Home జిల్లా వార్తలు ఇదేనా సంస్కారం?

ఇదేనా సంస్కారం?

”మేం స్కెచ్‌ వేస్తే గిల్లడం, గిచ్చడం వుండదు…

మేం ప్లాన్‌ చేస్తే రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి

లెవల్లో వుంటుంది” – సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి

జగన్‌పై హత్యాయత్నం తర్వాత విజయవాడలో జరిగిన ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డి ”మేం స్కెచ్‌ వేస్తే గిల్లడం, గిచ్చడం వుండదు… మేం ప్లాన్‌ చేస్తే రాజారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి లెవల్లో వుంటుంది”… అని వ్యాఖ్యానించారు…

స్వర్గీయ సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి నుండి నేర్చుకున్న సంస్కారం ఇదేనా? మేనమామ స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుండి నేర్చుకున్న రాజకీయ విలువలు ఇవేనా? మూడున్నర దశాబ్దాల రాజకీయ అనుభవం నుండి నేర్చుకున్నదిదేనా?

తానుముక్కలో తానూ ఒకడనిపించాడు

రాజకీయాలలో సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికంటూ ఇంత కాలం ఒక సంస్కారపంధా వుండేది. ఈరోజు ఆయన కూడా దానిని బొందపెట్టాడు. బజారు స్థాయి విమర్శలు చేసే తెలుగు దేశం తానుముక్కల్లో తానూ ఒకడయ్యాడు.

పతనమైపోతున్న విలువలు…

జగన్‌పై దాడిని డ్రామా అంటూ చంద్రబాబు వ్యంగ్యంగా వ్యాఖ్యానించడంలో ఆశ్చర్య పడాల్సిందేమీ లేదు. నలభై ఏళ్ళ అనుభవం నెత్తిమీదకొచ్చినంత మాత్రాన మనసు, ఆలోచన కూడా అదే స్థాయిలో పరిణితి చెందివుంటుందని భావించలేం కదా?

మేం తలచుకుంటే జగన్‌ను కైమా కొట్టేవాళ్ళం అన్న కేశినేని నాని మాటలను పట్టించు కోనవసరం లేదు. ఎందుకంటే ఆయన వుండేది విజయవాడ! రాజకీయాలలో విలువలు అన్నవి పతనమై, వ్యాపార అవసరాలు మొదలైన కాలంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అతడు. ఆయనకు అంతకంటే సంస్కారం ఏడ్చి చావదు. జగన్‌పై దాడి వెనుక విజయమ్మ, షర్మిలల హస్తముందన్న యల మంచిలి రాజేంద్ర ప్రసాద్‌ మాటలను పట్టించుకోనవసరం లేదు. ఎందుకంటే విలువలు, సంస్కారం అన్న వాటికి అర్ధం తెలియని మనిషి అతను. మెదడు, మనసులోనే కాదు, శరీరంలోని ప్రతి అవయవం లోనూ కులతత్వాన్ని నింపుకున్నాడాయన.

వాళ్ళ నుండి స్ఫూర్తి పొందినదిదేనా?

రాజకీయాలలో విలువలు అంటే ఇలా వుండాలి, సంస్కారం ఇలా ఉట్టిపడాలి అని రాష్ట్రానికే కాదు దేశానికే చూపించిన పుచ్చలపల్లి సుందరయ్య, బెజవాడ గోపాలరెడ్డి, ఏ.సి.సుబ్బారెడ్డి, యం.వెంకయ్యనాయుడు, నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి వంటి ఉద్ధండులు పుట్టిన గడ్డ మీదే సోమిరెడ్డి పుట్టాడు కదా! ఇక్కడే రాజకీయాలు నేర్చుకున్నాడు కదా… మరి వాళ్ళ నుండి స్ఫూర్తి పొందింది ఇంతేనా?

గౌరవం మట్టికొట్టుకుపోయింది!

ఇంతకాలం రాష్ట్ర రాజకీయాలలో సోమిరెడ్డిపై ఒక గౌరవ భావం వుండేది. ఆయన ప్రత్యర్థులపై పదునైన విమర్శలు చేసినా, అది సబ్జెక్ట్‌ పరంగానే వుంటాయని, వ్యక్తిగత విమర్శల జోలికి పోడని, తన ప్రత్యర్థులు తనపై వ్యక్తిగత విమర్శలకు, దూషణ భూషణలకు పాల్పడుతున్నా సహనంగా వుంటాడనే పేరుంది. నిన్న జగన్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇంతకాలం సంపా దించుకున్న ఆ పేరు మట్టికొట్టుకుపోయింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here