Home జిల్లా వార్తలు ఆనం పెత్తనానికి తెర… విఆర్‌సి ప్రత్యేక అధికారిగా జేసీకి బాధ్యతలు

ఆనం పెత్తనానికి తెర… విఆర్‌సి ప్రత్యేక అధికారిగా జేసీకి బాధ్యతలు

విఆర్‌ విద్యా సంస్థలు… నెల్లూరుజిల్లా విద్యా రంగానికే తలమానికం! వెంకటగిరి రాజాలచే నెలకొల్పబడిన ఈ విద్యాసంస్థలపై మొదట్లో వారి పెత్తనమే వుండేది. వారి తర్వాత ఆనం కుటుంబం పెత్తనం మొదలైంది. దాదాపు 50ఏళ్ళుగా ఆ కుటుంబసభ్యుల కనుసన్నలలోనే ఈ విద్యా సంస్థ నడుస్తూ వచ్చింది. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ఆనం వివేకానందరెడ్డి కరస్పాండెంట్‌గా వున్న విఆర్‌ విద్యా సంస్థల కమిటీని గత ఏడాది రద్దు చేస్తూ హైకోర్టు తీర్పును వెలువరించడం తెలి సిందే! ఆనం వివేకానందరెడ్డితో పాటు ఆనం రామనారాయణరెడ్డి, మరికొందరు సభ్యులు ఈ కమిటీలో వున్నారు. అయితే ఈ కమిటీ ఎన్నికలు అక్రమంగా జరిగాయని, పూర్వవిద్యార్థుల ఓట్లు తొలగించి ఎన్నికలు జరిపారని, ఈ కమిటీని రద్దు చేయాలంటూ బీజేపీ నాయకులు ఆమంచర్ల శంకరనారాయణ పట్టువదలని విక్రమార్కుడిలా పాతికేళ్ళ నుండి న్యాయస్థానాలలో పోరాడుతూ వచ్చాడు. ఎట్టకేలకు ఆయన పోరాటం ఫలించి ఆ కమిటీని రద్దు చేయాలని, కొత్త కమిటీని ఎన్నుకునే వరకు ప్రత్యేకాధికారిని నియ మించాలని హైకోర్టు ఆదేశించింది. అయితే మొన్నటి వరకు ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంలోనే వుండడంతో ప్రభుత్వం విఆర్‌ విద్యాసంస్థలకు ప్రత్యేక అధికారిని నియమించకుండా నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆయన టీడీపీని వీడి వైసిపిలో చేరబోతున్నాడు. ఇక ఆయనతో తమకు మొహమాటం లేకుండా పోయింది. దీంతో విఆర్‌ విద్యాసంస్థలకు జాయింట్‌ కలెక్టర్‌ వెట్రిసెల్విని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో విఆర్‌పై ఆనం ఆధిపత్యానికి తెరదించినట్లయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here