Home జిల్లా వార్తలు ఆత్మకూరు ‘దేశం’లో… ఆరని జ్వాల

ఆత్మకూరు ‘దేశం’లో… ఆరని జ్వాల

ఆత్మకూరు అసెంబ్లీకి తెలుగుదేశం అభ్యర్థిగా మాజీఎమ్మెల్యే బొల్లినేని కృష్ణయ్య ప్రచారంలో వున్నాడు. అద్భుతాలు జరిగితే తప్పితే అభ్యర్థి ఆయనే! చంద్రబాబే సంకేతాలిచ్చేసాడు. అయితే ఇక్కడ విచిత్రమేమిటంటే బొల్లినేని కృష్ణయ్యకు ఇంతవరకు తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధాలు లేకపోవడం. ఆయన ఇంతవరకు టీడీపీ సభ్యుడు కాదు. ఆ పార్టీలో చేరనూ లేదు. కాని టీడీపీ వాళ్ళు మాత్రం టిక్కెట్‌ ఇచ్చారు. ఆయన తిరిగేస్తున్నాడు. బొల్లినేని కృష్ణయ్య 1999లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ ఎన్నికల్లో ఆత్మకూరు నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచాడు. 2004లో కాంగ్రెస్‌ను వదిలి బీజేపీలోకి వెళ్ళాడు. ఆత్మకూరు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయాడు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం రామనారాయణరెడ్డికి మద్దతునిచ్చాడు. ఆ తర్వాత కూడా ఆయనతో స్నేహంగా వుంటూ వచ్చాడు. 2015లో ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంలో చేరినప్పుడు కూడా బొల్లినేని కృష్ణయ్య అనుచరులు తెలుగుదేశంలో చేరారేగాని ఆయన అధికారికంగా ఆ పార్టీలో చేరలేదు.

బొల్లినేని కృష్ణయ్య అభ్యర్థి అన్నది వూహించని విధంగా తెరపైకి వచ్చింది. కృష్ణయ్యకు ముందు ప్రచారంలో వుండింది మాజీఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్యనాయుడు, డీసీసీబీ ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి, మాజీ ఇన్‌ఛార్జ్‌ గూటూరు కన్నబాబులు. వీరి ముగ్గురిలో ఒకరు అభ్యర్థి అవుతారని భావిస్తూ వచ్చారు. అయితే ఇటీవల బొల్లినేని స్వగ్రామమైన చేజర్ల మండలం మాముడూరులో బొల్లినేని వర్గీయులకు, మేకపాటి వర్గీయులకు వివాదం తలెత్తడం, ఈ రెండు కుటుంబాల మధ్య వున్న స్నేహసంబంధాలు తెగిపోవడం, తద్వారా బొల్లినేని కృష్ణయ్యను టీడీపీ వాళ్ళు ముగ్గులోకి దించడం చకచకా జరిగిపోయాయి.

అయితే కృష్ణయ్యను పార్టీలోకి తీసుకొచ్చి అభ్యర్థిగా ప్రచారం చేయడం వరకు బాగానేవుంది. నియోజకవర్గంలోని మిగతా పార్టీ నాయకులు ఆయనకు ఎంతవరకు సహకరిస్తారన్న సందేహాలు లేకపోలేదు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయి ఆ తర్వాత ఇన్‌ఛార్జ్‌గా వున్న కన్నబాబును 2015లో ఆనం రామనారాయణ రెడ్డి పార్టీలో చేరాక పక్కనపెట్టారు. మొన్న రామనారాయణరెడ్డి పార్టీని వదిలిపోయాక తననే ఇన్‌ఛార్జ్‌గా పెడతారని కన్నబాబు భావించాడు. అయితే పార్టీ అనూహ్యంగా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని ఇన్‌ఛార్జ్‌గా నియమించ డంతో ఆయన జిల్లా పార్టీ ఆఫీసులోనే నానా ఆగిత్యం చేసాడు. ఇప్పుడు అభ్యర్థిగా కృష్ణయ్యను ఏకపక్షంగా నియమించడం కూడా ఆయనకు మింగుడుపడడం లేదు. వచ్చే ఎన్నికల్లో కన్నబాబు కృష్ణయ్యకు పని చేస్తాడా?

ఇక డీసీసీబీ ఛైర్మెన్‌ మెట్టుకూరు ధనుంజయరెడ్డి కూడా ఆత్మకూరు సీటును ఆశించాడు. ఆదాల ప్రభాకర్‌ రెడ్డి ఎంపి అభ్యర్థి అయితే ఆత్మకూరు సీటు తనదేననుకున్నాడు. 2009, 2014 ఎన్నికల్లో ఆత్మకూరు కాంగ్రెస్‌ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి తరపున ఎలక్షన్‌ చేసింది ఆయనే! నియోజకవర్గంలో బంధుగణం, అనుచరవర్గం వుంది. మరి పార్టీ నిర్ణయించిన అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యతో ఆయన ఎంతవరకు సర్ధుకుపో తాడనే అనుమానాలున్నాయి.

అన్నింటికి మించి కొమ్మి లక్ష్మయ్యనాయుడు… తెలుగుదేశం వాళ్ళే ఆయనకు ఇటీవల లేనిపోని ఆశలు పెట్టి ఉసూరుమనిపించారు. కొమ్మి లక్ష్మయ్య, బొల్లినేని కృష్ణయ్య నిప్పు-ఉప్పు లాగా వుంటారు. అసలు బొల్లినేని కృష్ణయ్య రాజకీయాలలోకి దిగిందే కొమ్మి లక్ష్మయ్యను దెబ్బకొట్టడం కోసం. అలాంటి శత్రుత్వం వున్న వీళ్ళిద్దరూ ఒకే ఒరలో ఇముడుతారా? గత వైరాన్ని మరచి కృష్ణయ్యకు లక్ష్మయ్య సహకరిస్తాడా?

మొత్తానికి ఆత్మకూరు తెలుగుదేశంలో అసంతృప్తి జ్వాల రగిలివుంది. దీనిని కృష్ణయ్య ఎంతవరకు ఆర్పుకోగలడన్నదానిపైనే ఆయన భవిష్యత్‌ ఆధారపడి వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here