Home జాతీయ వార్తలు ఎన్నికల నామ సంవత్సరం – 2019…. నేతల జాతకాలు తేలనున్నాయి!

ఎన్నికల నామ సంవత్సరం – 2019…. నేతల జాతకాలు తేలనున్నాయి!

2019 రానే వచ్చింది. దేశం, రాష్ట్రం, జిల్లా నేతల భవిత మరో 4 నెలల్లో తేలిపోనుంది. నువ్వా నేనా అంటూ అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సమరానికి సంసిద్ధ మౌతున్నాయి. మంది మార్బలంతో పాటు ధనం ఇంధనం సిద్ధం చేసుకుంటున్నాయి. మొత్తం మీద 2019 ఎన్నికలు అటు భారతదేశం, ఆంధ్ర రాష్ట్రంలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా చారిత్రాత్మకం కాబోతున్నాయి.

21వ శతాబ్దం భారతదేశానిదే… ప్రపంచంలో అగ్రగామికానున్న భారత దేశం… చాలాకాలం నుండి వింటున్న మాటలివి. మరి ఈ మాటలు నిజమవు తాయా? కలగా మిగిలిపోతాయా? ఎందు కంటే ఇకనుండి దేశాన్ని పరిపాలించ బోయే పాలకుడి నాయకత్వ సామర్ధ్యంపై దేశ భవిష్యత్‌ ఆధారపడబోతోంది.

2019… అత్యంత కీలకమైన సంవ త్సరం. దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ప్రధాని ఎవరో నిర్ణయించే సంవత్సరం. అంతేనా గల్లీ నుండి ఢిల్లీ దాకా 543మంది లోక్‌ సభ సభ్యులు, వేలసంఖ్యలో ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధుల తలరాతను నిర్ణయించే సంవత్సరం. ఢిల్లీ పీఠమెవరిదో, నవ్యాంధ్ర సీఎం ఎవరో నిర్ణయించబోయే మహత్తర కాలం.

జనవరిలోనే సెగలు…

దేశం కొత్త ఏడాదిలోకే కాదు, ఎన్నికల ఏడాదిలోకి కూడా అడుగుపెట్టబో తోంది. జనవరి అంటే చలి లెక్క… కాని ఎన్నికల సెగ కూడా అప్పుడే మొదలు కానుంది. జాతీయ రాజకీయాలు అప్పుడే వేడెక్కాయి. ప్రధాని పీఠం నుండి నరేంద్ర మోడీని దించేయడమే తమ జీవిత లక్ష్యం అన్నట్లు ఇతర పార్టీలన్నీ కూటమి కడుతు న్నాయి. దాదాపు 60ఏళ్ల పాటు దేశాన్ని పాలించి, ఈ దేశాన్ని ఇంకా కూడా అభి వృద్ధి చెందుతూనే వున్న దేశంగా చేసి, ప్రజలకు పనులు చూపించకుండా సంక్షేమ పథకాలతో ఓట్ల వస్తువులుగా చూసిన కాంగ్రెస్‌ పార్టీయే మళ్ళీ అధికారంలోకి రావాలని, వస్తుందని కొందరు కలలు కంటున్నారు. 19వ శతాబ్దంలో పుట్టిన కాంగ్రెస్‌, 20వ శతాబ్దం చివరకు చాలా వరకు పతనమైంది. అలాంటి పార్టీ 21వ శతాబ్దంలో తిరిగి కోలుకుంటుందా? ఈసారి ఢిల్లీ పీఠంపై కాంగ్రెస్‌ నేతలు పెద్ద ఆశలే పెట్టుకున్నారు. రాహుల్‌ను ప్రధానిగా చూడాలన్న సోనియమ్మ ముచ్చట ఇంకా తీరలేదు. ఎన్నికలకు పోతే కాంగ్రెస్‌కు సొంతంగా మెజార్టీ రాదు. అందుకే రాహుల్‌ అడ్డమైన వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు. మరి ప్రధాని పదవికి రాహుల్‌ ఒక్కడేనా… బీజేపీని ఓడిస్తే తామే ప్రధాని కావచ్చు అనే ఊహల్లో మమతా, ములాయం, మాయావతి, చంద్ర బాబు, పవార్‌ వంటివాళ్ళు తేలిపోతు న్నారు. మొన్న రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోవడం వీరిలో ఆశలను రెట్టింపు చేసింది.

మరి బీజేపీ అంత సులభంగా అధికా రాన్ని కోల్పోతుందా? గత నాలుగున్నరేళ్ళ చరిత్రను పరిశీలిస్తే దేశ వ్యాప్తంగా కూడా బీజేపీ సక్సెస్‌ రేటు ఎక్కువుగానే వుంది. బీజేపీ ఆనవాళ్ళు లేని రాష్ట్రాలలో సైతం ఆ పార్టీ అధికారంలోకి రాగలిగింది.

భారత్‌కు ప్రత్యేక గుర్తింపు

మరి నరేంద్ర మోడీ పరిపాలనను కూడా చూద్దాం… ఎలాంటి కుంభ కోణాలు లేవు. అవినీతి ఆరోపణలు లేవు. ప్రపంచ దేశాలలో భారత్‌ అంటే ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ఉగ్రవాదం విషయంలో ప్రపంచానికి పాకిస్థాన్‌ను దోషిగా చూపించగలిగింది. పాక్‌ ఆర్ధిక మూలాలను దెబ్బతీసింది. మిడిసిపడుతున్న చైనాను సైతం దారికి తెచ్చాడు. దేశ వ్యాప్తంగా జాతీయ రహదారులు, రైల్వేల విషయంలోగాని, సాంకేతిక సమాచార వ్యవస్థలలో వూహించనంత అభివృద్ధి. ఇక ఆర్ధికవృద్ధి చూస్తే అగ్రరాజ్యాలకు ధీటుగా వుంది. అపసోపాల మధ్య ప్రవేశపెట్టిన జిఎస్టీ అప్పుడే లైన్‌లో పడి సత్ఫలితాల నిస్తోంది. పన్నుల వసూళ్లు పెరిగాయి. సరిహద్దులో ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడం మాటలద్వారా కాదు, చేతల ద్వారా చూపిస్తున్నారు. కాంగ్రెస్‌ హయాంతో పోలిస్తే ఉగ్రదాడులను అరి కట్టారు. ఒక్క నోట్ల రద్దు విషయంలో తప్పితే నరేంద్ర మోడీ పాలనలో ఎత్తి చూపడానికి ఎలాంటి లోపాలు లేవు. మరి ఇంతటి సమర్ధుడైన ప్రధానిని దించేసి ఏం చేస్తాడో తెలియని రాహుల్‌ లేదా మరో నాయకుడిని నెత్తినెక్కించుకోవడానికి ఈ దేశం సిద్ధంగా వుందా? 2019 ఈ విషయాన్ని తేల్చనుంది.

నవ్యాంధ్రలో కొత్త అధ్యాయమా?

ఆంధ్రప్రదేశ్‌ ప్రగతికి, రాష్ట్ర భవితకు 2019 ఎన్నికలు కీలకం కానున్నాయి. లోక్‌సభతో పాటే ఏపి శాసనసభకు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం 2014లో జరిగిన ఎన్నికల్లో వివిధ సమీకరణాల రీత్యా తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది. ఎన్నో వర్గాల ప్రజలు అనుభవజ్ఞుడని చెప్పి చంద్ర బాబుకు ఓట్లేశారు. కాని ప్రజలు ఆయనపై పెట్టుకున్న ఆశలు నీరుగారాయి. విభ జనతో నష్టపోయిన రాష్ట్రాన్ని ఆయన గట్టెక్కిస్తాడనుకుంటే, మరింతగా అప్పుల్లోకి నెట్టాడు. కేంద్రం కూడా విభజన హామీ ప్రత్యేక హోదాను పక్కనపెట్టింది. చంద్ర బాబు ఆర్భాటాలకు వేలకోట్ల ప్రజాధనం కర్పూరంలా కరిగిపోయింది. అమరావతి రాజధాని పేరుతో కాలయాపన తప్ప, వాస్తవంగా పరిపాలనకు కావాల్సిన రాజ ధానిపై ప్రభుత్వం దృష్టిపెట్టలేదు. ప్రతి అంశంలోనూ దోపిడీయే. అవినీతికి లైసెన్స్‌లిచ్చేసారా అన్నట్లుగా పరిపాలన సాగుతోంది. ఈ నాలుగున్నరేళ్ళ చంద్ర బాబు పాలనపై రాష్ట్రంలోని ఏ వర్గం ప్రజలు సంతృప్తి చెందడం లేదు.

ఇలాంటి వాతావరణంలో మరో మూడు నాలుగు నెలల్లో రాష్ట్రంలో లోక్‌ సభ, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధాన పోటీ మళ్ళీ తెలుగుదేశం, వైసిపిల మధ్యే! 2014 ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకున్న బీజేపీ, జనసేనల వైఖరి ఏంటన్నది ఇంకా తేలలేదు. ప్రభుత్వ వ్యతి రేక ఓట్లను చీల్చడానికి పవన్‌కళ్యాణ్‌ చంద్రబాబు సూచనతోనే విడిగా పోటీ చేస్తాడనే టాక్‌ నడుస్తోంది. మరోపక్క ఎన్నికల వేళకు బీజేపీతో జతకడతాడనే ప్రచారమూ వుంది. ఇక సిపిఎం, సిపిఐ వంటి పార్టీలది ఈ రాష్ట్రంలో నామ మాత్రపు పాత్రే! ఎన్నికల నాటికి బీజేపీతో తప్ప ఏ పార్టీతో పొత్తుకైనా వాళ్ళు సిద్ధంగా వుంటారు. 2014 ఎన్నికలలోనే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్‌ మట్టి కొట్టుకుపో యింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అంతకు మించి పొడిచేదేమీ వుండదు. ఒకవేళ తెలంగాణలో మాదిరిగా కాంగ్రెస్‌ – తెలుగుదేశంల మధ్య పొత్తు కుదిరినా అది చంద్రబాబు తన నెత్తిన తాను మట్టి చల్లుకోవడమే అవుతుంది. ఇక మాజీ సిబిఐ జె.డి లక్ష్మీనారాయణ సొంతంగా పార్టీ పెడతాడో లేక ఏదో ఒక పార్టీలో చేరతాడో ఇంకా తేలలేదు.

జగన్‌కు కీలకం…

అందరికంటే కూడా వైసిపి అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డికి 2019 సంవ త్సరం ఎంతో కీలకం కానుంది. 2014లో సొంత తప్పిదాల వల్ల అధికారం చేజా రింది. 2019లో మాత్రం అలాకాకూడ దనే పట్టుదలతో పోరాడుతున్నాడు. తనపై అన్ని వైపుల నుండి శత్రుదాడి జరుగు తున్నా సమర్ధవంతంగా ఎదుర్కొంటు న్నాడు. ఇడుపులపాయ నుండి ఇచ్ఛాపురం దాకా ప్రారంభించిన పాదయాత్రలో ఇప్పటికే 3500 కిలోమీటర్ల రికార్డ్‌ మైలురాయిని అధిగమించాడు. రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్యంగా ప్రజాదరణ పొందుతున్నాడు. రాష్ట్రంలో ప్రభుత్వం పట్ల వున్న వ్యతిరేకత, జగన్‌పై పెరుగుతున్న నమ్మకం… 2019లో ఆయన ఆశలు ఫలించే వాతావరణం కనిపిస్తోంది.

సింహపురి వీరులెవరో?

ఏపి రాజకీయాలలో నెల్లూరుజిల్లాది ప్రత్యేకశైలి. ఇక్కడ ఫలితాలపై సర్వత్రా ఆసక్తి వుంటుంది. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా నెల్లూరు జిల్లాలో మాత్రం ఎంపి స్థానాలతో పాటు ఏడు అసెంబ్లీలను వైసిపి గెలుచుకుంది. తెలుగు దేశం 3 అసెంబ్లీ స్థానాలకే పరిమిత మైంది. 2019లో మాత్రం ఈ ఫలితా లను తారుమారు చేయాలని తెలుగుదేశం నాయకులు తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, వైసిపి వాళ్ళు మాత్రం 2014లో మిస్స యిన ఆ మూడు స్థానాలను కూడా కలుపు కుని జిల్లాను క్లీన్‌స్వీప్‌ చేయాలనే పట్టు దలతో వున్నారు. మరి ఎవరి ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో 2019లో చూడ బోతున్నాం!

మొత్తానికి 2019 దేశ రాజకీయాలలో ఎన్నో సంచలనాలకు, చరిత్రను మార్చే ఫలితాలకు వేదిక కాబోతోంది. అందుకే 2019 దేశ ప్రజలకు ప్రత్యేకం కానుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here