Home జిల్లా వార్తలు ఈ ముగ్గురిలో… ఎవరు బెటర్‌?

ఈ ముగ్గురిలో… ఎవరు బెటర్‌?

ఆనం రామనారాయణరెడ్డిపై తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆశలు వదులుకున్నట్లుగానే కనిపిస్తోంది. ఆయనను ఇక పార్టీలో నిలబెట్టలేమని వారికి అర్ధమై పోయింది. ఈ జిల్లాలో తెలుగుదేశంపార్టీ గట్టి పోటీ ఇస్తుందనుకున్న నియోజకవర్గాలలో ఆత్మకూరు ఒకటి! అది కూడా ఆనం రామనారాయణరెడ్డి అభ్యర్థి అయితే! ఆయనే లేకుంటే గట్టిపోటీ ఇవ్వడం కష్టం. ఆయనే అవతల వైసిపి అభ్యర్థి అయితే పోటీ ఇంకా కష్టం.

ఏ నియోజకవర్గంలో ఎవరు మేటి అభ్యర్థి కాగలరు? అని నియోజకవర్గాల వారీగా తెలుగుదేశంపార్టీ సర్వే నిర్వహిస్తోంది. ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి నిర్వహిస్తున్న సర్వేను ముగ్గురు నాయకుల మీదే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. వీరిలో ఒకరు మాజీఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు కాగా, ఇంకొకరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, మూడో నాయకుడు 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన గూటూరు కన్నబాబు! ఆనం రామనారాయణరెడ్డి నూటికి నూరు శాతం తెలుగుదేశంలోనే ఉంటా డనుకుంటే అసలు ఇక్కడ సర్వేనే అవసరం లేదు. ఆనం రామనారాయణరెడ్డి పేరు తప్ప ఇంకో పేరుతో పనేలేదు. ఆయన పార్టీని వదిలి వెళ్ళిపోతాడనే నమ్మకంతోనే ఆత్మకూరుకు ప్రత్యామ్నాయ అభ్యర్థి అన్వేషణ మొదలైనట్లు తెలుస్తోంది.

ఈ కోణంలోనే నాలుగేళ్ళ నుండి రాజకీయాలకు దూరంగా వుంటున్న కొమ్మి లక్ష్మయ్యను మళ్ళీ తెరమీదకు తెచ్చారు. ఈయన ఆత్మకూరులో ఒకప్పుడు గట్టి నాయకుడే! పార్టీ గుర్తు లేకుండా ఇండిపెండెంట్‌గా గెలిచి సత్తా చాటుకున్న నాయకుడు. కాకపోతే నియోజకవర్గంలో అప్పుడున్నంత క్రేజ్‌ ఇప్పుడు లేదు. గతంలో సహకరించిన ‘రెడ్డి’ వర్గం ఇప్పుడు మద్దతుగా నిలిచే పరిస్థితి లేదు. గూటూరు కన్నబాబు కూడా సరిపోడని 2014 ఎన్నికల్లోనే తేలింది. ఎన్నికల తర్వాత ఆత్మకూరు ఇన్‌ఛార్జ్‌గా వుంటూ కొంత బలం పెంచుకునే ప్రయత్నం చేస్తుండగానే కన్నబాబును చంద్రబాబే పక్కన పెట్టాడు. మళ్ళీ ఇప్పుడు అభ్యర్థిగా పెట్టినా పుంజుకోవడం కష్టం. వీళ్ళిద్దరిదీ ఒకే సామాజికవర్గం. అభ్యర్థి ఏ వర్గం వాళ్ళయినా కమ్మ సామాజిక వర్గీయుల ఓట్లు 90శాతం తెలుగుదేశంకే పడతాయి. ఇక్కడ ‘రెడ్ల’లో చీలిక ముఖ్యం. ఈ కోణంలోనే ఆ సామాజికవర్గానికి చెందిన మెట్టుకూరు ధనుంజయరెడ్డి పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆత్మకూరుకు ఫ్రెష్‌ క్యాండేట్‌, ఆర్ధికంగా నిలబడగలడు, స్థానికుడు, వివాద రహితుడు. ఇరు పార్టీల నాయకులతోనూ సత్సంబంధాలున్నాయి. కొంతవరకైనా ‘రెడ్ల’ ఓట్లను తెచ్చుకోగలడు. కాబట్టి ఈ ముగ్గురిలో మెట్టుకూరువైపే మొగ్గు కనపడవచ్చు. అయితే వైసిపి అభ్యర్థి ఎవరనేదానిని బట్టే ఈ ముగ్గురిలో ఎవరు బెటర్‌ అనేది ఫైనల్‌గా తేలుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here