Home జిల్లా వార్తలు అభ్యర్థుల పేర్లు మారుస్తూ… వైసిపితో టీడీపీ మైండ్‌ గేమ్‌!

అభ్యర్థుల పేర్లు మారుస్తూ… వైసిపితో టీడీపీ మైండ్‌ గేమ్‌!

జిల్లా రాజకీయాలలో ఒక విధమైన మైండ్‌ గేమ్‌ నడుస్తోంది. తెలుగుదేశం పార్టీలో ఆదాల ప్రభాకర్‌రెడ్డికి విరాట్‌ కోహ్లి బిల్డప్‌ ఇచ్చి వున్నారు. నెల్లూరు లోక్‌సభే కాదు, జిల్లాలో ఎనీ అసెంబ్లీ… ఆదాల పోటీ చేస్తే గెలుస్తాడు అన్నంత ప్రచారం తెచ్చారు. ఆయన పేరును నెల్లూరు పార్లమెంటుకే కాదు, జిల్లాలో వున్న మిగతా అసెంబ్లీలకు కూడా తిప్పు తున్నారు. జిల్లాలో గూడూరు, సూళ్ళూరు పేట… ఈ రెండు రిజర్వుడ్‌ నియోజక వర్గాలు కాబట్టి సరిపోయింది గాని లేకుంటే ఆ రెండు చోట్ల కూడా ఆదాల ప్రభాకర్‌రెడ్డి పోటీ చేయాలనుకుంటున్నా డని చెప్పేవాళ్ళు. నెల్లూరురూరల్‌, కావలి, కోవూరు అసెంబ్లీలో ఆల్‌రెడీ ఆయన అభ్యర్థిత్వంపై ప్రచారం జరుగుతోంది. ఆత్మకూరుకు ఎలాగూ ఇన్‌ఛార్జ్‌గా వున్నాడు. మొన్నటివరకు నెల్లూరు పార్ల మెంట్‌కు వినిపిస్తున్న పేరు ఇప్పుడు అసెంబ్లీకి మారింది. కోవూరునుండని కొందరు, కావలి నుండి పోటీ చేస్తాడని ఇంకొందరు… ఆలూ లేదు… చూలూ లేదు… కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా మాట్లాడుకుంటున్నారు.

టిడిపిలో ఈయనలాగానే వైసిపిలోనూ ఒక బ్రాండ్‌ అంబాసిడర్‌ వున్నాడు. ఆయనే మాజీఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి. తెలుగుదేశంలో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడని ఆదాలకు పేరుంటే, ఈయనకు మాత్రం నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి మళ్ళీ ఆయనే అయితే పక్కాగా ఓడిపోతాడనే బ్రాండ్‌ పడింది. అదేం దరిద్రమోగాని ఈయన కుంభకోణాలు చేసింది లేదు, ఎవర్నీ తిట్టింది లేదు, ప్రభుత్వ నిధులను దిగమింగిందీ లేదు… కాని పేరు మాత్రం అలా వచ్చేసింది. బహుశా ఆయన మెట్ట ప్రాంతం వాడు కావడం, ప్రజలతో కలుపుగోలుగా లేకపోవడం దీనికి కారణం కావచ్చు. ఆయనపై టిడిపి

వాళ్ళు ఓడిపోతాడని ప్రచారం చేస్తే సరే… వైసిపి వాళ్లే ఆ మాటంటున్నారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా పార్లమెంటు పోటీ విషయం చర్చకు వచ్చినప్పుడు ఈసారి వైసిపి ఎంపి అభ్యర్థి మేకపాటే ఆయితే ఓడిపోతాడు అనే మాట కామన్‌గా వినిపిస్తోంది.

ఆదాలకు సరైన అభ్యర్థిగా మేకపాటి సరిపోడని చెప్పే ఇక్కడ ప్రత్యామ్నాయ అభ్యర్థి గురించి వైసిపి అధిష్టానం ఆలోచన చేస్తోంది. కాని, వైసిపిని ఆ వైపు నుండి దృష్టి మళ్ళించేందుకు తెలుగుదేశం కొత్త ఎత్తుగడలు వేస్తోంది. వాళ్ళకు నెల్లూరు ఎంపిగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి వుం డాలి. ఆయనపై ఆదాల పోటీ చేయాలి. అప్పుడు పార్లమెంటుకే కాదు, పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీలలో సైతం టిడిపి బలం పుంజుకుంటుంది. అందుకు ముందు చేయాల్సింది… ఆదాలను పార్ల మెంటు అభ్యర్థిగా కాకుండా అసెంబ్లీకి పోటీ చేస్తాడని ప్రచారం చెయ్యడం. బి.సి.ల కోటా నుండి బీద మస్తాన్‌రావు పార్లమెంటుకు పోటీ చేస్తాడని ప్రచారం చెయ్యడం. అప్పుడు మేకపాటి రాజ మోహన్‌రెడ్డి సరిపోతాడనే అభిప్రాయం వైసిపిలోనూ ఏర్పడుతుంది. మేకపాటి కూడా సిద్ధమైపోతాడు. ప్రత్యామ్నాయ అభ్యర్థి అలోచననే పూర్తిగా పక్కనపెడ తారు. కాని చివర్లో చంద్రబాబు సీట్లను నిర్ణయిస్తాడు. నెల్లూరు పార్లమెంట్‌ నుండి ఆదాలనే పోటీ చేయమంటాడు. ఆయన సరేనంటాడు. తెలుగుదేశం ఎత్తుగడ ఇక్కడ ఫలిస్తుంది. ఆ టైంలో మేకపాటిని పోటీ నుండి తప్పించలేరు. అప్పటికప్పుడు ఆదాలకు ధీటైన అభ్యర్థిని తేలేరు. ఆదాల పార్లమెంట్‌కు పోవాలన్నది చంద్రబాబు నిర్ణయం. ఈలోపు ఆదాల అసెంబ్లీకి అని జరుగుతున్న ప్రచారమంతా కూడా తెలుగుదేశం ఎత్తుగడలో భాగమేమో అన్నది రాజకీయ మేధావుల అభిప్రాయం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here