Home గల్పిక అపస్మారక స్థితిలోకి ఎన్టీఆర్‌

అపస్మారక స్థితిలోకి ఎన్టీఆర్‌

అది దేవేంద్ర లోకం రాజధాని అమరావతి. వీకెండ్‌ కల్చరల్‌ ఈవెంట్స్‌లో భాగంగా ఆరోజు ఐరావత్‌ కన్వెన్షన్‌హాల్‌లో డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ పెట్టారు. టంగుటూరు ప్రకాశం పంతులు, బెజవాడ గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి, వై.యస్‌. రాజశేఖరరెడ్డి వంటి టాప్‌ విఐపిలు మాత్రమే ఆ హాల్‌లో వున్నారు. దేవేం ద్రుడు వచ్చి జ్యోతిప్రజ్వలన చేసి సాంస్కృతిక కార్యక్రమాలను లాంఛనంగా ప్రారంభించారు. తొలుత స్టైల్‌ ఆఫ్‌ సింహపురి ఆనం వివేకా మేనకతో స్పెషల్‌ సాంగ్‌… ”గున్నా గున్నా మామిడి” అనే పాటకు డ్యాన్స్‌ చేశాడు. తర్వాత ఎన్టీఆర్‌ వంతు వచ్చింది. ఆయన రంభతో కలిసి ‘కొండవీటి సింహం’లోని ”బంగినిపల్లి మామిడిపండు రంగు తేలింది, చిలకే కొట్టని జామపండు చేతికొచ్చింది” అనే పాటకు తన స్టైల్‌లో హావభావాలు ప్రదర్శిస్తూ డ్యాన్స్‌ చేస్తుండగా కోట్ల, నేదురుమల్లి, వై.యస్‌. తదితర ప్రేక్షకులు హుషారుగా చప్పట్లు కొడుతూ విజిల్స్‌ వేస్తున్నారు. అలా డ్యాన్స్‌ చేస్తుండగా ఎన్టీఆర్‌ సడెన్‌గా చేతులతో గుండె పట్టు కుని క్రింద పడిపోయాడు. ఇంద్రుడితో సహా అందరూ గాబరాపడ్డారు. వై.యస్‌. అయితే ‘వనాట్‌ ఎయిట్‌’ అంటూ కేకేసాడు. ఇంద్రుడు వుండి… ఇక్కడ ఇంకా 108లు పెట్టలేదు. ఎంతటి ప్రాణాపాయస్థితి వచ్చినా అమృతం అందుబాటులో వుంటుంది, ఇబ్బంది లేదు అని చెప్పాడు. అమృతం అంటే ఫారినా, లోకలా అని నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి అడిగాడు. ఫారిన్‌ ఏంటి? లోకల్‌ ఏంటి? అని ఇంద్రుడు అమాయ కంగా అడిగాడు. అందుకు నేదురు మల్లి… అదేనబ్బా, విస్కీ… ఫారిన్‌ స్కాచా… మేడిన్‌ ఇండియానా… అని విడమర్చి చెప్పాడు. అది విని ఇంద్రుడు అలాంటి సురాపానాలు ఇక్కడ నిషేధం… అయినా మద్యపాన నిషేధం అమలు చేసిన ఆ మహానేతకు మద్యం తాగి స్తామా… మేము ఆయనకు ఒరిజినల్‌ అమృతమే తాగించి తిరిగి మామూలు మనిషిని చేస్తాము అని చెప్పి గంధర్వుల చేత ఒక బాటిల్‌లో అమృతం తెప్పించి ఎన్టీఆర్‌ చేత తాగించాడు. ఒక్క దెబ్బకు ఎన్టీఆర్‌ లేచి కూర్చున్నాడు. ఏమైంది మీకు అని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి అడిగాడు. అందుకు ఎన్టీఆర్‌… ఆంధ్ర ప్రదేశ్‌లో జరగరానిది ఏదో జరిగి నట్లున్నది అందుకే నా గుండె గతుక్కు మన్నది అని అన్నాడు. అంతలో నారాయణ… నారాయణ… అంటూ ఇంటర్నేషనల్‌ మ్యాన్యువల్‌ మీడియా నారదుడు వచ్చాడు. రాగానే అక్కడ పరిస్థితిని గమనించి ఏమైంది అని అడిగాడు. ఇదీ జరిగింది అంటూ ఇంద్రుడు అక్కడ జరిగింది చెప్పాడు. అప్పుడు నారదుడు ఎన్టీఆర్‌తో… మీ అల్లుడు హైటెక్‌రత్న చంద్రబాబుపై మీ అభిప్రాయం అని అడిగాడు. దానికి ఎన్టీఆర్‌… నా అల్లుడికేం బంగారం. నన్ను దించి నా సీటును లాగేసుకున్నా డనే చిన్న బాధేగాని, మిగతా అన్ని విషయాలలో సమర్ధుడిగా వున్నాడు. తెలుగుదేశం ఆశయాలను కొనసాగిస్తు న్నాడు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడు తున్నాడు. మా అల్లుడు వీరోచిత పోరాటం ఎలాంటిదో కావాలంటే ఈ వీడియోలో చూడండి అంటూ ఒక సి.డి తీసి నారదుడికిచ్చాడు. నారదుడు దానిని సి.డి డ్రైవ్‌లో పెట్టి ఆన్‌ చేసాడు. స్క్రీన్‌ మీద చంద్రబాబు ప్రత్యక్షం…

గుంటూరులోని ఓ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగం. తమ్ముళ్ళూ… ఈ రాష్ట్రానికి అన్యాయం చేసింది కాంగ్రెస్‌… తెలుగుజాతిని నాశనం చేయాలని చూస్తున్నది కాంగ్రెస్‌… సోనియాగాంధీ ఓ ఇటలీ దెయ్యం… రాహుల్‌గాంధీ ఇండియా-ఇటలీ మిక్స్‌డ్‌ పిల్లరాక్ష సుడు… ఈ కాంగ్రెస్‌ను దేశం నుండే తరిమికొట్టాలి. దేశంలో ఉగ్రవాదం పెరగడానికి కారణం కాంగ్రెస్‌. కాశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది వాళ్ళే! అస్సాంలో ఉల్ఫా ఉగ్రవాదానికి పురుడు పోసింది ఆ పార్టీయే. పంజాబ్‌లో ఖలిస్థాన్‌ తీవ్రవాదానికి బీజాలు వేసింది కాంగ్రెస్సే… ఈ కాంగ్రెస్‌ను ఇండియా వదిలి ఇటలీకి తరిమికొట్టే వరకు నేను పచ్చిమంచినీళ్ళు కూడా ముట్టను అని శపధం చేశాడు. అప్పుడే ఓ కార్యకర్త గ్లాసులో ఒక పానీయం తెచ్చి తాగమని ఇచ్చాడు. నేను ఇప్పుడే కదా చెప్పాను, కాంగ్రెస్‌ను ఈ దేశం నుండి తరిమికొట్టే దాకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనని అని చంద్రబాబు సీరియస్‌గా అన్నాడు. అందుకు ఆ కార్యకర్త… అయ్యో పొర పడుతున్నారు సార్‌, ఇవి మంచినీళ్ళు కాదు, ఫ్రూట్‌జ్యూస్‌ అని చెప్పాడు. అట్లాగైతే ఓకే అంటూ చంద్రబాబు గుటగుటతాగేసాడు. అక్కడితో ఆ సీన్‌లు అయిపోయాయి.

అప్పుడు ఎన్టీఆర్‌ చెమర్చిన కళ్లతో… 1995లో నాకు వెన్నుపోటు పొడిచి నప్పుడు నా అల్లుడిపై చెప్పలేనంత కోప మొచ్చింది. ఆ తర్వాత అతను కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా చేస్తున్న పోరాటం చూసి నాకు పొడిచిన వెన్నుపోటు కరెక్టేమో ననిపించింది. ఎందుకంటే అతని స్థానంలో నేనున్నా కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇంత సమర్ధవంతంగా పోరాడివుండేవాడిని కాదేమో అని అన్నాడు.

అప్పుడు నారదుడు… మీరు పార్ట్‌-1 చూపించారు. ఇప్పుడు పార్ట్‌-2 చూడండి అంటూ ఇంకో సి.డి.ని తీసి సిడి డ్రైవ్‌లో పెట్టి ఆన్‌ చేశాడు. స్క్రీన్‌ మీద సీన్‌లు మొదలయ్యాయి.

ఢిల్లీలోని టెన్‌జనపథ్‌. అప్పుడే అక్కడ కొన్ని కార్లు ఆగాయి. అందులో నుండి హైటెక్‌రత్న చంద్రబాబునాయుడు, ఎంపీలు సీఎం రమేష్‌, సుజనాచౌదరి, మాగంటి మురళీమోహన్‌, ఎన్‌.శివ ప్రసాద్‌, గల్లా జయదేవ్‌ తదితరులు దిగారు. నేరుగా లోపలకు వెళ్ళారు. కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చారు. వాళ్ళ పక్కన రాహుల్‌గాంధీ కూడా వున్నాడు. చంద్రబాబుతో సహా అందరి మెడల్లో పసుపు కండువాలతో పాటు కాంగ్రెస్‌ కండువాలు వున్నాయి. అప్పటికే అక్కడ మీడియావాళ్ళంతా పోగైవున్నారు. చంద్రబాబు మైకుల ముందుకొచ్చి… ఇదొక చారిత్రాత్మక ఘట్టం. మా ఈ కలయిక దేశ ప్రజలకు కానుక. జాతికి వేడుక. నరేంద్ర మోడీ నుండి దేశ ప్రజలను రక్షించడం కోసం కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాం. ఈ దేశానికి కాంగ్రెస్సే భద్రత, భరోసా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ను మించిన పార్టీ లేదు. సోనియాగాంధీ ఓ ఇటలీ దేవత. ఆ తల్లి చల్లని చూపుతోనే ఈ దేశం సుభిక్షంగా వుంటుంది. కాంగ్రెస్‌తో నేను పొత్తు పెట్టుకోవడానికి మరో కారణం మా మామ, తెలుగు ప్రజల అన్న ఎన్టీఆర్‌… రాత్రి ఆయన నాకు కలలో కనిపించి… అల్లుడూ, ఆ నరేంద్ర మోడీ తెలుగు ప్రజలకు ద్రోహం చేశాడు. తెలుగు జాతి ఆత్మగౌరవం నిల బెట్టేలా నువ్వు కాంగ్రెస్‌తో కలిసి మోడీపై పోరాడు అని ఆయన కలలో ఏడుస్తూ చెప్పాడు. ఆయన కోరిక తీర్చడానికే తెల్లారేసరికల్లా ఢిల్లీ వచ్చి కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చు కున్నాను అని చెప్పి ముగించాడు.

స్క్రీన్‌ మీద సీన్‌లు ఆగిపోయాయి. ఇప్పుడు చెప్పండి మీ అల్లుడి గారి గురించి… కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఇంకా పోరాటం చేస్తున్నాడని నమ్ముతు న్నారా… అంటూ నారదుడు ఎన్టీఆర్‌ భుజంపై చేయివేసి ఊపాడు. అప్పటికే ఆ దృశ్యాలు చూసి నిశ్ఛేష్టుడైన ఎన్టీఆర్‌ నారదుడి కుదుపుకు కుర్చీలో నుండి అలాగే కిందకు వాలిపోయాడు. చంద్ర బాబు ఇచ్చిన షాక్‌తో ఈసారి ఎన్టీఆర్‌ కోలుకోలేని విధంగా స్ట్రోక్‌కు గురయ్యా డని వూహించిన వై.యస్‌. ఈసారి అమృ తంతో లాభం లేదనుకుని ‘అంబులెన్స్‌’ అంటూ గట్టిగా అరిచాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here