Home జిల్లా వార్తలు ఆత్మకూరు నుండే ఆనం… వైసిపి నుండే ఖాయం?

ఆత్మకూరు నుండే ఆనం… వైసిపి నుండే ఖాయం?

Anam Rama Narayana Reddy

”ఈ గట్టునుంటావా… నాగన్న ఆ గట్టునుంటావా” అన్న పాటలో మాదిరిగా నిన్నటి వరకు తన రాజకీయ పయనం ఎటువైపు అన్నది తేల్చుకోకుండా వున్న ఆనం రామనారాయణరెడ్డి ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. తెలుగుదేశంపార్టీని వీడడం ఖాయమని విశ్వసనీయ సమాచారం.

విజయవాడలో జరిగిన మహానాడుకు కూడా ఆయన హాజరు కాకపోవడం, ఆత్మకూరు నియోజకవర్గంలో అభ్యర్థిత్వంపై తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న సర్వేలో ఆయన పేరు లేకపోవడంతో ఇక ఆయన టీడీపీలో కొనసాగడం కష్టమేనని తేలి పోయింది. ఇటీవల ఆత్మకూరు, నెల్లూరురూరల్‌ నియోజకవర్గాల మినీమహానాడులలో పాల్గొని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మీద, తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యాల మీద ఘాటైన విమర్శలు సంధించిన ఆయన ఆ వేదికల మీదే తన ఉద్దేశ్యాన్ని చెప్పకనే చెప్పాడు.

ఆనం సోదరులు తెలుగుదేశంలో చేరి మూడేళ్ళయ్యింది. చంద్రబాబు తమకిచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని ఆనం సోదరులు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్సీ కావాలన్న కల నెరవేరకుండానే మాజీఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూసారు. ఆయన మరణానికి ముందే చంద్రబాబును నమ్మి తెలుగుదేశంలో వుండొద్దు, బహిరంగ క్షమాపణలు చెప్పైనా వైసిపిలో చేరండని తన తమ్ముడు ఆనం రామనారాయణరెడ్డికి సూచించినట్లు సమాచారం. వివేకా మృతికి ముందే ఆనం పార్టీ మారడంపై వూహా గానాలొచ్చాయి. జరిగిన పరిణామాలు కూడా అలాగే వున్నాయి. అయితే వివేకా అంతిమయాత్ర రోజు చంద్రబాబు రావడం, ఆనం కుటుంబసభ్యులతో సమావేశం కావడం, ఆనం రామనారాయణరెడ్డిని పక్కనే పెట్టుకుని మీడియాతో మాట్లాడడం వంటి పరిణామాలతో పాటు వైసిపిలో చేరితే ఏ సీటిస్తారన్నదానిపై ఆనంకు క్లారిటీ ఇవ్వకపోవడం వంటి కారణంతో ఆనం పార్టీ మారే కార్యక్రమానికి బ్రేక్‌ పడింది. ఆనం ఇక తెలుగుదేశంలోనే ఉంటాడు అనుకున్న తరుణంలోనే మళ్ళీ జిల్లా రాజకీయాల్లో వూహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వంపై చేసిన విమర్శలు, మహానాడుకు వెళ్ళకపోవడం వంటి అంశాలు ఆయన పార్టీ మారుతాడనే దానికి బలమైన సంకేతాలు. వైసిపి నుండి కూడా ఆయనకు సానుకూల సంకేతాలు అందబట్టే చంద్రబాబు ప్రభుత్వంపై బలంగా విరుచుకుపడినట్లు తెలుస్తోంది. ఆయన పార్టీలో చేరితే ఏ సీటు ఇవ్వాలన్నదానిపై కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం. ఆత్మకూరు సీటునే ఆయనకు ఖరారు చేసే అవకాశాలున్నాయి. వైసిపిలో వున్న సీనియర్‌ నేత, ఆనంకు సన్నిహితుడైన బొత్స సత్యనారాయణ, వైసిపిలో కీలకభూమిక పోషిస్తున్న ఎంపీ విజయసాయిరెడ్డిల చొరవతోనే ఆనంకు వైసిపిలో రూటు క్లియర్‌ అయినట్లుగా సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here