Home జిల్లా వార్తలు ఉండేదెవరు.. పోయేదెవరు… వచ్చేదెవరు?

ఉండేదెవరు.. పోయేదెవరు… వచ్చేదెవరు?

తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ బలం పుంజుకోని జిల్లాల్లో నెల్లూరు ప్రథమంగా కనపడుతుంది. ఏ జిల్లాలో లేని విధంగా నెల్లూరుజిల్లాలోనే గెలుపు గుర్రాల సమస్య ఆ పార్టీని వెంటాడుతోంది. ముఖ్యంగా ఎవరు పార్టీలో నిలబడతారు? ఎవరు వస్తారు? ఎవరు బయటకు పోతారన్నదానిపై ఆ పార్టీలో స్పష్టత రాలేకపోతోంది. ఎవరన్నా ఒక గట్టినాయకుడు బయటకుపోతేనే దానివల్ల ఏర్పడే లోటును భర్తీ చేసుకోవడానికి నానా పాట్లు పడాల్సివస్తోంది.

జిల్లాలో లోక్‌సభకు గాని పది అసెంబ్లీ స్థానాలకు గాని ఈ సీటు ఫలానా నాయకుడిది అని స్పష్టంగా చెప్పే పరిస్థితి జిల్లా తెలుగుదేశం పార్టీలో లేదు. మాజీమంత్రి ఆనం రామ నారాయణరెడ్డి టీడీపీని వీడడంతో ఏర్పడ్డ లోటును భర్తీ చేసుకోవడానికి ఆ పార్టీ నాయకత్వం పెద్ద కసరత్తే చేయాల్సి వచ్చింది. ఆనం పార్టీని వీడడంతో ఆత్మకూరు టీడీపీలో వర్గవిభేదాలు తలెత్తడం తెలిసిందే! ఇనఛార్జ్‌ కోసం గూటూరు కన్నబాబు గొడవ చేసినా ఆయనను పక్కనపెట్టి నెల్లూరు పార్లమెంట్‌కు, నెల్లూరు రూరల్‌కు ఇన్‌ఛార్జ్‌గా వున్న ఆదాల ప్రభాకర్‌రెడ్డికే ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌ బాధ్యతలు అప్పగించారు. ఆత్మకూరులో పార్టీని లేపడం కోసం ఆయన ఇటీవల బాగానే తంటాలుపడ్డాడు. అయితే ఆయన ఆత్మకూరు అభ్యర్థి కాడు… కన్నబాబు సరిపోడు… మాజీఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు చూస్తే నాయకుడిగా ఓకేగాని ఆర్ధికంగా సరితూగలేడు. ఇక వున్న మార్గం మాజీఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించడం. చంద్రబాబు స్థాయిలో ప్రయత్నాలు సాగించి ఎట్టకేలకు బొల్లినేని కృష్ణయ్యను రంగంలోకి దించడానికి ఒప్పించారు. అన్నింటికంటే పెద్ద సమస్య లోక్‌సభ అభ్యర్థిపై క్లారిటీ రాకపోవడం. ఆదాల ప్రభాకర్‌రెడ్డి లోక్‌సభకు పోటీ చేస్తాడా? లేక అసెంబ్లీకి పోవాలనుకుంటున్నాడా? అందులో ఏ అసెంబ్లీ స్థానం… నెల్లూరురూరలా? కావలా? కోవూరా? ఇవన్నీ కాకుండా అసలు పార్టీయే మార తాడా? ఆదాలను ఆధారం చేసుకుని కనీసం మూడు స్థానాల అభ్యర్థుల ఎంపిక జరగాలి. ఆదాల కాకుంటే పార్లమెంట్‌కు అభ్యర్థిగా ఎవరిని పంపాలి? ఆదాల పార్టీలో వుంటే సరే… పార్టీని వదిలిపోతే నెల్లూరు లోక్‌సభ, రూరల్‌ అభ్యర్థులు ఎవరు? సూళ్ళూరుపేటలో పరసాను కొనసాగించడమా? ఆయన పట్ల వున్న వ్యతిరేకత దృష్ట్యా కొత్త అభ్యర్థిని రంగంలోకి దించడమా? గూడూరులో సిటింగ్‌ ఎమ్మెల్యే పాశం సునీల్‌కు సీటు ఇవ్వక తప్పని పరిస్థితి. ఆయనపై వ్యతిరేకత వున్నా తప్పదు. మంత్రి నారాయణ పోటీ చేస్తాడా? చేస్తే ఒక స్థానంలో అభ్యర్థి లోటు తీరినట్లే! చేయకపోతే ఇంకో గట్టి నాయకుడి కోసం వెదుకులాట తప్పదు. సిటింగ్‌ ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, బొల్లినేని రామారావు, పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి లపై ప్రజల్లో వ్యతిరేకత వుంది. అయినా కూడా వాళ్ళకే సీట్లిస్తారా? వారి స్థానాలలో కొత్త అభ్యర్థులను తెస్తారా?

ఇలా ఎన్నో ప్రశ్నలకు నెల్లూరుజిల్లా తెలుగుదేశంపార్టీ వేదికయ్యింది. ఒక్కో ప్రశ్నకు చిక్కుముడి విప్పుకుంటూ సమాధానం చెప్పే దిశగా జిల్లా దేశం నాయకులు ఇప్పుడిప్పుడే వేగంగా పావులు కదపడం మొదలుపెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here