Home జిల్లా వార్తలు ఆత్మకూరు… ఆత్మీయుల పోరు

ఆత్మకూరు… ఆత్మీయుల పోరు

ఆనం వెంకటరెడ్డి, ముప్పవరపు వెంకయ్యనాయుడు లాంటి ఉద్ధండులకు రాజకీయ పాఠాలు నేర్పిన నియోజకవర్గం. కుటుంబ రాజకీయాలకంటే కూడా ప్రజాసేవలో తమ పెర్ఫార్మెన్స్‌ చూపించిన వాళ్ళకు పెద్దపీట వేస్తారు ఇక్కడి ప్రజలు. అందుకే నాడి పట్టిన సాధారణ వైద్యుడు డాక్టర్‌ బి.సుందరరామిరెడ్డిని గతంలో మూడుసార్లు గెలిపించి వున్నారు.

2019 ఎన్నికలకు సంబంధించి ఈ నియోజకవర్గం ప్రత్యేకత ఆత్మీయుల మధ్య పోటీ నెలకొనడం. తెలుగుదేశం అభ్యర్థిగా బొల్లినేని కృష్ణయ్య, వైసిపి అభ్యర్థిగా సిటింగ్‌ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి తలపడుతున్నారు. వీళ్లిద్దరి కులాలు, పార్టీలు వేరైనా నిన్నటివరకు ఒకే కుటుంబం అన్నట్లు కలిసిమెలిసి సాగినవాళ్లే! వీరికి వ్యాపార సంబంధాలతో పాటు ఆత్మీయ అనుబంధాలున్నాయి. బొల్లినేని కృష్ణయ్య ఇంట్లో ఒక బిడ్డగానే మేకపాటి గౌతమ్‌రెడ్డి పెరిగాడు. కాని, రాజకీయాలలో ఇప్పుడు ప్రత్యర్థులయ్యారు.

బొల్లినేని కృష్ణయ్య 1999లో కేవలం కొమ్మి లక్ష్మయ్యనాయుడిని ఓడించాలనే వ్యక్తిగత కసితో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి కొమ్మిపై గెలిచాడు. 2004లో ఆత్మకూరు నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి అదే కొమ్మి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా వుంటూ తన పనులు తాను చేసుకుంటున్నాడు. అయితే 2019 ఎన్నికలకు ఆత్మకూరులో తెలుగుదేశంకు బలమైన అభ్యర్థి లేకపోవడంతో ఆ పార్టీ నాయకత్వం ఆయనను పట్టుకుని తెరమీదకు తెచ్చింది. ఆత్మకూరు టిడిపి అభ్యర్థిగా నిలబెట్టింది.

ఇక వైసిపి అభ్యర్థి మేకపాటి గౌతమ్‌రెడ్డికి వరుసగా ఇది రెండో ఎలక్షన్‌. 2014లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన ఆనం రామనారాయణరెడ్డి పుణ్యాన గెలిచాడు. ఇప్పుడు కూడా అదే ఆనం రామనారాయణరెడ్డి ఇంకో విధంగా కలిసొచ్చాడు. ఆనం వైసిపిలో చేరడం గౌతంకు ఈ ఎన్నికల్లో కలిసొచ్చింది. ఆనం చేరకపోయి వుంటే గౌతంకు బాగా ఇబ్బందే! ఇక ఈమధ్య ఆత్మకూరు టిడిపి ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరించిన ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైసిపిలో చేరడం వల్ల ఈ నియోజకవర్గంలో పలు మార్పులు చోటుచేసు కున్నాయి. గౌతమ్‌ మీద నియోజకవర్గంలో కొంత వ్యతిరేకత వున్నప్పటికీ ఇటీవల మారిన పరిణామాలతో ఆ వ్యతిరేకత పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here