Home సంపాదకీయం ఈవిఎంలపై రాజకీయ రాద్ధాంతం

ఈవిఎంలపై రాజకీయ రాద్ధాంతం

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల (ఈవిఎం)ల మీద మళ్ళీ విమర్శల దుమారం మొదలైంది. ఎన్నికలు వస్తున్నప్పుడూ, ఎన్నికలు పూర్తయ్యాక ఫలితాలు వెలువడినప్పుడు సాధారణంగా ఈవిఎంలపై లేనిపోని వివాదాలు రేగుతుండడం గతంలో ఎన్నోసార్లు మనం చూశాం. అధికారపక్షం ఓడిపోయినప్పుడు విపక్షాలకు ఈవిఎంల జోలికి పోకపోవడం, అధికారపక్షం గెలిచినప్పుడు ఆ తప్పంతా ఈవిఎంలదే అన్నట్లుగా మాట్లాడుతుండడం మామూలే. అంతేకాదు, ఏ అభ్యర్థి అయినా ఓడిపోయినప్పుడు కూడా తన ఓటమికి కారణంగా తొలుత విమర్శించేది ఈవిఎంలనే.

ఇప్పుడు తాజాగా సయ్యద్‌ షుజా అనే స్వయంప్రకటిత హ్యాకర్‌ గురించి ఏమాత్రం అవగాహన లేకుండా మీడియా సమావేశం ఏర్పాటు కావడం ఏమిటో అర్ధం కాదు. తాను అమెరికా నుంచి లండన్‌ వచ్చి ఈవిఎంలను ఎలా హ్యాక్‌ చేయవచ్చో చేసి చూపిస్తానంటూ చెప్పిన ఆ వ్యక్తి… చీకట్లో ముఖానికి గుడ్డ కట్టుకుని కూర్చుని, మొదట చెప్పినదానికి భిన్నంగా స్కైప్‌ ద్వారా అర్ధంపర్ధంలేని మాటలు మాట్లాడడంతో అంతా గందరగోళం ఏర్పడింది. అమెరికాలో ముసుగేసుక్కూర్చుని స్కైప్‌ ద్వారా లండన్‌లో మీడియాతో మాట్లాడిన సయ్యద్‌ షుజా లేవనెత్తిన విషయాలన్నీ ఒకదానికొకటి పొంతనలేనివే కావడం, తాను చెప్పిన మాటలను షుజా రుజువు చేసుకోలేకపోవడం గమనార్హం. ఇలా, ఎన్నికలొస్తు న్నప్పుడల్లా ఇలాంటి వ్యవహారాలకు లేనిపోని ప్రాధా న్యత ఏర్పడుతుండడం మనం తరచూ చూస్తున్నదే. అయితే, ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు. ఎవరికైనా ఈవిఎంలపై ఎలాంటి అనుమానం వచ్చినా ఎన్నికల సంఘం ద్వారా ఆ అనుమానాలు తీర్చు కోవడానికి తగు మార్గాలున్నాయి. ఆ అనుమానాలు తీర్చుకునేందుకు సరైన పద్ధతులు అనుసరించాలే తప్ప, ఎవరి చిత్తానుసారం వారు ప్రవర్తించినందువల్ల అనవసర రాద్ధాంతాలే తప్ప మరెలాంటి ప్రయోజనం ఉండదు. అందులోనూ మనది ప్రజాస్వామ్య వ్యవస్థ. ఈ వ్యవస్థలో ఎంతో కీలకమైనవి ఎన్నికలు. అందువల్ల ఈ ఎన్నికలు ఎలాంటి అనుమానాలకు ఆస్కారం లేకుండా సక్రమంగా, పటిష్టంగా జరగాలని అంద రూ భావిస్తుంటారు. ప్రజల తీర్పు వమ్ము కాకుండా స్పష్టంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అందువల్లనే ఈవిఎంలను ఎంతో పకడ్బందీగా, ఎలాంటి అపోహలకు అనుమానాలకు తావు లేకుండా ఖచ్చితమైన విధానాలతో రూపొందిస్తారు. వాటికి ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లు, కోడ్‌లు అన్నీ ఎంతో పకడ్బందీగా ఉంటాయి. ఏ విధంగా కూడా ఇవి బహిర్గతం కానే కావు. అయినప్పటికీ ఈవిఎంలపై ఎవరికైనా ఏదైనా అనుమానం వస్తే, తమ అనుమానాలను తీర్చుకోవడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఎన్నికల సంఘం ముందుకొచ్చి అందుకు తగు వివరణలు ఇస్తూనే ఉంటుంది. గతంలో ఒకసారి, 2010లో ఈవిఎంలను ఎలా ట్యాంపర్‌ చేయవచ్చునో ప్రయోగాత్మకంగా చేసి చూపిస్తానంటూ ఒక వ్యక్తి ప్రకటిస్తే.. నాటి మాజీ సిఎం చంద్రబాబునాయుడు ఆ వ్యక్తికి మద్దతు పలికి ఢిల్లీ దాకా వెళ్ళి దాన్నొక జాతీయస్థాయి వివాదంగా మార్చడానికి ప్రయత్నించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అయితే, ఆ వ్యక్తి

ఉపయోగించిన ఈవిఎం ముంబై కలెక్టరేట్‌ నుంచి మాయమైన చోరీ సొత్తు అని తేలడం, చివరికి ఆ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేయడం కూడా జరిగింది. అలా ఉంటాయన్నమాట సంగతులు. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే..ఎన్నికలొస్తున్నాయంటే ఇలాంటి వ్యవహారాలపై అనవసర అనుమానాలు కల్పించి ప్రజలను అయోమయానికి గురిచేయడం..తద్వారా తమకు ‘భలే పబ్లిసిటీ’ వస్తుందని అనుకునే ఒక తరహా మనుషులూ లేకపోలేదు. అలా ఈవిఎంల మీద అనుమానాలు రేకెత్తిస్తూ.. ఫ్రీ పబ్లిసిటీ పొందాలనుకున్నాడో ఏమో.. లండన్‌లో కూర్చుని స్కైప్‌ ద్వారా పొంతన లేని మాటలతో అందరినీ హడలగొట్టిన షుజా ఉదంతం బహుశా ఇలాంటిదేమోనని అనిపిస్తోంది. కానీ, ఈవిఎంల విషయంలో ఎలాంటి అనుమానాలు ఏ విధంగా వెల్లడైనా ఆ అనుమానాలను తీర్చేందుకు ఎన్నికల సంఘం ఎల్లవేళలా సంసిద్ధంగానే ఉంటుంది. గతంలో..2004 ఎన్నికల్లో చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈవిఎంలపై ఆయనెలాంటి ఆరోపణలు చేయలేదు కానీ..2009 ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు మాత్రం ఈవిఎంలలో ఏదో మోసం జరిగిపోయిందంటూ గగ్గోలు పెట్టడం అందరికీ తెలిసిందే. ఇప్పుడు అధికా రంలో ఉన్న బిజెపి ఇప్పుడైతే ఈవిఎంల మీద నోరు మెదపడం లేదు కానీ, గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఈవిఎంల మీద తనకు కూడా అనుమానాలున్నా యంటూ కలకలం రేకెత్తించింది. మనం గెలిస్తే.. అది మన బలం. ఓడితే మాత్రం నిందలన్నీ ఈవిఎం లపైనా?.. ఇదేమి రాజకీయమో సామాన్యులకు అర్ధం కాదు. అప్పుడైనా, ఇప్పుడైనా ఎప్పుడైనా సరే ఈవిఎంల మీద అనుమానాలుంటే వాటిని పరీక్షించేందుకు తమకు అవకాశం ఇవ్వాలని విపక్షాలు ఎన్నికల సంఘాన్ని కోరవచ్చు. గతంలో బాలెట్‌ పత్రాలు ఉన్న రోజుల్లో.. బ్యాలెట్‌ బాక్సుల పరిరక్షణ ఒక పెద్ద కసరత్తుగా ఉండేది. ఆ బాక్స్‌లను ఎత్తుకెళ్ళడం, పగలగొట్టడం.. తగలబెట్టడం వంటి ఘటనలు జరిగేవి. దీంతో ఫలితాల ప్రకటన ఆలస్యమవడం జరుగుతుండేది..ఈ విషయాలన్నీ అందరికీ తెలిసినవే. ఇప్పుడా రోజులు గతించిపోయాయి. ఎక్కడికక్కడ పకడ్బందీగా ఈవిఎంల ద్వారా ఓట్లు వేయడం వల్ల గతంలో ఉన్న అనేకరకాల సమస్యలు సమసిపోయాయి. ఇదెంతో ఆహ్వానించదగిన పరిణామం. అయితే, సాంకేతిక విజ్ఞానం శరవేగంగా విస్తరిస్తున్న నేటి ఆధునిక కాలంలో ట్యాంపరింగ్‌లు, హ్యాకింగ్‌లు కూడా పెరుగుతున్న నేటి రోజుల్లో అన్ని విషయాల్లో అన్నివేళలా అప్రమత్తంగా ఉండడమే శ్రీరామరక్ష!..అందులోనూ ఈవిఎంల విషయంలో మరింత జాగరూకతతో వ్యవహరించాలి. అపోహలేమైనా ఉంటే తొలగించుకుని..అవింకా బాగా పనిచేసేలా..ప్రజాస్వామ్య వ్యవస్థకు పట్టుగొమ్మగా కలకాలం నిలిచేలా చూసుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here