Home జిల్లా వార్తలు ఆనంతో… అదనపు బలం!

ఆనంతో… అదనపు బలం!

మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి వైయస్సార్‌ కాంగ్రెస్‌లో చేరడం లాంఛనమే! ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో వైకాపా అధినేత వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డితో ఆయన భేటీ అయ్యాడు. జిల్లా రాజకీయాలపై చర్చించాడు. వైసిపిలో ఏ తేదీన చేరాలనుకునేది ఇక ఆనం రామనారాయణరెడ్డే నిర్ణయించుకోవాల్సి వుంది.

ఆనం పార్టీలోకి వస్తే వర్గ విభేదాలొస్తాయని, ఆయన రావడం మేకపాటి వర్గీయులకు ఇష్టం లేదని రకరకాల ప్రచారం పుట్టిస్తున్నారు. ఆయన రాకూడదు, ఈయనను పార్టీలోకి తీసుకోకూడదు అన్న మూర్ఖత్వపు విధానాలవల్లే 2014లో వైసిపి అధికారంలోకి రాలేకపోయింది. ఇప్పుడు కూడా అలాంటి మూర్ఖత్వపు చేష్టలు చేస్తే చేజేతులా పార్టీకి చేటు చేసినవాళ్ళే అవుతారు. ఎవరిని పార్టీలోకి తీసుకోవాలి, ఎవరికి సీట్లివ్వాలి అన్నది పూర్తిగా పార్టీ అధినేతగా వై.యస్‌.జగన్మోహన్‌రెడ్డి ఇష్టం.

ఇక ఆనం రామనారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడం వల్ల జిల్లాలో వైసిపికి అదనపు బలమేకాని వచ్చే నష్టం ఏమీ లేదు. ముందు టీడీపీకి ఒక బలమైన అభ్యర్థిని లేకుండా చేసినట్లవుతుంది. ఆనం టీడీపీలో వుండి ఆత్మకూరు నుండే పోటీ చేస్తే వైసిపి అభ్యర్థి గెలుపు ఫిఫ్టీ-ఫిఫ్టీ ఛాన్స్‌లో వుంటుంది. అదే ఆనం వైసిపిలోకి వస్తే ఆత్మకూరులో వైసిపి అభ్యర్థి ఎవరైనా గెలుపు శాతం చాలా పెరుగుతుంది. ఆనంకు ఆత్మకూరు సీటిస్తారా లేక వెంకటగిరి సీటిస్తారా ఏదీ కాకుంటే సర్వేపల్లికి పంపిస్తారా అన్నది జగన్‌ ఇష్టం. అభ్యర్థుల ఎంపికలో తేలే విషయం.

కాని ఆనం పార్టీలో చేరడం వల్ల వైసిపికి ఒక్క ఆత్మకూరు నియోజకవర్గంలోనే కాదు, వెంకటగిరి, సర్వేపల్లి, ఉదయగిరి, నెల్లూరునగరం, రూరల్‌ నియోజకవర్గాలలోనూ ఎంతోకొంత అదనపు బలం చేకూరుతుంది. కాబట్టి వైసిపిలోకి ఆనం రామనారాయణ రెడ్డిని తీసుకోవడాన్ని ఎవరూ ఆక్షేపించాల్సిన అవసరం లేదు. బలమైన నాయకులను ప్రత్యర్థులుగా వుంచుకోవడం కంటే మన అనుచరులుగా, అభ్యర్థులుగా మార్చుకోవడం నేటి రాజకీయ వాతావరణంలో అనుసరిం చాల్సిన ప్రధాన సూత్రం. జగన్‌ ఇప్పుడు ఆ బాటలో నడుస్తున్నాడని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here