Home జిల్లా వార్తలు ఆయనను మార్చాల్సిందే!

ఆయనను మార్చాల్సిందే!

జిల్లా ఎస్పీగా పిహెచ్‌డి రామకృష్ణ వచ్చినప్పటి నుండి అధికారపార్టీ నేతలకు మింగుడుపడడం లేదు. ఏ పార్టీ అధికారంలో వుంటే ఆ పార్టీ నాయకులకు పోలీసుశాఖలో పనులు జరుగుతుంటాయి. ఎస్‌.ఐ స్థాయిలో మండల స్థాయి నాయకులకు, ఎస్పీ స్థాయిలో ఎమ్మెల్యే, ఎంపీలు, మంత్రులకు పనులు జరగాలి. వాళ్ళ పలుకుబడి పనిచేయాలి. కాని, జిల్లా ఎస్పీగా రామకృష్ణ వచ్చాక తెలుగుదేశం నాయకులకు ఆ ఆనందం లేకుండాపోయింది.

ఎర్రచందనం, ఇసుక అక్రమ రవాణాలపై ఉక్కుపాదం మోపాడు. అంతే కాదు, పోలీసు శాఖపై రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు పని చేయకుండా చేసాడు. ఒక పోలీసు బైక్‌ను పట్టుకున్నా విడిపించుకోలేని పరిస్థితి అధికార పార్టీ నాయకులకు ఏర్పడింది. టీడీపీ నాయకులు ఈ పరిస్థితిని తట్టుకోలేకపోయారు. ఎస్పీ రామకృష్ణ బదిలీ కోసం ఎప్పటినుండో ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. తెలుగుదేశం నాయకులు ఒకరిద్దరు బహిరంగంగానే ఎస్పీపై విమర్శలు చేయడం తెలిసిందే!

మొన్నటివరకు ఎస్పీ బదిలీ విషయంలో చంద్రబాబుపై జిల్లా తెలుగుదేశం నాయకులు గట్టిగా ఒత్తిడి తేలేకపోయారు. కాని, ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రామకృష్ణ బదిలీ కోసం మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇటీవల హైదరాబాద్‌లో శిక్షణ కోసమని చెప్పి ఎస్పీ రామకృష్ణ 35రోజులు సెలవు పెట్టడం తెలిసిందే! సెలవులు ముగిసాక ఒక్కరోజు మళ్ళీ ఛార్జ్‌ తీసుకుని వెంటనే మళ్ళీ సెలవుపెట్టారు. ఆయన కుటుంబసభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్ళడం కోసం సెలవు పెట్టినట్లుగా తెలుస్తోంది. రామకృష్ణ సెలువులు ముగించుకుని తిరిగి విధుల్లోకి చేరకముందే ఆయనను అటు నుండి అటే బదిలీ చేయించేందుకు నెల్లూరు టీడీపీ నాయకులు చక్రం తిప్పడం మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here