Home జిల్లా వార్తలు అన్‌’హ్యాపీడేస్‌’

అన్‌’హ్యాపీడేస్‌’

తెలుగుదేశం ప్రభుత్వం వాస్తవిక పరిపాలనకంటే ఈవెంట్లకు అధిక ప్రాధాన్యతనివ్వడం చూస్తూనే వున్నాం. పది రూపాయల పనికి పాతిక రూపాయల పబ్లిసిటీ అన్నట్లుగా చంద్రబాబు పాలన సాగి పోతోంది. ఈ నాలుగేళ్ళ కాలంలో పథకాల అమలు కంటే ఈవెంట్లు ఎక్కువుగా జరగడం చూసాం. ఆఖరకు పుష్కరాల ఈవెంట్‌ షూటింగ్‌ టైంలోనే 23మంది తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం జరిగింది.

ఇలాంటి ఈవెంట్ల పరంపరలోనే ‘హ్యాపీ సండే’ అనే ఒక సంస్కృతిని తెచ్చిపెట్టారు. వారంలో ఆరు రోజులు అడుక్కుతిన్నా సరే ఆదివారం మాత్రం ఆడుతూ పాడుతూ ఎగిరిగంతులేయండనేది దీని ఉద్దేశ్యం. ప్రతి ఆదివారం ఏదో ఒక పార్కులో డిజెలు ఏర్పాటు చేస్తున్నారు. కాలేజీ కుర్రకారును పిలుస్తున్నారు. అధికారపార్టీ మంత్రులు, నాయకులు పాటలకు చిందులు వేస్తూ ‘హ్యాపీ సండే’ అంటూ హ్యాపీగా ఫీలవుతున్నారు. ప్రతి ఆదివారం కూడా నెల్లూరులో ఎక్కడో ఒకచోట ఈ హ్యాపీసండే పేరుతో పిల్లల చేత తైతక్కలాడిస్తున్నారు.

ఈ కార్యక్రమాలు పులిని చూసి నక్క వాత పెట్టుకు న్నట్లుగా వుంటుంది. పాశ్చాత్య దేశాలలో వీకెండ్‌ పార్టీలు, హ్యాపీ సండే వంటివి వుంటాయి. వాళ్ళకేందంటే ఐదురోజులు యంత్రాల్లాగా పని చేస్తారు. ఆ రెండురోజులు మనుషుల్లాగా జీవిస్తారు. కాబట్టి వాళ్ళకు అవి సెట్‌ అవుతాయి. మనమేమీ అంత యాంత్రిక జీవనం గడపడం లేదు. అసలు తీరికలేనంత పనులు కూడా ఏమీ ఉండడం లేదు. ప్రతి మనిషికి ఉపాధి దొరికి, ప్రతి రంగం ఉత్సా హంగా ముందుకు కదులుతుంటే మన జీవితాలలో ‘హ్యాపీసండే’ కాదు ‘హ్యాపీడేస్‌’ వస్తాయి.

నగరంలో 20రోజులకు పైగా పారిశుద్ధ్య కార్మికుల సమ్మె జరుగుతుంది. నగరంలో ఎక్కడిచెత్త అక్కడే వుంది. అసలే తవ్విన రోడ్లతో ప్రతి వీధిలో దుమ్ము మయం, దీనికితోడు ఇప్పుడు చెత్త… ప్రజలకు హ్యాపీ సండే కాదు, అన్‌హ్యాపీ డేస్‌ కొనసాగుతున్నాయి. పాలకులు, అధికారులు హ్యాపీ సండేలపై చూపిన శ్రద్ధ, పారిశుద్ధ్య పనులపై చూపిస్తే ప్రజలకు ప్రతిరోజూ హ్యాపీడేనే అవుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here