Home సంపాదకీయం ఈ తీరు మారాలి

ఈ తీరు మారాలి

ఎన్నికలొస్తే చాలు.. ఎక్కడ చూసినా నోట్ల కట్టల గుట్టలు, మద్యం ప్రవాహాలే!.. అధికారులెంతగా దాడులు చేస్తూనే ఉన్నా అవి కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. మనదేశంలో ఎన్నికలంటే.. డబ్బు.. మద్యం ప్రవాహాలనే అపనిందకు గురిచేస్తున్నాయి. ఎన్నికలొచ్చాయంటే చాలామందికి పండుగలా ఉంది. ఇది మంచి ఛాన్స్‌!.. ఇంతకంటే అవకాశం మళ్లీ అయిదేళ్ళ దాకా రానేరాదు కనుక, దీపం ఉండగానే.. అన్నీ చక్కబెట్టేసుకోవాలనుకునే స్వార్ధం సర్వత్రా ప్రబలిపోతోంది.

అయినా, కలికాలం ప్రభావమో ఏమో కానీ, అటు నాయకులు.. ఇటు ప్రజలు కూడా ఎక్కువమంది ఇలాంటి అపసవ్య ధోరణిలోనే సాగిపోతుండడం ఎంతైనా బాధాకరం!.. అట్లని అందరూ ఇలాగే ఉం టారని చెప్పలేం… ఎంతోమంది నిజాయితీపరులూ లేకపోలేదు. నాయకులు మాత్రం అందరినీ ప్రలోభ పెట్టి ఓట్లు రాబట్టేందుకు దారులు వెతుక్కుంటుంటారు. ధనమా!.. మద్యమా!.. ఏదో ఒకటి, లేదా రెండూ మీ కోసం రెడీగానే ఉన్నాయంటూ ఊరిస్తుంటారు. ఈసారి ఎన్నికల్లో కూడా వేలకోట్ల రూపాయల ధనం పొంగిపొర్లింది. కోట్లాది లీటర్ల మద్యం ప్రవాహం దేశమంతటా వెల్లువెత్తింది. ఓట్ల కోసం డబ్బును, మద్యాన్ని ఎరగా వేసే దుశ్చర్యలు సర్వసాధారణ మైపోయాయి. ప్రత్యేకించి మనరాష్ట్రంలో ఓటు కోసం పూటుగా నాటుసారా కూడా సరఫరాకు సిద్ధమైం దంటే విడ్డూరమేం కాదు.

ఈ ఎన్నికల రోజుల్లో… అంటే మార్చి 1 నుంచి ఏప్రిల్‌ 7వ తేది వరకు అధికారులు పట్టుకున్న మద్యం వివరాలు చూస్తే.. ఈ ఎన్నికల్లో మద్యం ప్రవాహం ఎంతగా పోటెత్తిందో తెలుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 6,18,365 లీటర్ల మద్యాన్ని పట్టుకోగా, ఇందులో 1,43,811 లీటర్ల నాటుసారా కూడా ఉంది. మరో 2,37,937 లీటర్ల లిక్కర్‌, 2,25,497 లీటర్ల బీర్‌ వగైరాలున్నాయి. ఇవి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పన్ను చెల్లించని ఎన్‌డిపిఎల్‌ మద్యాన్ని కూడా 11,119 లీటర్లు పట్టుకున్నారు. వీటి మొత్తం విలువ సుమారు 22.99 కోట్ల రూపాయలట. ఇవి మొన్నటికి పట్టుబడినవి..పట్టుబడకుండా దొంగచాటుగా ఇంకెంత భారీస్థాయిలో మద్యం సరఫరా అయిపోయిందో ఎవరికెరుక?.. మరోపక్క, ఎన్నికల వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. ఎన్నికల కమిషన్‌ విధించిన పరిమితికన్నా ఎన్నో రెట్లు ఎక్కువగా డబ్బు ఖర్చుపెట్టే అభ్యర్థులకు మనదేశంలో కొదవే లేదు. ఎన్నికల వ్యయం అత్యంత భారీగా పెరుగుతుండడం వల్ల సామాన్యులనేవారు ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేనే లేదనుకోండి..అది వేరే విషయం!.. అభ్యర్థులు కోట్ల రూపాయలు వెదజల్లితే తప్ప ఎన్నికల్లో గెలవలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో నిలిచేది..గెలిచేది ఎందుకంటే, తాము ఖర్చుపెట్టిన దానికన్నా ఎక్కువ సంపాదించుకోవడానికే కదా..అన్నట్లుగా ఉంది పరిస్థితి. దీన్నిబట్టి చూస్తే ఇదంతా రాజకీయంగా కాక, ఒక వ్యాపారంగా మారుతోందని సామాన్యుని సణుగుడు. ఈ నేపథ్యంలో అభ్యర్థి ఖర్చుపెట్టే మొత్తాల వివరాలను ఎన్నికల కమిషన్‌కు తెలపాలనే నిబంధనలున్నా, అసలు అభ్యర్థి నేరుగా ఖర్చుపెట్టే మొత్తం కంటే, వారి బినామీ వ్యక్తులు ఖర్చుచేసే మొత్తాలకు లెక్కలెక్కడుంటున్నాయి?.. ఎన్నికల సంఘానికి దొరక్కుండా ఇలాంటి వెన్నో సైగ్గా జరిగిపోతూనేవున్నాయి. ఎన్నికల వేళ తనిఖీలు ముమ్మరంగా ఉన్నా.. నోట్ల కట్టలు మూటలకొద్దీ దొరుకుతున్నాయంటే.. జనాన్ని ప్రలోభపెట్టడానికి నాయకులు పడుతున్న ‘అగచాట్లు’ కళ్ళకు కడుతున్నాయి. తనిఖీలో నోట్ల కట్టలు గుట్టలుగా దొరుకుతున్నా, అంతకు మరెన్నో రెట్ల ధనం బినామీల ద్వారా ఆయా ప్రాంతాల్లో చాపకింద నీళ్ళలా ప్రవహించడం తెలియనిదెవ్వరికి?.. అయినా, ఇవన్నీ చాటుమాటు వ్యవహారాలే కదా!..

ఎన్నికల్లో ఎంపీగా నెగ్గాలంటే కనీసం 50 కోట్లదాకా, అసెంబ్లీ స్థానాల్లో గెలవాలంటే కనీసం 10 కోట్లయినా ఉంటే తప్ప జరగని పరిస్థితి. ఎన్నికల్లో గెలిస్తే చాలు.. ఖర్చుపెట్టినదంతా సంపాదించుకోవడమే కాక, మరెంతో ధనాన్ని కూడగట్టుకోవచ్చనేది అనేక మంది నాయకుల ఆలోచన కావచ్చు. అంతే కాదు, అభ్యర్ధులు.. తాము గెలిచినా తమ పార్టీ అధికారంలోకి రాకపోతే, అధికారం వచ్చిన పార్టీలోకి దూరిపోవడానికి పార్టీ మారడం చాలా సులభమైపోయింది. ఇలాంటి వాటన్ని టినీ అరికడుతూ మనదేశంలో ఎన్నికల విధానాలు మరింతగా కట్టుదిట్టంగా ఉండాలి. ఎవరైనా పార్టీ మారితే వెంటనే తమ సభ్యత్వం కోల్పోతారని, మళ్ళీ ఎన్నికైనాకనే సభ్యత్వం వచ్చేలా చేయాలి. అంతేకాదు, రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని అన్ని పార్టీలకు వచ్చిన ఓట్లశాతం వారీగా వారు గెలు పొందిన సీట్లను కేటాయించే విధానం వస్తే బాగుం టుందనే విజ్ఞుల అభిప్రాయాలను కూడా పరిగణన లోకి తీసుకోవాలి. దేశంలో ప్రధానిని, ఆయా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రు లను నేరుగా ఎన్నుకునే విధానం రావాలి. అవినీతి పరులను, నేరస్తులను ఎన్నికల్లో పోటీకి అనర్హులను చేస్తూ.. రుజువర్తన కలిగిన అభ్యర్థులు ఎన్నికల్లో నిల బడేలా ప్రోత్సహించాలి. ఇలా.. అన్నిరకాల అభి ప్రాయాలను పరిశీలించి తగు నిర్ణయాలు తీసుకోవాలి.

ఈ నేపథ్యంలో, ప్రజలు కూడా తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. మనదేశం-మన భవిష్యత్తు.. మన ప్రగతి అంతా మన ఓటులోనే ఉందని గుర్తించి, దేశహితాన్ని.. ప్రజాశ్రేయస్సును కోరుకునే విజ్ఞులైనవారిని మనమే విజ్ఞతతో ఎన్నుకోవాలి. ఇకనైనా, ఎన్నికల్లో సర్వసాధారణంగా జరుగుతున్న ధనప్రవాహం, మద్యం ప్రలోభాలు వంటి దుర్నీతులన్నిటినీ.. రకరకాల తాయిలాలిచ్చే లోపాయికారి విధానాలన్నిటినీ పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ఎన్నికల సంఘం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. విజ్ఞులు, మేధావులు అందరూ బాగా ఆలోచించి మన ఎన్నికల విధానాలను మరింత బాగా పటిష్టం చేయాలి. అవసరమైతే కొత్త చట్టాలను కూడా తీసుకురావాలి.

ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన మన భారతదేశం ప్రపంచమే గర్వించేలా…నీతి నిజాయితీలకు ప్రతీకగా..అత్యుత్తమమైన ప్రజాస్వామ్యానికి పతాకగా నిలిచేలా మన విధానాలను మనమే పటిష్టం చేసుకోవాలి..బంగారు భారతావనిని మనమే తీర్చిదిద్దుకోవాలి!…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here