Home జిల్లా వార్తలు ఊపందుకుంటున్న పరిణామాలు… నెల్లూరు లోక్‌సభకు బొమ్మిరెడ్డి? కావలి టిడిపి అభ్యర్థిగా విష్ణు?

ఊపందుకుంటున్న పరిణామాలు… నెల్లూరు లోక్‌సభకు బొమ్మిరెడ్డి? కావలి టిడిపి అభ్యర్థిగా విష్ణు?

ఎన్నికలు తరుముకొస్తున్న తరుణంలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఇరు పార్టీలలోనూ ఎవరు ఎక్కడ పోటీ అనే దానిపై స్పష్టత వస్తోంది. తెలుగుదేశం పార్టీలో నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి ఎవరన్నదానిపై సందిగ్ధత వుంది. ఇప్పటిదాకా ఆదాల ప్రభాకర్‌రెడ్డి, బీద మస్తాన్‌రావుల పేర్లు ప్రచారంలో నడిచాయి. ఆదాలను నెల్లూరు రూరల్‌కు ఖరారు చేయడంతో ఇక ఆయన లేనట్లే! ఇక బీద మస్తాన్‌రావుతో పాటు తాజాగా జిల్లా పరిషత్‌ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి పేరు కూడా తెరమీదకొచ్చింది. ఇటీవలే రాఘవ వైసిపికి రాజీనామా చేశాడు. ఆయన తెలుగుదేశం నుండి ఆత్మకూరు అసెంబ్లీ సీటు ఆశిస్తున్నాడు. పార్టీ అధిష్టానం మాత్రం ఆయనను నెల్లూరు లోక్‌సభ అభ్యర్థిగా దించాలనే ఆలోచనలో వుంది. నెల్లూరు లోక్‌సభకు ‘రెడ్డి’ సామాజికవర్గం అభ్యర్థి అయితేనే గట్టి పోటీ ఇవ్వగలడనే అభిప్రాయం వుంది. కాబట్టే బి.సి. వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావు కంటే కూడా బొమ్మిరెడ్డి వైపే మొగ్గున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే త్వరలోనే నెల్లూరు లోక్‌సభ టిడిపి అభ్యర్థి రాఘవే కావచ్చు.

కావలి టిడిపి అభ్యర్థిగా విష్ణు?

”ఏ నిమిషానికి ఏమి జరుగునో…” అని లవకుశ సినిమాలో లక్ష్మణ పాత్రధారి కాంతారావు పాడే పాట రాజకీయాలకు బాగా సరిపోతుంది. జిల్లాలో కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి అనే వ్యక్తిని తెలుగుదేశం నాయకుడిగా ఎవరూ ఊహించలేదు. ఎందుకంటే అతనికి ఊహ తెలిసినప్పటినుండి కాంగ్రెస్‌తో వున్నాడు. రాజకీయాలలో అడుగులు వేయడం మొదలుపెట్టినప్పటి నుండి వై.యస్‌.రాజశేఖరరెడ్డి వెంట నడిచాడు. అలాంటి కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి పేరు ఇప్పుడు కావలి తెలుగుదేశం అభ్యర్థిగా వినపడుతోంది. ప్రస్తుతం ఆయన వైసిపిలోనే వున్నాడు. సిటింగ్‌ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డికి సీటు ఇవ్వొద్దని ఆయన అడుగుతున్నాడు. తన మాట కాదని ప్రతాప్‌కు సీటిస్తే విష్ణు కావలి నుండి ఇండిపెండెంట్‌గానైనా పోటీ చేసేటట్లున్నాడు. అలాకాకున్నా సీటిస్తామంటే వైసిపిని వదిలి టిడిపిలో చేరినా ఆశ్చర్యం లేదు. ప్రస్తుతం కావలి నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థి విష్ణుయేనని టాక్‌ నడుస్తోంది. అది కూడా బీద బ్రదర్స్‌ ఒప్పుకుంటేనే కావలికి విష్ణు అభ్యర్థి కాగలడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here