Home జిల్లా వార్తలు ఆ ముగ్గురులో ఎవరు?

ఆ ముగ్గురులో ఎవరు?

నెల్లూరుజిల్లా అంటే రాజకీయంగా రెడ్ల ఆధిపత్యం వుంటుంది. అది ఏ పార్టీ అయినా జిల్లాలో వారికి పెద్దపీట వేయాల్సిందే! అయితే తొలినాళ్లలో రెడ్లకు అధిక ప్రాధాన్యతనిచ్చిన తెలుగుదేశం పార్టీ క్రమంగా ఆ ప్రాధాన్యతను తగ్గించుకుంటూ వస్తోంది. జిల్లాలో 10అసెంబ్లీలుంటే 2014 ఎన్నికల్లో రెండు రిజర్వుడ్‌ నియోజకవర్గాలు పోను, ఒకటి బీజేపీకి, ఒకటి బిసిలకు, మూడు సీట్లు కమ్మ సామాజికవర్గానికి కేటాయించింది. మిగిలిన మూడు సీట్లు మాత్రమే రెడ్డి వర్గానికి కేటాయించింది. అంటే ‘కమ్మ’కు సరిసమానంగా ‘రెడ్ల’కు సీట్లిచ్చింది.

నెల్లూరుజిల్లాలో ‘రెడ్ల’కు ప్రాధాన్యత ఇవ్వకుంటే రాజకీయంగా నష్టం తప్పదనే అంచనాతో రేపటి ఎన్నికల్లో మరో రెండు సీట్లు పెంచనున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీకి వదిలిన నెల్లూరురూరల్‌ను ఈసారి రెడ్లకే కేటాయించే అవకాశముంది. ఇక 2014 ఎన్నికల్లో కమ్మ సామాజికవర్గానికి ఇచ్చిన ఆత్మకూరు, వెంకటగిరి, ఉదయ గిరి సీట్లలో ఈసారి ఒక సీటును రెడ్లకు కేటాయించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ మూడింటిలో ఎక్కువ అవకాశం ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గాల నుండే వుంది. ఆత్మకూరు నుండైతే జడ్పీ ఛైర్మెన్‌ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఉదయగిరి నుండైతే డిసిసిబి ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, పారిశ్రామికవేత్త కావ్య కృష్ణారెడ్డిలు రంగంలో వున్నారు. ఆత్మకూరులో బొల్లినేని కృష్ణయ్యను తెలుగుదేశం

నాయకులే పిలిచి తెరమీదకు తెచ్చారు. ఆయన ప్రచారంలోకి కూడా దూసుకుపోయాడు. ఇప్పుడు ఆయనకు సీటు లేదని చెబుతారా? ఉదయగిరి ఎమ్మెల్యే రామారావుపై నియోజకవర్గంలో వ్యతిరేకత వుందన్న నేపథ్యంలో ఇక్కడ ‘రెడ్డి’ అభ్యర్థికి ప్రాధాన్యత రావచ్చు. ఆ కోణంలో చూస్తే మెట్టుకూరు ధనుంజయరెడ్డి, కావ్య కృష్ణారెడ్డిలు పోటీ పడుతున్నారు. ఇద్దరు కూడా సీటు విషయమై చంద్రబాబుని కలిసి అడిగినట్లు సమాచారం. ఒకవేళ ‘రెడ్డి’ అభ్యర్థినే ఇక్కడ పెట్టాల్సివస్తే… వీరిద్దరిలో అన్ని విధాలుగా సరిపోయే నాయకుడినే అభ్యర్థిగా దించవచ్చు. ఇదంతా కూడా ‘కమ్మ’ సామాజికవర్గానికి ఒకటి తగ్గించి ‘రెడ్డి’కి ప్రాధాన్యతనివ్వాలని చంద్రబాబు భావిస్తేనే జరుగుతుంది!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here