Home రాష్ట్రీయ వార్తలు ఈ రణం.. ఇద్దరికీ జీవన్మరణం

ఈ రణం.. ఇద్దరికీ జీవన్మరణం

ఫైనల్‌ మ్యాచ్‌… గెలిచిన జట్టు కప్పు తీసుకుంటుంది. ఓడిన జట్టు బాధతో ఇంటికిపోతుంది. అయితే అటల్లో ఈ టోర్నీ కాకపోతే తదుపరి టోర్నీలో అయినా ఆడి గెలుద్దామనే ఆశ ఒకటి ఉంటుంది. ఇలాంటి ఆశలు రాజకీయాలలో ఎన్నికలనబడే ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో కూడా వుంటాయి. ఎన్నికలన్నాక పలు పార్టీలు పోటీ చేస్తాయి. అధికారం కోసం రెండు ప్రధానపార్టీలు తలపడతాయి. ఒక పార్టీ గెలుస్తుంది… ఒక పార్టీ ఓడుతుంది. ఓడిన పార్టీ వాళ్ళు మళ్ళీ ఐదేళ్ళ తర్వాత వచ్చే ఎన్నికల్లో పోరాడాలని డిసైడ్‌ అయిపోతారు. ఇదంతా కూడా దేశ రాజకీయాలలో కొనసాగుతూ వచ్చిన సరళి!

అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో రేపు జరుగబోతున్న ఎన్నికలు రెండు పార్టీల మనుగడకు కాదు ఇద్దరు నాయకుల రాజకీయ భవిష్యత్‌కు జీవన్మరణ సమస్యగా మారాయి. రాష్ట్ర చరిత్రలోనే ఇంతవరకు ఇలాంటి పోటీ ఎప్పుడూ రాలేదు. ఇక్కడ రెండు పార్టీల మధ్య కాదు, ఇద్దరు నాయకుల మధ్య యుద్ధం జరుగుతున్నట్లుగా వుంది. ఈ యుద్ధంలో గెలిచినవాళ్ళు రాష్ట్ర రాజకీయ తెరపై నిలదొక్కుకుంటారు. ఓడినవాళ్ళకు ఇక రాజకీయాలలో నిలబడే సీన్‌ వుండదు. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అయితే ఓడిపోతుందో, ఆ పార్టీ స్థానంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌ లేదా బీజేపీలలో ఒకటి ప్రత్యామ్నాయంగా దూసుకొచ్చే అవకాశముంది.

అటు ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు… ఇటు ప్రతిపక్ష నేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డికి ఈ ఎన్నికలు ఫైనల్స్‌ లాంటివే! చంద్రబాబుకు ఈ ఎన్నికల్లో గెలుపు అత్యంత అవసరం. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆయన గెలవాలనుకుంటున్నది తన కోసం కాదు… తన కొడుకు లోకేష్‌ను తన రాజకీయ వారసుడిగా నిలబెట్టడం కోసం. చంంద్రబాబు ఒంటి మీదకు ఏడు పదుల వయస్సు వచ్చింది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటుంటాడు కాబట్టి గట్టిగా వున్నాడు. ఇప్పుడు గనుక మళ్ళీ గెలిస్తే తెలుగుదేశం పార్టీని లోకేష్‌ చేతుల్లో పెట్టొచ్చు. తాను ఆరోగ్యంగా ఉన్నప్పుడే లోకేష్‌ను సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలి. ఐదేళ్లలో లోకేష్‌ను సెట్‌ చేయాలి. పార్టీపై అతని పట్టుండేలా చేయాలి. ఏ మాత్రం లోకేష్‌ వీక్‌ అయినా పార్టీ మళ్ళీ నందమూరి వారి చేతుల్లోకి పోతుందనే భయం వుంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే తాను మాజీ అవుతాడు… చంద్రబాబుకు అది సమస్య కాదు. కాని, లోకేష్‌ భవిష్యత్‌ ఏమిటి? జగన్‌ స్పీడ్‌కు అతను తట్టుకోలేడు. తెలుగుదేశం నాయకులూ రివర్స్‌ అవుతారు. జూనియర్‌ ఎన్టీఆర్‌ పక్కలో బల్లెం అవుతాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌ పార్టీ బాధ్యతలు తీసుకోవాలని ఆ పార్టీ నాయకులే డిమాండ్‌ చేయవచ్చు. ఈ పరిణామాలన్నీ తలెత్తకుండా వుండాలంటే ఈ ఎన్నికల్లో గెలిచి తీరాలి.

ఆ గెలుపు కోసమే చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తున్నాడు. రాష్ట్రంలో వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నాడు. పోలీసులను గబ్బు కొట్టిస్తున్నాడు. సిబిఐను లెక్క చేయడం లేదు. ఎన్నికల సంఘాన్ని ఖాతరు చేయడం లేదు. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రజాస్వామ్య విలువలను కాలరాసయినా గెలిచి తీరాలనే పట్టుదలతో వున్నాడు. గెలవడం కోసమే ఎన్నికలకు ముందర తాత్కాలిక తాయిలాలకు తెరలేపాడు. పవన్‌ కళ్యాణ్‌, కె.ఎ.పాల్‌ లాంటి వారిని ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి వాడుకుంటున్నాడు. ప్రజాశాంతి పార్టీ తరఫున దాదాపు 35 నియోజకవర్గాలలో వైకాపా అభ్యర్థుల పేర్లను పోలిన అభ్యర్థులనే చంద్రబాబు నిలబెట్టించాడంటే ఆయన గెలుపు కోసం ఎంతగా ఆరాటపడుతున్నాడో అర్ధమవుతుంది. ఎన్నికల్లో గెలవాలని మరో ప్రమాదకరమైన క్రీడకు కూడా చంద్రబాబు తెరలేపాడు. అదే కేసీఆర్‌ను బూచిగా చూపడం. ఆంధ్రా, తెలంగాణ అంటూ ప్రజల మధ్య విద్వేషాన్ని రగిల్చే విషపు ఆలోచనలు కూడా చేస్తున్నాడు. జగన్‌కు కేసీఆర్‌కు మధ్య పొత్తు అంటగట్టి జగన్‌ గెలిస్తే ఆంధ్రాపై కేసీఆర్‌ పెత్తనం సాగిస్తాడనే పెడధోరణి ప్రచారం చేస్తున్నాడు. ఈ ఐదేళ్ల తన పాలనను చూసి ప్రజలు ఓట్లేయరనే భయానికి గురయ్యాడేమో… జాతీయ స్థాయి నాయకులైన ఫరూక్‌ అబ్దుల్లా, అరవింద్‌ కేజ్రీవాల్‌, స్టాలిన్‌, మమతా బెనర్జీ వంటి వారితో కూడా రాష్ట్రంలో ప్రచారం చేయించుకుంటున్నాడు. తన నలభై ఏళ్ల రాజకీయ చరిత్రలోనే చంద్రబాబు ఇంత అధమస్థాయికి ఎప్పుడూ దిగజారలేదు. ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇక తనకు రాజకీయ వారసత్వం వుండదనే భయమే చంద్రబాబు చేత ఇన్ని పనులు, ప్రయత్నాలు చేయిస్తుంది.

వైసిపి అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డికి రాజకీయ రణక్షేత్రంలో పోరాడడమా లేక కాడె దించేసి తన పని తాను చేసుకుపోవడమా… నిర్ణయించే ఎన్నికలివి. దేశ చరిత్రలోనే ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు దాదాపు 9ఏళ్ళు అవిశ్రాంతంగా పోరాడడం అన్నది ఒక్క జగన్‌ విషయంలోనే జరిగి వుండొచ్చు. 9ఏళ్లుగా ప్రజలతో ఇంతగా కలిసివున్న ప్రాంతీయ పార్టీ నాయకుడు ఇంకొకరు లేరు. 2014లో ఓడిపోయినప్పుడు జగన్‌ స్థానంలో ఇంకొకరు వుండుంటే పార్టీ మూతేసి తన దారి తాను చూసుకునిపోయుండేవాడు. జగన్‌ మొండి మనిషి. వై.యస్‌.రాజశేఖర్‌రెడ్డి రక్తమది. పట్టుదలకు ప్రతిరూపమది. రాజకీయ పోరాటంలో మడమతిప్పలేదు. సోనియాగాంధీని మొదలుకొని ఏబిఎన్‌ రాధాకృష్ణ దాకా ఈ 9ఏళ్లు అందరితో యుద్ధమే చేశాడు. ఇన్నేళ్ళు ఆయన ఓపికగా భరించింది ఈ ఎన్నికలలో గెలుపు కోసమే! పార్టీని గెలిపించడం కోసం ఒక పార్టీ అధినేతగా ఎంత చేయాలో అంతకంటే ఎక్కువే చేశాడు జగన్‌. 2014 ఎన్నికలనాటి లోపాలను చాలావరకు సరిదిద్దుకున్నాడు. పార్టీ టిక్కెట్లలో అన్ని వర్గాలకు ప్రాధాన్యతనిచ్చాడు. తన సొంత విధానాలను సైతం పక్కనపెట్టి పార్టీలోకి వస్తామన్న బలమైన నాయకులను పార్టీలోకి తీసుకున్నాడు. ఈ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా జగన్‌ చేయని ప్రయత్నమంటూ లేదు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓడిపోవడం అంటూ జరిగితే జగన్‌కు పార్టీని నిలబెట్టుకోవడం ఇక కష్టం కావచ్చు. జగన్‌కు వయసుంది. పోరాడే శక్తి వుంది. కాని అధికారం లేకుంటే కేడర్‌ నిలవదు. లీడర్‌ నిలవడు. పార్టీ నిలవదు.

కాబట్టి చంద్రబాబుకైనా జగన్‌కైనా ఈ ఎన్నికలు జీవన్మరణ పోరాటమే! మరి ఏపి ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఎవరి రాజకీయ జీవితానికి చరమగీతం పలుకుతారో చూడాలి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here