Home జిల్లా వార్తలు ఆ గట్టునుంటావా నాగన్న.. ఈ గట్టునుంటావా…?

ఆ గట్టునుంటావా నాగన్న.. ఈ గట్టునుంటావా…?

ఎన్నికలు సమీ పిస్తున్నాయి. రాజ కీయ పార్టీలు జంపింగ్‌ జిలానీల కోసం ఎదురు చూస్తున్నాయి. ‘టీడీపీలో చేరిన వైసిపి కార్యకర్తలు’… అలాగే ‘వైసిపిలోకి టీడీపీ నాయకులు’… ఇక ప్రతిరోజూ మీడియాలో మనకు కనిపించబోయే హెడ్‌లైన్స్‌ ఇవి. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కూడా ప్రతిరోజూ పార్టీ జంపింగ్‌లు వుంటున్నాయి. సర్వేపల్లి నియోజకవర్గంలో అయితే ఈ చేరికలు విచిత్రంగా వుంటున్నాయి. కొన్ని కుటుంబాలు ఉదయం ఒక నాయకుడి సమక్షంలో ఒక పార్టీలో చేరతారు, సాయంత్రం అవే కుటుంబాలు ఇంకో నాయకుడి సమక్షంలో ఇంకో పార్టీలో చేరుతాయి.

ఇటీవల బోగోలు జడ్పీటీసీ బాపట్ల కామేశ్వరి, వైసిపి జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు బాపట్ల వెంకటరఘుపతి, వైసిపి జిల్లా స్టీరింగ్‌ కమిటి సభ్యులు చిలకపాటి వెంకటేశ్వర్లు మంత్రి నారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రల సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. వీళ్ళ చేరికకే ఎన్టీఆర్‌ భవన్‌లో టీడీపీ నాయకులు పెద్దసీన్‌ క్రియేట్‌ చేశారు.

కాగా, ఈ నెల 22వ తేదీన నెల్లూరులోని వైసిపి జిల్లా కార్యాలయంలో నెల్లూరు నగరంలోని 18, 19, 20, 36డివిజన్‌లకు చెందిన పెనాక రామకృష్ణారెడ్డి, పెళ్ళకూరు సుధాకర్‌రెడ్డి, కొండేటి రఘురామిరెడ్డి, ఎంబేటి ఏసునాయుడులు 500మంది కార్యకర్తలతో వైసిపిలో చేరారు. వీళ్ళ చేరికకు పార్టీ ఆఫీసులో పెద్ద బిల్డప్‌ ఇచ్చారు. రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితో పాటు మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి, శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డిలు హాజరయ్యారు.

పార్టీల జంపింగ్‌లు ఇప్పుడే మొదలయ్యాయి. ఎన్నికలు దగ్గరయ్యే కొద్ది ఇవి ఊపందుకునే అవకాశాలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here