Home జిల్లా వార్తలు అయోమయంలో ఆనం

అయోమయంలో ఆనం

నెల్లూరుజిల్లాలో బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన ఆనం రామనారాయణరెడ్డి ఇప్పుడు వినూత్న సమస్యలో చిక్కుకుని వున్నాడు. తన రాజకీయ భవిష్యత్‌ దృష్ట్యా ఎటువైపు అడుగులు వేయాలో తెలియని సందిగ్ధ స్థితిలో ఉన్నాడు.

ఇటీవలే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంపార్టీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి బలమిచ్చేలా రామనారాయణ రెడ్డి వ్యవహారశైలి కూడా వుండింది. తన మరణానికి ముందు ఆనం వివేకానందరెడ్డి తన తమ్ముడు ఆనం రామనారాయణరెడ్డితో… మనం దివంగత నేత వై.యస్‌.రాజశేఖరరెడ్డి కుటుంబం పట్ల తప్పు చేసామని, టీడీపీలో చేరి పొరపాటు చేసామని ఇక ఈ పార్టీలో వుండొద్దని చెప్పినట్లు బయటకు పొక్కడం తెలిసిందే! దీనికి తగ్గట్లుగానే ఆనం రామనారాయణరెడ్డి వైసిపిలో చేరనున్నాడని, ఆత్మకూరు లేదా వెంకటగిరిలలో ఒక సీటు ఆయనకు ఇవ్వొచ్చని కొద్ది రోజుల క్రితం ప్రచారం జరిగింది. వివేకా ఆసుపత్రిలో వున్నప్పుడు పరామర్శించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు వెళితే కూడా రామనారాయణరెడ్డి అక్కడ వుండకుండా వచ్చేసాడు. పార్టీ మారాలను కున్నాడు కాబట్టే సీఎం ముఖం చూడడానికి ఇష్టపడలేదని ఆరోజు అందరూ అనుకున్నారు.

అయితే ఆ తర్వాత ఆనం కుటుంబంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు సంభవించలేదు. వైసిపి నుండి క్లియరెన్స్‌ లేకపోవడంతో ఆయన ఆ పార్టీలో చేరలేదు. ఈలోగా వివేకా స్వర్గస్థులు కావడం, ఏప్రిల్‌ 25వ తేదీన నెల్లూరులో జరిగిన ఆయన అంత్యక్రియలకు చంద్రబాబు రావడం, ఆనం కుటుంబ సభ్యులతో సమావేశమై పరామర్శించడం జరిగాయి. ఇటీవల అమరావతిలో జరిగిన నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌ల సమావేశానికి కూడా ఆనం రామనారాయణరెడ్డి హాజరు కాలేదు. కాని ఆ సమావేశంలో చంద్రబాబు మాత్రం రామనారాయణరెడ్డి వ్యక్తిగత కారణాల వల్ల రాలేదని, ఆనం కుటుంబం మనతోనే వుంటుందని జిల్లా నాయకులకు చెప్పడం జరిగింది. ఇంతవరకు అయితే ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంలోనే వున్నాడు. టీడీపీ నాయకత్వం కూడా ఆయనను పార్టీలో నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఆత్మకూరుకు ఆయన్నే అభ్యర్థిగా ప్రతిపాదిస్తోంది.

అయితే ఇక్కడ ఆనం అనుచరుల పరిస్థితి ఇంకోరకంగా వుంది. ఆత్మకూరు నుండి తెలుగుదేశం అభ్యర్థిగా అయితే గెలవలేమని వాళ్ళు రామనారాయణరెడ్డితోనే చెబుతున్నారు. ప్రజల్లో మీరంటే అభిమానం వుంది, అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంపై వ్యతిరేకత వుంది. ఈ పార్టీలో వుంటే కష్టం. వైసిపిలోకి పోదామని ఒత్తిడి తెస్తున్నారు. అయితే వైసిపి నుండి ఎటువంటి హామీ లేకుండా పార్టీ మారాలనే ఆలోచనలో ఆయన లేడు. ఇప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా ఆత్మకూరు కంటే కూడా ఉదయగిరిలో పోటీ చేయాలని ఆ ప్రాంత నాయకులు ఆనంను కోరుతున్నట్లు తెలుస్తోంది. ఉదయగిరి ప్రాంతంలోనూ ఆనం రామనారాయణరెడ్డికి మంచి పేరుంది. ఆర్ధికమంత్రిగా ఉన్నప్పుడు ఆత్మకూరుకే కాక ఉదయగిరి ప్రాంతానికి కూడా సోమశిల హైలెవల్‌ కెనాల్‌ వంటి ఎన్నో అభివృద్ధి పనులు చేసి పెట్టాడు. అదీగాక ఈ నియోజకవర్గానికి కొత్త నాయకుడవుతాడు. నియోజకవర్గంలోని ముఖ్యనేతలతో సత్సంబంధాలున్నాయి. ఈ దృష్ట్యా టీడీపీలోనే వుంటే ఆయనకు ఉదయగిరి బెటర్‌ అనే అభిప్రాయం వినపడుతోంది.

ప్రస్తుతానికైతే ఆయన రాజకీయ ఊగిసలాటలో వున్నట్లే! ఎలక్షన్‌లో పనిచేయాల్సిన అనుచరులే టీడీపీ నుండి అయితే ఆత్మకూరులో మనం ఓడిపోతామని పదేపదే చెబుతుంటే ఎవరైనా వెనకడుగు వేయాల్సిందే! అలాగని వైసిపి వాళ్ళు పిలవకుండా ఆ పార్టీలోకి పోలేడు. ఇంకొన్ని నెలల పాటు ఆనం రామనారాయణకు ఈ అయోమయ పరిస్థితి తప్పకపోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here