగా చర్చించి తగు నిర్ణయాలు తీసుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here