Home సంపాదకీయం ఎన్నికల సంఘానికే సవాల్‌!

ఎన్నికల సంఘానికే సవాల్‌!

17వ సార్వత్రిక ఎన్నికలకు తొలివిడత పోలింగ్‌కు నామినేషన్ల ఘట్టం కూడా ముగియడంతో, ఇక ఎన్నికలు సమీపిస్తున్నాయి కనుక, దేశమంతా ఎన్నికల వాతావరణం వేడెక్కిపోయింది. ఎటుచూసినా అంతా ఉత్కంఠభరిత వాతావరణం కనిపిస్తోంది.

మరోవైపు నాయకుల ఎన్నికల ప్రచారాలు మరింత జోరందుకున్నాయి. ఆయా పార్టీల నేతల ఆవేశపూరిత ప్రసంగాలతో దేశం అట్టుడికిపోతోంది. ఓట్ల కోసం నాయకులు కోటి పాట్లు పడుతున్నారు. డబ్బు, మద్యం వగైరాలన్నీ చాపకింద నీరులా సాగిపోతూనే ఉన్నాయి. ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిచి, గెలవడమే ధ్యేయంగా నాయకులు అనేక ప్రాంతాల్లో తమ దుర్నీతులను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో, అందరి దృష్టి ఎన్నికల కమిషన్‌పైనే ఉంది. ఇలాంటి అక్రమాలను అడ్డుకుని దేశంలో స్వేచ్ఛగా..న్యాయంగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్‌దే.

అయితే, దాదాపు 90 కోట్ల మంది ఓటర్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరిం చిన మన దేశంలో.. ఎన్నికల నిర్వహణ అంటే మాటలు కాదు, కత్తిమీద సాము వంటిదని అందరికీ తెలిసిందే. అయినా, ఎన్నికల సంఘం తన శక్తివంచన లేకుండా ఆయా అక్రమాలను అడ్డుకుంటూనే ఉంది. అందులోనూ ఇప్పుడు ఎన్నికలంటే సమరమే అన్నట్లుగా ఉంటున్నాయి. ఈ రణరంగంలో అందరూ నిబంధనలు తప్పనిసరిగా సక్రమంగా పాటిస్తే అంతకన్నా కావాల్సిందేముంది!.. కానీ, ఎన్నికల నియమావళిని లెక్కచేయకుండా అనేక మంది నాయకులు ఎవరి చిత్తానుసారం వారు వ్యవహరిస్తూనే ఉండడం అందరికీ తెలిసిందే. అక్రమమో..సక్రమమో ఏదైతేనేం.. ఈ ఎన్నికల్లో తాము గెలిచితీరాలని తాపత్రయపడే రాజకీయ నాయకులే ఇప్పుడు ఎక్కువగా ఉంటున్నారు.

అట్లని నీతి-నిజాయితీలకు మారుపేరుగా ఉండే నాయకులు లేరని కాదు… అయితే, వీరి సంఖ్య మాత్రం చాలా తక్కువ. ఇప్పుడంతా అరాచక రాజకీయాలే వీరంగం చేస్తున్నాయి. కోటానుకోట్లు డబ్బున్న వారికే రాజకీయం చెల్లుబాటవుతున్నది కానీ, నీతి-నిజాయితీతో ఉండేవారికి సీటు కానీ, చోటు కానీ దొరకడం లేదు. ధనబలం, కండబలం ఉన్న వారికే రాజకీయాల్లో గొప్ప స్థానం లభిస్తోంది.

అందుకే, మనదేశంలో రానురాను నీతిమంతమైన రాజకీయాలకు కాలం చెల్లిపోతున్నదా.. అనిపి స్తోంది. ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా రాజకీయనాయకులు ఇప్పుడు అన్ని రకాల టక్కుటమారాది విద్యలు ప్రయోగిస్తున్నారు. డబ్బుతో ఓట్లను గెలుచుకునేందుకు నానా రకాల పాట్లు పడుతున్నారు. ఏదోవిధంగా పదవి వస్తే చాలు.. అంతకు అంత సంపాదించుకోవచ్చనే ఉబలాటం ఉండే నాయకులూ లేకపోలేదు. అందుకే, ఎన్నికల కమిషన్‌ ఎన్నిరకాల నిబంధనలు అమలుచేస్తున్నా, ఆ నియమాలకు చాలామంది నాయకులు తిలోదకాలిచ్చేస్తున్నారు. అనేకచోట్ల మరీ బరితెగించిపోతున్నారు. అడ్డదారుల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి కుయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ విధించిన వ్యయపరిమితి లక్షల్లో

ఉంటే, ఖర్చుమాత్రం కోట్లు దాటించేస్తున్నారు. అయితే ఎన్నికల సంఘం నిబంధించినట్లుగా ఎన్నికల ఖర్చును ఆ పరిమితికి లోబడే ఖర్చుచేసేవారు ఏ కొద్దిమందో ఉంటారు. కోటానుకోట్లుగా డబ్బున్నవారు ఎన్నికల రంగంలో ఉన్నప్పుడు డబ్బును వారు మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేస్తుండడం మామూలై పోయింది. మరోవైపు ఓటర్లను ఎలాగైనా సరే, గాలం వేసి లాగేందుకు చేయాల్సిన అన్ని రకాల ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా అత్యధిక ప్రాంతాల్లో ఈ పరిస్థితి ఉంది.

ఎన్నికల్లో గెలవడం కోసం డబ్బును నీళ్లలా ఖర్చుచేయడం, మద్యాన్ని ఏర్లుగా పారించడం, రకరకాల తాయిలాల తాంబూలాలు పంచడం, ఓట్లు ఎలాగైనా రాబట్టడానికి బేరసారాలు చేయడం వంటివన్నీ మామూలే!.. అయితే, ఎన్నికల కమిషన్‌ శక్తివంచన లేకుండా అలాంటి వాటన్నిటికీ చెక్‌ పెడుతూనే ఉంది. డబ్బు, మద్యం నిల్వలపై దృష్టి సారించి ఎక్కడివక్కడ స్వాధీనం చేసుకుంటూనే ఉంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటినుంచి ఇప్పటి దాకా దేశవ్యాప్తంగా దాదాపు 540 కోట్ల విలువైన నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల సంఘం తాజాగా ప్రకటించింది కూడా. అంతేకాదు, ఇంత భారీఎత్తున నగదుతోపాటు, విలువైన నగలు, కోట్లాది లీటర్ల మద్యాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. దీన్నిబట్టి, ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయపార్టీలు, నాయకులు ఎంతగా తెగబడు తున్నారో… ఎంతగా ‘మితి’ మీరుతున్నారో కూడా తేటతెల్లమవుతుంది. అంతేకాదు, వ్యక్తిగత దూషణ లకు ఎవరూ పాల్పడకూడదని ఎన్నికల నియమావళి స్పష్టం చేస్తున్నా నాయకగణం ఏమాత్రం ఆ నిబం ధనను పట్టించుకోవడమే లేదు. దేశంలో తాము అగ్రనేతలమని చెప్పుకునేవారు కూడా ఒకరి మీద మరొకరు విచక్షణా రహితంగా ఆవేశపూరిత ప్రసం గాలతో రాజకీయాలను రణరంగం చేస్తుంటే, ఇక వారిని అనుసరించే చిన్నపాటి నాయకుల స్థితి.. ఆవేశపూరిత విధానాలు ఎలా ఉంటాయో ఊహించవచ్చు. కోటానుకోట్ల ప్రజలు, ఓటర్లున్న ఇంత గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు విశుద్ధమైన.. నిజాయితీపాలన అందించే విధంగా కృషిచేయాల్సిన నాయకులు ఇలా నిబంధనలు ఉల్లంఘిస్తూ అడ్దదారుల్లో ఓట్ల సంపాదనకు ప్రయత్నిస్తుండడమే విచారకరం!.. ఎన్నికల కమిషన్‌ మరింత కట్టుదిట్టంగా ఈ అరాచకాలను అడ్డుకోవాలి. ఎన్నికల సంఘానికే సవాల్‌గా మారుతున్న నాయకుల అక్రమాలకు అడ్డుకట్టవేయాలి. దేశంలో స్వేచ్ఛగా.. పటిష్టంగా ఎన్నికలు నిర్వహించాలి. అదేవిధంగా, ఓటర్లు కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా విజ్ఞతతో వ్యవహరించాలి. మంచినేతలకు ఓటు వేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసుకోవడమేకాక, దేశసౌభాగ్యానికి కూడా ఎంతో శ్రేయోదాయకమని అందరూ గుర్తించాలి. వ్యక్తిగత స్వార్ధాలను పక్కనపెట్టి తమ తమ రాష్ట్ర, భారతదేశ భవిష్యత్‌ కోసం ఆలోచించి ఓటు వేయాలి. ప్రజల భవితను, దేశభవితను కాపాడే ఓటుహక్కును ఓటర్లందరూ సద్వినియోగం చేసుకుని.. తద్వారా దేశంలో సుపరిపాలనకు.. సుస్థిరపాలనకు బాటలు వేయాలి. అందుకు సరైన సమయం ఇదే!..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here