Home జిల్లా వార్తలు ఉదయగిరి అభ్యర్థుల నిర్ణేతలెవరు?

ఉదయగిరి అభ్యర్థుల నిర్ణేతలెవరు?

జిల్లాలో మిగతా నియోజకవర్గాలన్నీ ఒకెత్తు.. ఒక్క ఉదయగిరి అసెంబ్లీ మాత్రం మరో ఎత్తు. ఈ ప్రాంతం అభివృద్ధి పరంగా వెనుకబడి వుంటుందనేగాని రాజకీయ పరిజ్ఞానంలో మాత్రం చాలా ముందుంటుంది. రాజకీయ పార్టీల అధిష్టానాలను సైతం ఆదేశించే స్థాయిలో ఈ ప్రాంతానికి చెందిన నాయకులుంటుంటారు.

జిల్లాలోని మిగతా నియోజకవర్గాలకు పార్టీ అధిష్టానాలే అభ్యర్థులను నిర్ణయిస్తుంటాయి. కాని, ఉదయగిరికి మాత్రం స్థానిక నాయకులే తమకు ఈ అభ్యర్థి కావాలని అధిష్టానానికి సూచి స్తుంటారు. వాళ్ళు సూచించిన అభ్యర్థికి సీటివ్వలేదంటే ఓడించ డానికి కూడా వెనుకాడరు.

ఎలక్షన్‌ల టైం దగ్గరపడుతున్న తరుణంలో ఉదయగిరిలో మళ్ళీ అటువంటి రాజకీయాలే చోటు చేసుకుంటున్నాయి. ఈసారి మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డికి సీటివ్వొద్దంటూ ఇటీవల ఉదయగిరి నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు జగన్‌ను స్వయంగా కలిసి కోరడం జరిగింది. చంద్రశేఖర్‌రెడ్డికి బదులు వాళ్ళ కుటుంబంలో నుండే మరొకరిని ఉదయగిరి అభ్యర్థిగా పెట్టాలని వాళ్ళు కోరుతున్నారు.

అలాగే టీడీపీలోనూ ఇదే పరిస్థితి. నియోజకవర్గంలో ప్రజలకు గాని, పార్టీ కార్యకర్తలకు గాని అందుబాటులోలేని ప్రస్తుత ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకు మళ్ళీ సీటు ఇవ్వొద్దని మండలస్థాయి నాయకులు పార్టీ అధిష్టానాన్ని కోరుతున్నారు. ఈ నియోజకవర్గ టీడీపీ నేతలు కొందరు మాజీఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పేరును అభ్యర్థిగా ప్రతిపాదిస్తుండగా, ఇంకొందరు కావ్య కృష్ణారెడ్డికి మద్దతునిస్తున్నారు. తాజాగా వరికుంటపాడు మండలంకు చెందిన బిల్డర్‌ ఎర్రా బ్రహ్మయ్య అనే నాయకుడు కూడా సీటును ఆశిస్తున్నాడు. మరి వైసిపి అయినా టీడీపీ అయినా స్థానిక నాయకుల అభిప్రాయాలకు ప్రాధాన్యతనిచ్చి అభ్యర్థులను ఎంపిక చేస్తాయో, లేక తమ ఆలోచనా ధోరణితోనే అభ్యర్థుల ఎంపికపై ముందుకుపోతాయో చూడాలి!?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here