Home సంపాదకీయం ఆరని ‘అయ్యప్ప జ్వాల’

ఆరని ‘అయ్యప్ప జ్వాల’

శబరిమలై అయ్యప్ప సన్నిధిలోకి మహిళలను అనుమతించాలంటూ స్త్రీవాదులు వేసిన పిటిషన్‌ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోయింది. సన్నిధిలోకి మహిళలను అనుమతించాలంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. దేవుడి ముందు అందరూ సమానమే అన్నప్పుడు గుడుల్లోకి స్త్రీలను ప్రవేశించకుండా కోర్టు అడ్డు చెప్పలేదుగా! న్యాయస్థానాలు మనం వ్రాసుకున్న రాజ్యాంగం ప్రకారం నడుస్తాయేగాని మన పూర్వీకులు వ్రాసిన మతగ్రంథాలు, ఆచార వ్యవహారాలనుబట్టి కాదు కదా!

ఇక్కడ సుప్రీం కోర్టు తీర్పును ఆక్షేపించలేం. అలాగని అన్ని మతాల విషయంలో సుప్రీం కోర్టు ఇలాగే జోక్యం చేసుకుని తీర్పునివ్వగలదా అని హిందూత్వవాదులు వినిపిస్తున్న ప్రశ్నలకు కూడా న్యాయస్థానాలు సమాధానాలు చెప్పాల్సివుంది.

అయితే న్యాయస్థానాలు తీర్పునివ్వగానే అవి అమలులోకి వస్తాయనుకోవడం కూడా పొరపాటే! సుప్రీం తీర్పులను తుంగలో తొక్కిన సంఘటనలు చాలానే వున్నాయి. ఒక ఆచారం, ఒక సంప్రదాయం మానవ సమాజానికి హాని కలిగించనివై వున్నప్పుడు దానిని ఆచరించడంలో అభ్యంతరపెట్టాల్సింది ఏమీ లేదు. శబరిమలైలో 15 నుండి 50ఏళ్ళలోపు మహిళలపై నిషేధం ఇలాంటిదే! 15ఏళ్ళలోపు, లేదా 50ఏళ్లపైబడిన మహిళలు అయ్యప్పస్వామిని దర్శించుకోవడంపై ఎలాంటి ఆక్షేపణ లేదు. కేవలం బహిష్టు వయసు వారికి మాత్రమే ప్రవేశం లేదు. అంతమాత్రాన అది వివక్షతో కూడుకున్నదని ముద్ర వేయడం తగదు. ఎందుకంటే ఇతర ఏ హిందూ ఆలయంలో కూడా లింగవివక్ష లేదు. ఒక్క శబరిమలైలో తప్పితే ఇంకే అయ్యప్ప ఆలయంలోనూ మహిళా భక్తులపై నిషేధం లేదు. ఏ మత సంస్కృతిలోనైనా సమాజానికి చెడు కలిగించే దురాచారాలను రూపుమాపాల్సిందే! అంటరానితనం, బాల్య వివాహాలు, సతీ సహగమనం, తాంత్రిక పూజలు, బలులు… ఇలాంటి మూఢత్వా లను తరిమికొట్టాలి. కాని, వీటితో పోలిస్తే శబరి మలైలో కొనసాగుతున్న ఆచారం ఎవరికీ ఇబ్బంది కలిగించేది కాదు. సమాజానికి చెడు చేసేదీ కాదు. అంతెందుకు నిఖార్సుగా హిందూ సంస్కృతి సంప్రదాయాలను పాటించే మహిళా భక్తులు… శబరిమలై సన్నిధిలోకి ప్రవేశం కల్పించాలని గట్టిగా పట్టుబడితే ఈ సుప్రీం కోర్టు తీర్పులు, ఉద్యమాలు అవసరం కూడా లేదు. మహిళల కోసం శబరిమలై అయ్యప్ప సన్నిధి తలుపులు ఎప్పుడో తెరుచుకుని వుండేవి. అయ్యప్పను కొలిచే హిందూ స్త్రీలు ఎవరు కూడా ఆచారాలను మంటగలిపి శబరిమలైకు వెళ్లాలనుకోవడం లేదు. శబరిమలై సన్నిధి సంప్రదాయాన్ని హిందూ మహిళలు గౌరవిస్తున్నారు. తమ భర్తలకు, బిడ్డలకు ఇరుముడులు కట్టి సంతోషంగా అయ్యప్ప స్వామి దర్శనానికి సాగనంపుతున్నారు. మరి హిందూ స్త్రీలలో ఈ డిమాండ్‌ లేనప్పుడు శబరిమలై కేంద్రంగా ఇంత రచ్చ జరగడానికి కారణమెవరు? దీనికి సమాధానం అతివాదస్త్రీలు కొందరు. శబరిమలైపై కోర్టుకెక్కింది హేతువాద మహిళే! సుప్రీం కోర్టు తీర్పును అవకాశంగా తీసుకుని శబరిమలై సన్నిధిలోకి పోలీసుల సాయంతో బలవంతంగా ప్రవేశించాలనుకున్నది కూడా వామపక్ష భావాలున్న ఇద్దరు మహిళలే! వీళ్ళిద్దరూ స్త్రీ స్వేచ్ఛావాదులు. వీళ్ళు కట్టుకున్న ఇరుముడులలోనూ స్త్రీలు వాడేసిన శానిటరీ నాప్‌కిన్స్‌ వున్నాయనే సమాచారం ఆందోళన కలిగించేదే! అయ్యప్ప సన్నిధిలోకి వెళ్లాక బహిష్టు గుడ్డలను సన్నిధిలో విసిరేయాలని ప్లాన్‌ చేసారని, అయ్యప్ప భక్తులు బలంగా వారిని అడ్డుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సమాచారం. ఎందుకంటే వాళ్లు అదే పని చేసుంటే మతపరమైన అల్లర్లకు ఆస్కారమిచ్చినట్లుండేది.

సుప్రీం కోర్టేమో తాంబూళాలిచ్చాం తన్నుకు చావండి అన్నట్లుగా తీర్పు ఇచ్చేసింది. కోర్టు తీర్పును అవకాశంగా తీసుకుని కొందరు హిందూ ఆచారాలపైనే దాడి చేయడానికి ప్రయత్నిస్తుండగా, హిందువులు దానిని తిప్పికొట్టే రీతిలో ఉద్యమానికి దిగడంతో కేరళలో పెద్దఎత్తున ఉద్రిక్తత చోటుచేసుకుంది. శబరిమలై ఇంత వివాదం కావడానికి ప్రథమ కారణం కేరళలో సీపీఎం ప్రభుత్వం ఉండడమే! శబరిమలై ఇంకే ఇతర రాష్ట్రంలో వుండి వున్నా సుప్రీం తీర్పు కంటే కూడా మెజార్టీ ప్రజల మనోభావాలకే ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యతనిచ్చి, ఈ తీర్పును మేము అమలు చేయలేమంటూ చేతులెత్తేసి వుండేవి. కాని కేరళలో వున్నది వామపక్ష ప్రభుత్వం. మత ఆచారాలకు, అందులోనూ హిందూ మత సంస్కృతికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించే ప్రభుత్వం. కాబట్టే సుప్రీం కోర్టు తీర్పును మేము అమలు చేస్తామంటూ ఘనంగా ప్రకటించారు. దీనిని అయ్యప్ప భక్తులు వ్యతిరేకించారు. సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా లక్షలాది మంది భక్తులు రోడ్లమీదకొచ్చి ఉద్యమించారు. ‘సేవ్‌ శబరిమల’ అంటూ అయ్యప్ప సన్నిధికి బలవంతంగా పోవాలను కున్న వారిని అడ్డుకున్నారు.

ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వమైనా ఇక్కడ గమ నించాల్సింది ఒక్కటే! ఈ దేశాన్ని 400 ఏళ్ళు పాలిం చిన మొఘలులు, 200 ఏళ్ళు పాలించిన బ్రిటీషోళ్ళే ఈ దేశ మూల సంస్కృతిని ఏమీ చేయలేకపోయారు. అంతే కాదు, వాళ్ళు కూడా చివరకు ఇక్కడి ఆచా రాలు, సంప్రదాయాలను గౌరవించారు. 600ఏళ్ళు పరాయి సంస్కృతి పాలనలో గడిపాక కూడా ఈ దేశం మెజార్టీ హిందూ సంస్కృతి దేశంగా నిలవగలి గిందంటే అది ఈ సంస్కృతిలోని గొప్పదనమే! ఎందుకంటే వంద, రెండొందల ఏళ్ళ పాలనకే ఎన్నో దేశాలు పూర్తిగా మతాంతరీకరణ జరిగాయి. కాని ఎన్నో సాంస్కృతిక దాడులను ఎదుర్కొని కూడా ఈ దేశం భారత దేశంగానే నిలబడగలిగింది. ఈ దేశంలోని ప్రభుత్వాలు, పార్టీలైనా మనుగడ సాగించాలంటే ఆ సంప్రదాయాలను గౌరవించాల్సిందే! అలాకాదని విద్వేషభావంతో ముందుకుపోతే మొన్న పశ్చిమ బెంగాల్‌, నిన్న త్రిపురలో అధికారం కోల్పోయినట్లు రేపు కేరళలో కూడా కమ్యూనిష్టులు ఉనికిని కోల్పోతారు. ఒకప్పుడు హిందూ వ్యతిరేక భావజాలంతో వున్న కాంగ్రెస్‌వాళ్ళు సైతం ఇప్పుడు నుదుటున నామాలు పెట్టుకు తిరుగుతున్నారు. రాముడు లేడు, రామసేతు అభూతకల్పన అన్నవాళ్ళు ఇప్పుడు కనిపించిన ఆలయానికల్లా వెళుతున్నారు. అర్జంట్‌గా అయ్యప్పస్వామిని దర్శనం చేసుకోకపోవడం వల్ల హైందవ మహిళలకు వచ్చే నష్టం, కష్టం ఏమీ లేదు. వారి కోసం ప్రభుత్వాలు, పార్టీలు చేయాల్సిన పనులెన్నో వున్నాయి. చట్టసభలలో 33శాతం రిజర్వేషన్ల బిల్లు అలాగే వుంది. భ్రూణహత్యలను పూర్తి స్థాయిలో అరికట్టాలి. లైంగిక వేధింపులు, వరకట్న చావులకు కత్తెర వేయాలి. ఆడబిడ్డలను ఆర్ధిక శక్తులుగా, ఆదిపరాశక్తులుగా తీర్చిదిద్దాలి. మహిళలు దేవతలుగా పూజలందుకునే ఈ పుణ్యభూమిలో ఇంకో గుడిలో దర్శనం కోసం వాళ్ళు అడుక్కునే పరిస్థితి వద్దనే వద్దు. వాళ్ళు శబరిమలై సన్నిధిలోకి ప్రవేశించాలని బలంగా సంకల్పించిన రోజు వారిని అడ్డుకునే శక్తి ఆ అయ్యప్పకు కూడా వుండదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here