Home జిల్లా వార్తలు అన్ని పార్టీల్లోనూ… మహిళలకు మంగళమేనా?

అన్ని పార్టీల్లోనూ… మహిళలకు మంగళమేనా?

రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. టిక్కెట్ల సందడి మొదలైంది. ఆశావహులు తమ జాతకాలు పట్టుకుని తిరుగుతున్నారు. జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాలకు ప్రధాన పార్టీల తరఫున పలువురు అభ్యర్థులు ఖరా రయ్యారు. మిగిలిన స్థానాలలోనూ ఇంకా కొందరి నాయకుల పేర్లు ప్రచారంలో షికారు చేస్తున్నాయి. విచిత్రమేంటంటే ఈ పేర్లలో మహిళల పేరే మచ్చుకైనా కనిపించడం లేదు. ఓ పక్క చట్టసభలలో మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ల బిల్లు ఆమోదం పొందలేదని గగ్గోలు పెడుతున్నారు. ఇక్కడ చూస్తే జిల్లాలోని 10అసెంబ్లీ సీట్లలో ఒక్క అసెంబ్లీ స్థానంలో కూడా మహిళా నాయకుల పేర్లు వినిపించడం లేదు.

వైసిపిలో ఒక్కరికి కూడా మహిళకు సీటిచ్చే వాతావరణం కనిపించడం లేదు. 10 అసెంబ్లీలకు కూడా దాదాపు అభ్యర్థులు ఫిక్సయ్యారు. 2014లో కూడా జిల్లాలో వైసిపి తరపున ఒక్క మహిళకు కూడా సీటివ్వలేదు. ఈసారి తెలుగుదేశంలో కూడా మహిళలకు మొండి చేయి చూపించే పరిస్థితే కనిపిస్తోంది. ఇప్పటికే ఏడు అసెంబ్లీకు వాళ్ళు దాదాపు అభ్యర్థులను ఖరారు చేశారు. మిగిలిన స్థానాలలో కూడా మహిళలకు అవకాశాలు కనిపించడం లేదు.

జిల్లాలో 1989 నుండి కూడా అటు కాంగ్రెస్‌ గాని, ఇటు తెలుగుదేశం గాని మహిళలకు కనీస ప్రాధాన్యత కల్పిస్తూ వచ్చాయి. 1989లో కుడుముల పద్మశ్రీ నెల్లూరు లోక్‌సభ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా గెలిచింది. 1992లో పనబాక లక్ష్మి వచ్చి నెల్లూరు నుండే కాంగ్రెస్‌ ఎంపీగా విజయం సాధించింది. 1996లోనూ 1998లోనూ పనబాక లక్ష్మి మళ్ళీ ఎంపీగా గెలిచింది. 1999 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుండి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పనబాకలక్ష్మికి సీటివ్వగా తెలుగు దేశం తమ అభ్యర్థిగా ఉక్కాల రాజేశ్వరమ్మను నిలబెట్టింది. అదే ఎన్నికల్లో వెంకటగిరి అసెంబ్లీకి కాంగ్రెస్‌ పార్టీ నేదురుమల్లి రాజ్యలక్ష్మిని దించగా, తెలుగుదేశం వెంకటగిరి నుండి సినీ నటి శారదకు సీటిచ్చింది. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎంపి సీటుకు పనబాకలక్ష్మితో పాటు వెంకటగిరి అసెంబ్లీని రాజ్యలక్ష్మికి, కావలి సీటును మాగుంట పార్వ తమ్మకు ఇవ్వగా… తెలుగుదేశం గూడూరు అసెంబ్లీని ఉక్కాల రాజేశ్వరమ్మకు కేటాయించింది. 2009 ఎన్నికల్లోనూ వెంకటగిరి నుండి రాజ్యలక్ష్మి, సూళ్లూరుపేట నుండి రాజసులోచనలు కాంగ్రెస్‌ అభ్యర్థులుగా దిగారు. ఆ ఎన్నికల్లో టిడిపి నుండి మాత్రం మహిళా అభ్యర్థులు లేరు. 2014లో మాత్రం గూడూరు అసెంబ్లీ సీటును తెలుగుదేశం వాళ్ళు డాక్టర్‌ బి.జ్యోత్స్నలతకు ఇచ్చారు.

ఇలా 1989 ఎన్నికల నుండి కూడా ప్రతి ఎన్నికలలోనూ ప్రధానమైన రెండు పార్టీల తరఫున ఎక్కడోచోట మహిళా అభ్యర్థులు వుంటూవచ్చారు. కాని ఈసారి ఎన్నికలను చూస్తే ఒక్కచోట కూడా ప్రధాన పార్టీల తరఫున మహిళా అభ్యర్థులను నిలబెడతారన్న ఆశలు లేవు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here