Home జిల్లా వార్తలు ఆయన వద్దు… కాదు కావాలి!

ఆయన వద్దు… కాదు కావాలి!

ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం ద్వితీయ శ్రేణి నాయకులు రెండుగా చీలిపోయారు. కొందరు సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుకే మళ్ళీ టిక్కెట్‌ ఇవ్వాలని అడుగుతుండగా ఇంకొందరు నాయకులు మాత్రం ఆయనకు ససేమిరా టిక్కెట్‌ ఇవ్వొద్దంటున్నారు. ఆయనపై ప్రజల్లో బాగా వ్యతిరేకత వుందని, సీటిచ్చినా గెలవరని చెబుతున్నారు. ఈ పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు లోకేష్‌ల దాకా వెళ్లింది.

ఇటీవల ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు కొందరు కట్టకట్టుకుని బొల్లినేని రామారావుకు సీటివ్వొద్దని అమరావతికి వెళ్లి చంద్ర బాబుకు చెప్పొచ్చారు. మరోవైపు రెండురోజులకే ఎమ్మెల్యే అనుకూల బ్యాచ్‌ అమరావతిలో లోకేష్‌ను కలిసి బొల్లినేని రామా రావు చాలా మంచోడని, నియోజకవర్గంలో ఎటువంటి అవినీతి పాడుపనులు చేయలేదని, ఉదయగిరిలో పోటీకి ఆయనే సమర్ధుడని, ఇలాంటి ఉత్తముడికి సీటివ్వకుంటే పార్టీ నష్ట పోతుందని చెప్పొచ్చారు. ఉదయగిరి తెలుగుదేశం టిక్కెట్‌ కోసం ఒకరికి నలుగురు పోటీ పడుతున్నారు. బొల్లినేనితో పాటు కంభం విజయరామిరెడ్డి, మెట్టుకూరు ధనుంజయరెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, మద్దినేని అశోక్‌బాబులు రేసులో వున్నారు. దీంతో బొల్లినేని వ్యతిరేకులకు ప్రత్యామ్నాయంగా నాయకులు దొరికారు. దీంతో అసమ్మతి స్వరం వినిపించడం సులువైంది.

అసలు రామారావుపై స్థానిక తెలుగుదేశం నాయకుల్లో అసమ్మతి పెరగడానికి కారణం ఇక్కడ నీరు-చెట్టు క్రింద నిర్మించిన ఫైబర్‌ చెక్‌డ్యాంలేనని తెలుస్తోంది. నియోజకవర్గంలో కోట్ల రూపాయల ఫైబర్‌ చెక్‌ డ్యాం పనులు జరిగాయి. మండలాల వారీగా స్థానిక తెలుగుదేశం నాయకులకే ఈ పనులు అప్పగించారు. ఎమ్మెల్యే బొల్లినేని రామారావు కన్‌స్ట్రక్షన్‌ కంపెనీయే ఈ పనులకు టెం డర్లు, డిడిలు, వర్క్‌ఆర్డర్‌లు వంటి పనులన్నీ చూసుకుంది. కాంట్రాక్టర్లయిన నాయకులు పెట్టుబడులు పెట్టి పనులు చేశారు. ఎమ్మెల్యేకు సంబం ధించిన కంపెనీ నుండే ఫైబర్‌ గేట్లు కొన్నారు. ఈ పనులకు సంబంధించిన బిల్లులన్నీ ఎమ్మెల్యే కంపెనీ ద్వారానే పనులు చేసిన నాయకులకు రావాలి. ఇలా వచ్చిన బిల్లుల్లో జిఎస్టీ, టిడిఎస్‌ వంటివని చెప్పి 20శాతం వరకు బిల్లు చెల్లింపును ఆపి మిగతా మొత్తం చెల్లించారు. జిఎస్టీ తేలాక మిగతా మొత్తం ఇస్తామని చెప్పారు. పనులు చేసిన మాకు మిగిలేదే ఆ 20శాతమని, మీ దగ్గర అది పెట్టేసుకుంటే మా చేతికి చిప్పేనని నాయకులైన కాంట్రాక్టర్లు బొల్లినేనిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఈ పనుల్లో పర్సంటేజీ పట్టుకోవడం వల్లే ఉదయగిరి తమ్ముళ్ళు రామారావుపై గుడ్లురుముతున్నట్లు తెలుస్తోంది.

ఇస్తే పోటీ చేస్తా… లేకుంటే పార్టీకి పని చేస్తా!

ఉదయగిరి టిక్కెట్‌ తిరిగి నాకే ఇస్తే పోటీ చేస్తా… నాకు ఇవ్వకుండా వేరెవరికి ఇచ్చినా పార్టీ గెలుపు కోసం పనిచేస్తా!

ఉండే సిటింగ్‌ ఎమ్మెల్యేలలో టిక్కెట్‌ రాకుంటే ఎవరైనా నిరసన వ్యక్తం చేసి తిరుగుబాటు చేయొచ్చేమో! నేను మాత్రం పార్టీ కోసమే పనిచేస్తానని చంద్రబాబుతో బొల్లినేని రామారావు స్పష్టంగా చెప్పాడని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here