Home జిల్లా వార్తలు అప్పు చేసైనా సరే.. విద్యాలయాన్ని నిలబెట్టుకోవాలి

అప్పు చేసైనా సరే.. విద్యాలయాన్ని నిలబెట్టుకోవాలి

కస్తూరిదేవి విద్యాలయం, హాస్టల్‌ రెండింటి నిర్వహణ రాను రాను కష్టమవుతూ వచ్చింది. ఎంత డబ్బు తెచ్చిపెడుతున్నా ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. చేతిలో ఉన్న నిధులు అడుగంటిపోతుండడంతో బాలికల హాస్టల్‌లో నిత్యం కావాల్సిన భోజన వసతికి, ఇతర వసతుల కల్పనకు అత్యవసరమైన నిధులు కూడా లేవు. ఏమిచేయాలో అర్ధం కాని స్థితిలో కమిటీ..ఏదేమైనా సరే..అప్పులు చేసైనా సరే..విద్యాలయాన్ని నిలబెట్టుకోవాలనే ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చింది. కమిటీ పలుసార్లు సమావేశమై ఈ ఆర్థిక బాధలను అధిగమించడానికి ఏమిచేయాలో అన్నివిధాలా ఆలోచించి, విద్యాలయం అభ్యున్నతే పరమావధిగా చర్యలు చేపట్టింది. రోజులు జరుగుతున్నకొద్దీ.. ఆర్థికబాధలు పెరుగుతున్నకొద్దీ.. కమిటీ మరింత వేగంగా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. చివరికి ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి వడ్డీకి కూడా రుణం తీసుకుని విద్యాలయాన్ని పరిరక్షిస్తూ.. సంకల్పబలంతో కమిటీ ముందుకు సాగింది. కస్తూరిదేవి విద్యాలయం పూర్వచరిత్ర తరచిచూస్తే.. నాడు ఈ విద్యాలయం ఎదుర్కొన్న అనేక కష్టనష్టాలతో పాటు, ఆ ఇబ్బందులన్నిటినీ ఆత్మవిశ్వాసంతో నాటి మహనీయులు అధిగమించిన వైనం మన కళ్ళకు కడుతుంది.

ఆర్థిక బాధలతో…

విద్యాలయం సతమతం

విద్యాలయానికి ఆర్థిక బాధలు పెరిగిపోతున్నా వెనుకంజవేయక, అప్పు చేసైనా సరే విద్యాలయం పురోభివృద్ధే లక్ష్యంగా కమిటీ ముందుకు సాగింది. ఆ మేరకు 13-1- 1970లో జరిగిన కమిటీ సమా వేశంలో చర్చిస్తూ, ఆర్ధిక అవరోధా లను ఎదుర్కొనేందుకు తీసుకోవా ల్సిన చర్యలను కూలంకుషంగా చర్చించుకున్నారు. మరోవైపు.. ఇదే సంవత్సరం (1970 ఏప్రిల్‌)లో జరిగిన టెన్త్‌ క్లాస్‌ పబ్లిక్‌ పరీక్షల్లో పాఠశాల ఉత్తీర్ణత బాగా తగ్గడంతో కమిటీ మరింత ఆందోళనకు గురైంది. ఉత్తీర్ణతా శాతాన్ని పెం పొందించేందుకు ఏమిచేయాలో పాఠశాల హెడ్మాస్టర్‌తోను, ఇతర ముఖ్యులతోనూ సుదీర్ఘంగా చర్చించుకున్నారు. అదే సందర్భంలో, మారుతున్న కాలంతో పాటుగా విద్యాలయం అభివృద్ధికి తీసుకోవాల్సిన నిర్ణయాల పట్ల ఒక అవగాహనకు వచ్చేందుకు కమిటీ నియమ నిబంధనా వళిపై కూడా ఈ సమావేశంలో చర్చించుకున్నారు. విద్యాలయం అభ్యున్నతికి అవసరమైతే నిబంధనల్లో తగు మార్పుచేర్పులు చేసుకునే విషయాన్ని కూడా కమిటీ అందరి సలహాలు సూచనలు తీసుకుని ఆయా అంశాలను కూడా కూలంకుషంగా చర్చించింది. కమిటీ నిర్వహణకు తక్షణం అవసరమైన 15వేల రూపాయలను ఒక ఫైనాన్స్‌ కంపెనీ నుంచి స్వీకరించేందుకు కూడా నిర్ణయించు కోవడం జరిగింది.

కాగా, కమిటీ సభ్యుడు శ్రీ జివి సుబ్బరామయ్యగారు పరమపదిం చడంతో 3-7-1970న జరిగిన కమిటీ సమావేశంలో విద్యాలయానికి ఆయన చేసిన సేవలను ప్రస్తుతిస్తూ, ఆయన మృతికి కమిటీ ప్రగాఢ సంతాపం ప్రకటించింది. ఈ సమా వేశంలో కమిటీ అధ్యక్షులు శ్రీయు తులు టి. రామిరెడ్డిగారు, కార్యదర్శి సికె శుభప్రదమ్మలతో పాటు సభ్యులు శ్రీయుతులు రేబాల దశరధరామి రెడ్డి, మేనకూరు ఆదిశేషారెడ్డి, ఎన్‌.శ్రీరామమూర్తి, శ్రీమతి అన్నపూర్ణమ్మ, గోపాలకృష్ణారెడ్డి, ఎక్స్‌అఫిషియో సభ్యురాలు పి.సావిత్రిదేవి పాల్గొన్నారు.

మల్లెతోట సాగు కోసం కొంత స్థలం

లీజుకు కావాలంటూ వచ్చిన ప్రతిపాదన

క్రమేణా విద్యాలయం అభివృద్ధికి అవసరమైన నిధులు అడుగంటి పోవడంతో నిర్వహణ అత్యంత కష్టసాధ్యమైంది. ఆ ఆర్ధిక అవస్తల నుంచి బయటపడి విద్యాలయాన్ని ముందుకు నడిపించేందుకు కమిటీ సమాయత్తమైంది. విద్యాలయంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు రివైజ్డ్‌ పే-స్కేల్స్‌ ఇవ్వాలి. వారికి జీతాలతో పాటు, పాఠశాల నిర్వహణకు, ఇటు హాస్టల్‌లో విద్యార్థినులకు అవసరమైన మౌలిక వసతులకు కల్పిం చాలి. అందులోనూ మరుగుదొడ్ల బాగుకు, సెప్టిక్‌ ట్యాంక్‌ అత్యవసర మరమ్మతులకు, ఇతరత్రా కనీస వసతులను విద్యాలయంలోను, ఇటు హాస్టల్‌లోనూ ఏర్పాటు చేసేం దుకు కమిటీ పలుసార్లు సమావేశమై చర్చించింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలను రాబట్టు కోవడంతో పాటు ఈ వసతుల కల్పనకు నిధుల సేకరణ తక్షణావ సరంగా మారింది. మరోవైపు కళాశాల స్థాపనకు అవసరమైన నిధులను కూడా సేకరించాలని, ఏదేమైనా సరే విద్యాలయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని అందరూ కలిసి నిర్ణయించు కున్నారు. ప్రస్తుతానికి అవసరమైన నిధులు లేకపోవడంతో, వడ్డీతోనైనా సరే రుణం తీసుకుని ఆయా కార్యక్రమాలను అంతరాయం లేకుండా నిర్వహించాలని కమిటీ నిర్ణయించింది.

అవసరమైతే ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీల వద్దనైనా సరే రుణం స్వీకరించేందుకు కూడా సిద్ధమైంది.. విద్యాలయం, హాస్టల్‌ నిర్వహణకు స్వల్పమొత్తాలు కూడా చేతిలో లేకపోవడంతో, మద్రాసుకు చెందిన ఒక ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీ నుంచి 5వేల రూపాయలు తీసుకునేందుకు, అందుకు వడ్డీ కూడా చెల్లించేందుకు అంగీకరిస్తూ కమిటీ నిర్ణయించు కుంది. అలా తీసుకున్న ఆ డబ్బును వెంటనే పాఠశాల మరుగుదొడ్ల బాగుకు, నీటి వసతిని మెరుగుపరచేందుకు వెచ్చించాలని నిర్ణయించింది. అయితే, అంతటితోనే కష్టాలు తీరిపోలేదు!…

నానాటికీ రోజువారీ నిర్వహణ వ్యయభారమై, చుట్టూ చుట్టుముడు తున్న ఆర్థిక కష్టాలను అధిగమించడానికి .. అవసరమైతే విద్యాలయానికి చెందిన 65 సెంట్ల స్థలాన్ని మల్లెతోటల సాగుకు ఒక ఏడాదిపాటు (1-10-1971 నుంచి 30-9-1972 వరకు) లీజుకు ఇవ్వడానికి వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించేందుకు సిద్ధమైంది. అలా లీజుకు ఇచ్చేందుకు ప్రెసిడెంట్‌, సెక్రటరీలకు అధికారం ఉంది కనుక, ఆ విషయాన్ని వారి అభిప్రాయానికే వదిలారు! అందరి సమ్మతితో ఆ విద్యాలయం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుని విద్యాలయాన్ని పరిరక్షించు కోవాలనే ధ్యేయంతో 21-8- 1971న జరిగిన కమిటీ సమా వేశంలో తగు నిర్ణయాలు తీసు కున్నారు.

కాగా, డా. బెజవాడ గోపాల రెడ్డిగారు తన తనయుని వివాహం సందర్భంగా ఈ విద్యాలయానికి విరాళంగా ఇచ్చిన 500 రూపాయ లను (అప్పట్లో 5 వందల రూపాయ లంటే పెద్ద మొత్తం కిందే లెక్క) కమిటీ స్వీకరించి, ఆయన కోరిక మేరకు దానిని ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి దానిపై వచ్చే వడ్డీతో పేద విద్యార్థులకు, ప్రతిభ గల విద్యార్థులకు పుస్తకాలు బహుకరించాలని కూడా ఈ సమావేశంలో నిర్ణయించడం జరిగింది. ఈ సమావేశంలో నాటి సభ్యులు శ్రీయుతులు టి. రామిరెడ్డిగారు, సికె శుభప్రద, ఎన్‌. శ్రీరామమూర్తి, వై. వెంకటేశ్వర్లు, ఎం.గోపాలరెడ్డిగార్లు పాల్గొన్నారు. ఆ తర్వాత రోజుల్లో మరో 2 ఎకరాలను మల్లెతోటల సాగుకు లీజుకు ఇవ్వవలసిందని కోరుతూ మరో ప్రతిపాదన కమిటీ ముందుకు వచ్చింది. 29-9-1973న కమిటీ సమావేశం జరగాల్సి

ఉండగా కమిటీ అధ్యక్షుడు టి. రామిరెడ్డిగారు, కార్యదర్శి సికె శుభప్రద గారు, ఎక్స్‌అఫిషియో సభ్యురాలు పి.సావిత్రిదేవిగారు వచ్చినా సమా వేశానికి తగ్గ కోరం లేకపోవడంతో సమావేశం వాయిదా పడింది.

కమిటీ రథసారధి.. మహాదాత..

టి.రామిరెడ్డి గారి మృతి

విద్యాలయానికి తీరని లోటు

కష్టాలన్నీ వస్తే..ఒకేసారి అన్నీ ముంచుకువస్తాయన్న సామెతగా విద్యాలయానికి మరో కష్టం వచ్చింది. కొంతకాలం క్రితం కస్తూరిదేవి విద్యాలయ వ్యవస్థాపకురాలు శ్రీమతి పొణకా కనకమ్మగారి మరణం అందరికీ తీరని ఆవేదన కలిగిస్తే, ఆ తర్వాత ఈ విద్యాలయానికి దాదాపు 17 ఏళ్ళపాటు అపారమైన సేవలందిస్తున్న ఏ.పద్మనాభరెడ్డి గారు 1968లో మృతి చెందడంతో కమిటీ దిగాలుపడితే, తొలినాళ్ళ నుంచి ఇప్పటిదాకా సుమారు 30ఏళ్ళ పాటు ఈ విద్యాలయానికి అండదండగా ఉంటూ, అన్ని కష్టనష్టాల్లోనూ భాగం పంచుకుంటూ.. విద్యాలయం పురోభివృద్ధికి అనితరసాధ్యమైన సేవలందిస్తున్న ప్రముఖ సమాజసేవాభిలాషి, ప్రసిద్ధ వదాన్యులు శ్రీయుతులు తిక్కవరపు రామి రెడ్డిగారు పరమపదించడంతో కమిటీ మరింతగా ఆవేదనకు లోనైంది.

శ్రీ రామిరెడ్డిగారు కమిటీ అధ్యక్షునిగా అపారమైన సేవలందించ డమే కాక, విద్యాలయం అభివృద్ధికి పెద్దమొత్తంలో విరాళాలిచ్చి, అవసరమైనప్పుడల్లా ఆదుకునే సహృదయశీలి.

అంతే కాదు, విద్యాలయానికి సంబంధించి ప్రతి విషయం మీద ఆయన ప్రత్యేకశ్రద్ధ తీసుకుంటుండేవారు. ఏ చిన్న కష్టం వచ్చినా నేనున్నానంటూ ముందుకు వచ్చేవారు. కమిటీకి ఆప్తుడుగా, ఆత్మబంధు వుగా శ్రీ రామిరెడ్డి గారు ప్రఖ్యాతిచెందారు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీ రామిరెడ్డిగారు అధ్యక్షులుగా ఉన్నారంటేనే విద్యాలయానికి కొండంత భరోసా ఉండేది. అలాంటి ప్రముఖులైన శ్రీ రామిరెడ్డిగారు 1973 డిసెంబరు 9న పరమపదించడంతో జిల్లా శోకతప్తమైంది. విద్యా లయం కమిటీ వారే కాక, జిల్లా ప్రజానీకమంతా ఆ మహనీయుని సేవలను తలచుకుంటూ కన్నీటి నివాళులర్పించారు. 11-12- 1973లో జరిగిన కమిటీ సమావేశంలో ఆ మహాదాతకు కమిటీవారు ఘనమైన నివాళులర్పించారు.

ఇన్నాళ్ళుగా.. ఇన్నేళ్ళుగా కస్తూరిదేవి విద్యాలయ కమిటీకి అధ్యక్షత్వం వహిస్తూ విద్యాలయం అభివృద్ధి రథసారధిగా ప్రసిద్ధి చెందిన రామిరెడ్డిగారి స్థానంలో.. మరో ప్రముఖ వదాన్యుడైన

శ్రీ ఆర్‌.దశరధరామిరెడ్డిగారిని విద్యాలయం కమిటి ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆయన సారధ్యంలో విద్యాలయం పురోభివృద్ధికి ఎన్నో సలహాలు, సూచనలు, నిర్ణయాలు తీసుకున్నారు.

విద్యాలయం ప్రారంభం నుంచి ఇప్పటిదాకా ఇలా ఎందరో మహానుభావులు…సమాజసేవాభిలాషులు అందరూ కలసి బాలికలకు విద్య ఉండాలని, తద్వారా సమాజాభ్యున్నతికి బాటలు వేయాలనే ఏకైక లక్ష్యంతో కృషి చేయడం ఎంతో అపూర్వం… ఆ ఆకాంక్షతోనే వారు అన్ని శ్రమల కోర్చి.. ఇంతటి బృహత్తరమైన కృషికి కంకణబద్ధులు కావడం..విద్యాలయం స్థాపనకు..బాలికలకు వసతి గృహం ఏర్పాటుకు కూడా కృషిచేసి..సంకల్పబలంతో వారు అనుకున్నవి సాధించుకోవడం ఎంతో విశేషం. అలాంటి మహనీయులు ఈ గడ్డమీద పుట్టడం… నిజంగా సింహపురి సీమ భాగ్యమనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here