Home సంపాదకీయం ఈ దారుణాలకు అంతమెప్పుడు?

ఈ దారుణాలకు అంతమెప్పుడు?

దేశంలో నానాటికీ చిన్నపిల్లలు, యువతులు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతూనే ఉన్నాయి. అబలలపై అత్యాచారాలు, అమాయక బాలికలపై ఘోరాలతో దేశం అట్టుడికిపోతూనే ఉంది. దేశవ్యాప్తంగా అనేక దారుణ ఉదంతాలు ఎప్పటికప్పడు బయటపడుతూనే ఉన్నాయి. ఇటీవల బీహార్‌లో..కనీసం మానవత్వం లేని కామపిశాచాల రాక్షసప్రవృత్తి దేశప్రజలను కంటతడిపెట్టించింది. తమకంటూ ఎవరూలేని అసహాయులైన అనాధబాలికలను కూడా చిదిమేయడం చూసి సభ్యసమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. దేశంలో నానాటికీ అనేకప్రాంతాల్లో ఇలాంటి హింసలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటీవలే జమ్ము కశ్మీర్‌లోని కథువా, ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌ ప్రాంతాల్లో జరిగిన పైశాచిక ఘటనల్లో అమాయక బాలికలపై జరిగిన ఘోరమైన అత్యాచారాలతో దేశం అట్టుడికిపోయింది. దీంతో లైంగిక నేరాలకు పాల్పడేవారిపై మరింత కఠినశిక్షలను వేయడానికి అవసరమైన బిల్లులను లోక్‌సభ ఆమోదించడంతో, బాలికలపై అత్యాచా రాలు చేసేవారికి మరణదండన విధించాలనే గట్టి నిర్ణయం తీసుకోవడం చరిత్రాత్మకం. అయినప్పటికీ ఇలాంటి నేరాలు ఘోరాలు తగ్గకపోవడమే విచారకరం. చట్టాలు ఎంత పటిష్టంగా ఉన్నా వాటిని పకడ్బందీగా అమలుచేయలేకపోవడమే లోపం అనిపిస్తోంది.

మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు గతంలో కంటే బాగా పెరిగిపోతున్నాయని, గతంతో పోలిస్తే ఇప్పుడు 83 శాతం పెరిగాయని, అందులోనూ దేశంలో అత్యాచారాలకు గురవుతున్నవారిలో అత్య ధిక శాతం మైనర్లేనని, గత పదేళ్ళతో పోలిస్తే వీటి సంఖ్య అయిదింతలు పెరిగిందని కూడా జాతీయ నేరగణాంక సంస్థ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రతినిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలపై, బాలికలపై కామపిశాచాలు అత్యంత పైశాచికత్వంగా దారుణాలకు ఒడిగడుతూనే ఉన్నాయి. అమాయక బాలికలను, యాచకుల పిల్లలను తీసుకొచ్చి వారిచేత వ్యభిచారం చేయిస్తున్న ఘోరాలు తాజాగా తెలుగు రాష్ట్రాల్లోనూ అక్కడక్కడా బయటపడుతూనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇలా బాలికల పట్ల అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయనేందుకు తాజాగా బీహార్‌లోని ముజఫర్‌పూర్‌ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. అక్కడ ఓ బాలికల అనాధాశ్రమంలో మైనర్‌బాలికలపై సాగిన అఘాయిత్యాల పరంపర దేశాన్నే దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. అక్కడున్న 30మందికి పైగా బాలికలపై నెలల తరబడి అక్కడి సిబ్బంది జరిపిన లైంగిక దాడుల కథనాలు వింటే, దేశంలో కామపిశాచాలు ఎంతగా వీరవిహారం చేస్తున్నాయో అర్ధమవుతుంది. బీహార్‌లోని అనాధాశ్రమాల్లో టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ వారు జరిపిన సామాజిక తనిఖీల్లో ఈ అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. అక్కడి అనాధాశ్రమ నిర్వాహకుడు అనాధాశ్రమంలోని పసిమొగ్గ లను బలిపెట్టేందుకు, వచ్చినవారిని రహస్యంగా అనాధాశ్రమంలోకి పంపేందుకు ఏకంగా రహస్య మార్గాలను ఏర్పరచడం, అన్నంలో మత్తుమందు కలిపి బాలికలపై అత్యాచారాలు సాగించడం, అందుకు ఎవరైనా ఎదురుతిరిగితే వారిని తీవ్రంగా కొట్టడం వంటివి అక్కడ నిత్యకృత్యాలని తేలింది. ఆ హింసలను తట్టుకోలేక కొందరు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించారట కూడా. ఇదే అనాధాశ్రమంలో 11మంది యువతులు కూడా కన్పించడం లేదనే సమాచారం ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది. వారేమైపోయారో.. లేక వారినేమిచేశారో తేలాల్సి ఉంది. ఇలాంటి అకృత్యాల ఆశ్రమాలు బీహార్‌లో అదొక్కటే కాదు.. ఇంకా అనేకం ఉన్నాయనేది మరో నిర్ఘాంతపోయే సమాచారం. దేశవ్యాప్తంగా అనాధాశ్రమాల్లో, వసతిగృహాల్లో తనిఖీలు లేకపోవడం, నిఘా వ్యవస్థలు నిద్రపోతుండడం, ఇదే అదనుగా అబలలను, అమాయకులను ఏమి చేసినా ఎవరూ అడిగేవారు లేరనే అహంకారం పెరిగిపోతుండడంతో దేశంలో సర్వత్రా ఇలాంటి నేరాలు జరిగిపోతూనే ఉన్నాయి. ఇలాంటి ఘోరాలు చేసే రాక్షసులకు రాజకీయంగా అండదండలుం డడమో, లేక వారు ధనగర్వంతో మిడిసిపోతుండడమో, అధికారయంత్రాంగంతో సహా ఎవరినైనా మభ్యపెట్టి తమ రాక్షసక్రీడకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చేసుకోవడమో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అందు వల్ల అసహాయులైన అబలలు, బాలికలు తమ దురవస్థను ఎవరికీ ఏమీ చెప్పుకోలేక, చెప్పుకున్నా చివరికి తమ బతుకే నాశనమైపోతుందేమోననే భయంతో నిత్యం ఆ నరకంలో పడి ఏడుస్తూ బతుకు లీడుస్తున్నారంటే.. ఎంత దయనీయం!… ఒకవైపు దుర్భర దారిద్య్రం, మరోవైపు తమకంటూ ఎవరూ లేని అనాధస్థితిలో.. చివరికి ఏ గతీ లేక ఏ వసతిగృహాలనో, అనాధాశ్రమాలనో ఆశ్రయించిన అభాగ్యుల పట్ల కూడా ఇలాంటి అకృత్యాలు జరుగుతుండడం దేశ ప్రజలను కంటతడిపెట్టిస్తున్నాయి. కనీస మానవత్వమే లేని అలాంటి మానవ మృగాలను ఇంకా మరెంత కఠినంగా శిక్షించాలో!….కాస్తంత చేయూతనందిస్తే చాలు అన్ని రంగాల్లో ప్రతిభా పాటవాల్తో ముందుకు దూసుకు వెళ్తూ.. ఇటు కుటుంబానికి, అటు దేశానికి ఎంతో మానవీయమైన.. మహోన్నతమైన సేవలం దిస్తున్న మహిళాలోకానికి పూజ్యభావంతో ఎంత సేవ చేసినా పుణ్యమే. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలుంటారని ప్రతీతి. అలాంటి ప్రగాఢ విశ్వాసం, దైవచింతన.. మానవీయభావాలకు పుట్టినిల్లయిన మనదేశంలో కూడా మహిళల పట్ల, బాలికల పట్ల లైంగికదాడులు, హింసలు పెరిగి పోతుండడం ఎంతైనా బాధాకరం. ఇకనైనా ఈ అరాచకాలను వెంటనే అరికట్టాలి. కేవలం చట్టాలు చేసేసి చేతులు దులుపుకున్నంత మాత్రాన ప్రయోజనం లేదు. చట్టాలెంత పకడ్బందీగా ఉన్నా, వాటిని పటిష్టంగా అమలుచేయలేకపోవడం వల్ల ఎంతోమంది అమాయకులు ఇలా బలైపోతూనే ఉంటారు. ఆ చట్టాలతో దోషులకు కఠినశిక్షలను విధించినప్పుడే.. చేసిన చట్టాలకు సార్థకత. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం కొరడా పట్టుకుంటే తప్ప ఈ రాక్షసమూకల్ని..కామపిశాచుల్ని నియంత్రించడం ఎవరికీ సాధ్యం కాదు. అదేవిధంగా చిన్నతనం నుంచి పిల్లలకు నైతికవిద్య బోధిస్తూ, అన్ని రకాల విష సంస్కృతులకీ వారిని దూరంగా ఉంచుతూ, మంచితనాన్ని-సేవాభావాన్ని వారిలో పెంచుతూ..బాలలను పవిత్రంగా.. భావిభారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన కర్తవ్యాన్ని కూడా ఎవరూ విస్మరించరాదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here