Home జిల్లా వార్తలు ఆమంచర్ల శంకరనారాయణ ఉద్యమాలతో… అలసి సొలసి ఆగిన ఊపిరి

ఆమంచర్ల శంకరనారాయణ ఉద్యమాలతో… అలసి సొలసి ఆగిన ఊపిరి

నెల్లూరులోని చారిత్రాత్మక వి.ఆర్‌ విద్యాసంస్థల గత పాలకవర్గంపై దాదాపు 34ఏళ్లు పోరాటం చేసి విజయం సాధించి ఆ విద్యాసంస్థల పాలకవర్గ ఎన్నికలకు బాటలు వేసిన ఉద్యమసారధి, బీజేపీ నాయకులు, ప్రముఖ ఆడిటర్‌ ఆమంచర్ల శంకరనారాయణ ఈ నెల 14వ తేదీన గుండెపోటుతో ఆకస్మికంగా స్వర్గస్తులైనారు. ఆయన వయసు 64సంవత్సరాలు. ఆయ నకు భార్య, ఒక కుమార్తె, కుమారుడు

ఉన్నారు. 1955 జూన్‌ 2వ తేదీన జన్మిం చిన ఆయన విద్యార్థి దశ నుండే ఉద్య మాలలో చరుకుగా వుండేవారు. ప్రస్తుత భారత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్య నాయుడుకి అప్పట్లో శిష్యుడిగా వుంటూ ఆయనతో కలిసి అనేక ఉద్యమాలలో పాల్గొన్నారు. 1974లో విఆర్‌ కళాశాల అధ్యక్షుడిగా ఏబివిపి తరపున పోటీ చేశారు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరే కంగా జరిగిన పోరాటంలో పాల్గొన్నారు. తర్వాత కాలంలో బీజేపీలో చేరి పార్టీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. 1994లో నెల్లూరు శాసనసభ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పొందారు. కొన్నేళ్ల క్రితం తూర్పు రాయలసీమ పట్టభద్రుల శాసన మండలి నియోజకవర్గం నుండి కూడా బీజేపీ మద్దతుదారుగా పోటీ చేసి మరో ఓటమే చవిచూశారు.

ముఖ్యంగా విఆర్‌ విద్యాసంస్థల పాలకవర్గం విషయంలో ఆయన చేసిన పోరాటం చిరస్మరణీయం. ఆ అంశంలో జిల్లా కోర్టు నుండి సుప్రీంకోర్టు దాకా పోరాడాడు. ఎక్కడా వెనక్కు తగ్గలేదు. దీనికోసం సొంత నిధులనే ఖర్చు చేసుకు న్నాడు. విఆర్‌ పాలకమండలికి ఎన్నికలు తెచ్చాడు. అయితే ఈ ఓటింగ్‌ నమోదు విషయంలో ఆయన ఇటీవల తీవ్ర మాన సిక ఒత్తిడి ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. విఆర్‌ విద్యాసంస్థల ఓటింగ్‌ నమోదులో నాలుగు ప్యానెళ్లు పోటీ పడ్డాయి. అయితే మిగతా పదవుల విషయం ఎలా వున్నా ఇన్నేళ్ళు పోరాడిన ఆమంచర్ల శంకర నారాయణను కరస్పాండెంట్‌గా ఏక గ్రీవంగా ఎన్నుకోవాలనే విషయంలో మిగతా ప్యానెల్‌ వాళ్ళు కూడా అంగీకా రానికి వచ్చారు. తన పోరాట ఫలాలను అనుభవించకుండానే ఆయన ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఎప్పుడూ ఓటమినే చవి చూసే శంకర నారాయణకు వి.ఆర్‌. కాలేజీ వ్యవహారంలో విజయం చేకూ రింది. ఆ విజయానంద ఫలాలను ఆస్వాదించే తరుణంలో మళ్ళీ మృత్యువు ఆయనని ఓడించింది. ఆమంచర్ల శంకర నారాయణ మృతికి సంతాపం ప్రకటిస్తూ వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలుపుతోంది ‘లాయర్‌’.

ఉపరాష్ట్రపతి వెంకయ్య సంతాపం

ఆమంచర్ల శంకరనారాయణ మృతి పట్ల ఒకప్పటి ఆయన గురువు, ఆత్మీయుడు, భారత ఉపరాష్ట్రపతి యం.వెంకయ్యనాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక ఆప్తమిత్రుడిని, ఒక సామాజిక సేవకుడిని కోల్పోయానని ఆయన తన విచారం వ్యక్తం చేశారు. అలాగే స్వర్ణభారత్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఐ.దీపావెంకట్‌ కూడా ఒక ప్రకటనలో శంకరనారాయణ మృతిపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here