Home జిల్లా వార్తలు ఉదయగిరి ‘దేశం’లో రగడ

ఉదయగిరి ‘దేశం’లో రగడ

దాదాపు నాలు గున్నరేళ్ళుగా ఉదయగిరి నియోకవర్గ తెలుగుదేశం పార్టీలో ఎలాంటి వర్గ పోరు కనిపించలేదు. ఎమ్మెల్యేగా బొల్లినేని రామారావు ఏక నాయ కత్వమే కనిపించింది. ఈ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే కంభం విజయ రామిరెడ్డి పెద్ద వర్గ నాయకుడైనప్పటికీ ఆయనెప్పుడూ వర్గ రాజకీయాలను, గ్రూపు తగాదాలను ప్రోత్సహించలేదు. ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో సమన్వయంతో పనిచేశాడు. ఆయనతో కలిసిమెలిసి వున్నాడు.

అలాంటి నియోజకవర్గంలో టీడీపీలో కొత్తగా వర్గరాజకీయాలు చోటుచేసుకుం టున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండడం, ఉదయగిరి టిక్కెట్‌ ఆశించేవాళ్ళు పార్టీలో ఎక్కువవుతుండడంతో ఇక్కడ విభేదాలు రాజుకుంటున్నాయి.

ఉదయగిరి టిక్కెట్‌ రేసులో సిటింగ్‌ ఎమ్మెల్యేగా బొల్లినేని రామారావుతో పాటు కంభం విజయరామిరెడ్డి, కావ్య కృష్ణారెడ్డిలు కూడా వున్నారు. బొల్లినేని రామారావుకు వీళ్ళిద్దరితో సమస్య లేదు. టిక్కెట్‌ విషయంలో వీళ్ళిద్దరూ సిటింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు సహకారం కోరి వున్నారు.

కాని టిక్కెట్‌ రేసులో వున్న సీఎం ప్రోటోకాల్‌ ఆఫీసర్‌ అశోక్‌బాబు గాని, వరికుంట పాడు మండలం పార్టీ కన్వీనర్‌ ఎర్రా చినబ్రహ్మయ్య గాని బొల్లినేనిని పట్టించుకోలేదు. ఆయనను కలవకుండానే టిక్కెట్‌ విషయంలో తమ ప్రయత్నాలు తాము చేసుకోసాగారు. ఈ విషయంపైనే ఇటీవల ఉదయగిరి ఆర్‌అండ్‌బి అతిథిగృహంలో ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు, అశోక్‌బాబుకు మధ్య వాదన జరిగినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల వరికుంటపాడులో మండల పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించగా బొల్లినేని వర్గీయులకు, ఎర్రా చినబ్రహ్మయ్య వర్గీయులకు మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే బొల్లినేని రామారావు ఫోటో లేకుండా ఎర్రా చిన్నబ్రహ్మయ్య ఆదాల ప్రభాకర్‌రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రకటన ఇవ్వడాన్ని తప్పుపడుతూ బొల్లినేని వర్గీ యులు వాదనకు దిగారు. ఈ గొడవ నేపథ్యంలోనే పార్టీ నుండి ఎర్రా చిన్నబ్రహ్మయ్యను సస్పెండ్‌ చేశారు. కొత్తగా మండల కన్వీనర్‌ బాధ్యతను చండ్ర మధుకు అప్పగించడంతో ఒక వర్గం వాళ్ళు బొల్లినేనిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. మా ఊర్లలోకి ఎలా వస్తారో చూస్తామంటూ బొల్లినేనిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. మొత్తానికి ప్రశాంతంగా వుందనుకున్న ఉదయగిరి తెలుగుదేశంలోనూ ముసలం పుట్టినట్లయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here