నెల్లూరు నగర అసెంబ్లీ… మొత్తం 8సార్లు ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశంపార్టీ ఆరు సార్లు అభ్యర్థులను రంగంలోకి దింపింది. 1999, 2004లలో మాత్రం పొత్తులో భాగంగా బీజేపీ పోటీ చేసింది. ఆరుసార్లు పోటీ చేసిన టిడిపి రెండుసార్లు మాత్రమే గెలిచింది. అది కూడా ఎన్టీఆర్ ప్రభంజనం బలంగా పని చేసిన 1983, 1994 ఎన్నికల్లో! మిగతా 4సార్లు ఇక్కడ కాంగ్రెస్సే గెలిచింది. ఒకసారి పిఆర్పి గెలిచింది, ఒకసారి వైసిపి గెలిచింది.
దీనిని బట్టి అర్ధమయ్యేదేంటంటే నెల్లూరులో తెలుగుదేశం పార్టీ బాగా వీక్ అని. ఒకప్పటి కాంగ్రెస్ స్థానంలో ఇప్పుడు వైసిపి వుందను కుందాం. ఇలాంటి నియోజకవర్గంలో తెలుగు దేశం అభ్యర్థిగా దిగడానికి మంత్రి నారాయణ సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.
నారాయణకు రాజకీయ అనుభవం లేదు… ఏ ఎన్నికల్లో నేరుగా పోటీ చేయ లేదు. ఇల్లిల్లూ తిరిగి జనాన్ని ఎట్లా ఓట్లడ గాలో కూడా తెలియదు. కాని ఎన్నికల్లో పోటీ చేస్తానని, నగరంలో ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి, కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, అజీజ్, అనూరాధ వంటి వాళ్ళు తనకు పనిచేయకపోయినా భారీ మెజార్టీతో గెలుస్తానని తన పార్టీ నాయకులతోనే అంటున్నాడు. గెలుపుపై ఆయన ఆత్మ విశ్వాసం చూసి తెలుగుదేశం నాయకులే ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయా లలో తలలు పండినవాళ్లే ఇంత ధీమాగా ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే జిల్లాలో పార్టీ పరిస్థితి ఏమంతా బాగాలేదు. పబ్లిక్‌లో బలహీనం, ప్రభుత్వంపై వ్యతి రేకత వుంది. వైసిపి సిటింగ్ ఎమ్మెల్యే అనిల్‌పై వ్యతిరేకత లేదు. 1994 తర్వాత నెల్లూరు టౌన్లో పార్టీకి గెలుపన్నది లేదు. మరి నారాయణ ఇంత ధీమాగా ఎందుకు న్నాడన్నది వాళ్ళకు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. నగర నియోజకవర్గ పరిధిలో తాను కట్టిస్తున్న ఇళ్ళు, వేయిస్తున్న రోడ్లు, చేయిస్తున్న పార్కులు… మొత్తానికి అభివృద్ధి మంత్రమే తనను గెలిపిస్తుందని నారాయణ నమ్మకం. మరి ఈ నమ్మకం ఎంతవరకు నిజమవుతుందో చూద్దాం!
