Home జిల్లా వార్తలు ఇట్లాంటి ఎలక్షన్‌లు వద్దురా దేవుడా!?

ఇట్లాంటి ఎలక్షన్‌లు వద్దురా దేవుడా!?

ఆంధ్రప్రదేశ్‌లోఅన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులకు కూడా కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఒక మంచి పని చేసింది. దీనికి వాళ్ళంతా కూడా ఎన్నికల కమిషన్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ మంచి ఏంటంటే ఎన్నికల షెడ్యూల్‌లో తొలివిడత ఏప్రిల్‌ 11వ తేదీనే ఏపిలో ఎలక్షన్‌లు ముగించడం. మొదటి విడతలో కాకుండా చివరి విడత మే 18వ తేదీనో, లేక దాని ముందు విడతలోనో ఎలక్షన్‌ పెట్టుంటే అభ్యర్థులు వాళ్ళ జుట్టు వాళ్ళు పీక్కునేవాళ్ళు. అభ్యర్థులు ఆస్తులు అమ్ముకుని వుండేవాళ్ళు. అదీగాక ఇప్పుడు కాస్తున్న ఎండల దెబ్బకు తిరిగి తిరిగి అభ్యర్థులు కాకుల్లాగా అయ్యేవాళ్ళు. రాష్ట్రంలో ఎలక్షన్‌లు తొందరగా పెట్టి ఒక మంచి పని చేశారు.

ఇక జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగానే ముగిసాయి. ఎన్నికలన్నాక ఒకటి అరా సంఘటనలు చోటుచేసుకోవడం సహజమే! అయితే జిల్లాలో ఈసారి చాలా ఖరీదైన ఎలక్షన్‌ జరిగింది. మద్యం ఏరులైపారింది. పచ్చనోట్లు స్వైర విహారం చేసాయి. అటు అధికార తెలుగుదేశం, ఇటు ప్రతిపక్ష వైకాపా… ఖర్చు విషయంలో ఏ మాత్రం వెనక్కు తగ్గలేదు. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా అన్ని నియోజకవర్గాలలోనూ తెలుగు దేశం, వైసిపి అభ్యర్థులు విచ్చలవిడిగా ఖర్చు చేశారు. ఓటు ధర వెయ్యి నుండి మూడువేల రూపాయల వరకు పలికింది. ఓటు కొనుగోలు రేటు పెంచడంలో తెలుగుదేశం అభ్యర్థులే కొంచెం పైచేయి చూపించారని తెలుస్తోంది. అన్ని నియోజకవర్గాల్లోనూ ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం సహకరించుకునే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేయడం వింతైన విషయం. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందే చాలామంది అభ్యర్థులు డబ్బు, మద్యం నిల్వ చేసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చాక జిల్లా అంతటా పోలీసులు పెద్దఎత్తున తనిఖీలు చేపట్టినా వాళ్ళకు దొరికింది చాలా తక్కువే! అప్పటికే ఎక్కడకు చేరాల్సిన డబ్బు, మద్యం అక్కడకు చేరిపోయింది.

ఈ ఎన్నికల్లో అటు పార్టీల కార్యకర్తలుగాని ఓటర్లు గాని అభ్యర్థు లకు చుక్కలు చూపించారు. ఒకప్పుడు కార్యకర్తలు పార్టీ మీద అభిమానంతోనో, లేదంటే పార్టీ అధినేతపై వున్న అభిమానంతోనో అభ్యర్థులకు స్వచ్ఛందంగా పనిచేసేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. రోజుకు 500 రూపాయలు ఇస్తేనేగాని పార్టీ కార్యకర్త కూడా జెండా పట్టని పరిస్థితి. ప్రతిరోజూ ఇలాంటి కార్యకర్తలకు డబ్బు, మద్యం ఇవ్వాల్సిందే! ప్రతి డివిజన్‌లో పార్టీ ఆఫీసులు తెరవాల్సిందే! ప్రతి ఆఫీసులోనూ ఖర్చులకు ఇంత అని ఇవ్వాల్సిందే! మధ్యలో మళ్ళీ డబ్బులు, మందు చేరలేదని, అవతల పార్టీ వాళ్ళు ఎక్కువ డబ్బులిస్తున్నారని అలకలు… బెదిరింపులు. కార్యకర్తలైతే తమ మూత్రాన్ని పెట్రోల్‌లాగా వెలిగించారు. అభ్యర్థులు కూడా ఎవరి మీద కోప్పడితే ఎక్కడ ఓట్లు పోతాయోననే భయంతో వాళ్ళకు అణిగిమణిగి వుండిపోయారు.

ఓ పక్క ఎండలు ఇంకోపక్క డబ్బుల టెన్షన్‌… మరోపక్క గెలుపోటముల కోసం వ్యూహాలు… ఇవన్నీకాక డబ్బులు, మద్యం కోసం క్షణక్షణం పీక్కుతినే నాయకులు… ఇలాంటి ఎలక్షన్‌లు ఇక చేయలేంరా బాబూ అని పోటీలో నిలిచిన అభ్యర్థులు వాపోతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here