Home రాష్ట్రీయ వార్తలు అరుపులు తప్ప… మెరుపులేవి?

అరుపులు తప్ప… మెరుపులేవి?

చంద్రబాబు అవినీతిపరుడు… పోలవరం ప్రాజెక్టులో అన్నీ అక్ర మాలే! అంచనాలు కావాలనే పెంచారు. పట్టిసీమ ప్రాజెక్ట్‌లో 400కోట్ల అవినీతి జరిగింది. తెలుగుదేశం నాయకులు గనులను దోచేస్తున్నారు. సెజ్‌లు, రాజధాని పేరుతో భూ దోపిడీకి పాల్పడుతున్నారు… ఏపి బీజేపీ నాయకుల స్కోత్కర్ష ఇది. మా నుండి విడిపోయినా తెలుగుదేశం మా మిత్రపక్షమే! చంద్రబాబునాయుడు మా మిత్రుడే… లోక్‌సభలో రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటన ఇది!

ఒకే పార్టీ రెండు దారులు… బీజేపీలోనే ఒక పార్టీ విషయంలో విభిన్న ధోరణులు. ఏపిలోని బీజేపీ నాయకులు మొదటి నుండి చంద్రబాబు ప్రభుత్వ అవినీతిని ఎండగడుతూనే వున్నారు. 2014 ఎన్నికలప్పుడే తెలుగుదేశంతో పొత్తును బలంగా వ్యతిరేకించారు ఏపి బీజేపీ నాయకులు. కాని, కొన్ని అదృశ్యశక్తుల కృషి ఫలితంగా రెండు పార్టీలకూ పొత్తు కుదిరింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఆ పార్టీకి బీజేపీ మిత్రపక్షంగా కంటే శత్రుపక్షంగానే ఎక్కువుగా పనిచేసింది. మొన్నటివరకు బీజేపీలో టీడీపీ అనుకూల మరియు వ్యతిరేక వర్గాలుండేవి. రాజధాని భూముల వ్యవహారం, ఓటు-నోటు కేసు, పోలవరం అంచనాల పెంపు, పుష్కరాల మృతి, పట్టిసీమ అవినీతి, యధేచ్ఛగా గనుల తవ్వకాలు, అధికారపార్టీ నేతల దురాగతాలపై సభలోనూ, బయట బీజేపీ నాయకులు చీల్చి చెండాడుతూ వచ్చారు.

ఇటీవల ఎన్డీఏ నుండి తెలుగుదేశం బయటకు వచ్చాక బీజేపీ నాయకులు చంద్రబాబుపై చేసే విమర్శలకు మరింతగా పదును పెట్టారు. తెలుగుదేశం అవినీతి అక్రమాలపై దాడి ముమ్మరం చేసారు. సోము వీర్రాజు, విష్ణుకుమార్‌రాజు, కన్నా లక్ష్మీనారాయణ, జిపిఎల్‌ నరసింహరావు వుంటి బీజేపీ నాయకులు వైసిపితో పోటీ పడుతూ చంద్రబాబు పాలనను తూర్పారబడుతున్నారు. చంద్రబాబు అవినీతిపై, ఆయన ఓటు – నోటు కేసుపై సిబిఐ దర్యాప్తు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ అంచనా పెంపుపై విచారణ కోరుతున్నారు.

నిజమే… బీజేపీ నాయకులు కోరుతున్నట్లు తెలుగుదేశం ప్రభుత్వ అక్రమాలపై విచారణ జరిపిస్తే ఎన్నో బొక్కలు బయటపడతాయి. మరి కేంద్రంలో వుండేది కాంగ్రెస్‌ ప్రభుత్వమో, కమ్యూనిష్టుల ప్రభుత్వమో కాదు… బీజేపీ ప్రభుత్వమే! మరి చంద్రబాబు అన్ని అక్రమాలకు పాల్పడివుంటే కేంద్రమే విచారణకు ఆదేశించవచ్చుగా? చంద్రబాబు అవినీతిని బయటపెట్టొచ్చుగా? ఆయనను ప్రజల ముందు అవినీతిపరుడని నిరూపించ వచ్చుగా? లాలూప్రసాద్‌ యాదవ్‌, శశికళ లాంటి వాళ్ళను జైలుకు తోలిన బీజేపీ నాయకులకు చంద్రబాబు పెద్ద లెక్క కాదు కదా!

మరి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్నో లొసుగులున్నాయని తెలిసినా కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఇంకా కిక్కురుమనడం లేదంటే వాళ్ళ అంచనా వేరేగా వున్నట్లే! చంద్రబాబు అక్రమాలపై విచారణ జరిపించగల స్థితిలో కేంద్రంలోని బీజేపీ వుండి కూడా అందుకు పూనుకోవడం లేదు. అలాంటప్పుడు ఏపి బీజేపీ నాయకులు చంద్రబాబు మీద ఎంతగా అరచి గీ పెట్టుకున్నా దండగే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here