Home సంపాదకీయం అన్నదాత ఆక్రందన

అన్నదాత ఆక్రందన

పార్లమెంటు హాల్‌లో కూర్చుని శాసనాలు చేసే సభ్యులైనా, పిఎంఓ ఆఫీసులో కూర్చుని దేశ పరిపాలన గావించే ప్రధానమంత్రి అయినా, సరిహద్దుల్లో ఏ.కె.47లు పట్టుకుని దేశానికి కాపలా కాసే సైనికులైనా, అంతరిక్షంలోకి ఉపగ్రహాలను పంపే శాస్త్రవేత్తలైనా, ప్రాణాంతక రోగాలకు మందులు కనిపెట్టే సైంటిస్టులైనా, డాక్టర్లయినా, యాక్టర్లయినా, కలెక్టర్లయినా, కాంట్రాక్టర్లయినా… ఆకలైతే వేళకు నాలుగు మెతుకులు కడుపులో వేసుకోవాల్సిందే! ప్రతిఒక్కరి బ్రతుకుకు ఆధారం మెతుకులే! అంటే ఈ లెక్కన ఈ భూమ్మీదే అతిపెద్ద విఐపి రైతు. రాకెట్లను కనిపెట్టకముందు ఈ భూమిపై మానవ మనుగడ సాగింది. కంప్యూటర్లు, సెల్‌ఫోన్‌లు లేకముందు, విమానాలు, రైళ్ళు లేక ముందు, అధునాతన ఆయుధాలు కనిపెట్టకముందు… అసలు మనం చూస్తున్న ఈ ఆధునిక యంత్ర సాంకేతిక పోకడలేవీ లేకముందు కూడా జనజీవనం సాగింది. కాని మానవ జీవితంలో నాగరికత అన్నది మొదలైనప్పటి నుండి ఇప్పటివరకు కూడా రైతు లేనిదే, అతను పండించే ఆహారం లేనిదే మనిషి మనుగడ వుండదు. ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరూ రైతుపై ఆధారపడుతున్నవాళ్ళే! అంటే ఈ ప్రపంచా నికి నెంబర్‌వన్‌ ప్రముఖుడు రైతే!

మరి అలాంటి రైతు ప్రస్తుతం ఎలాంటి స్థితిలో వున్నాడు. ఎలాంటి పరిస్థితికి లోనవుతున్నాడు. వ్యవసాయాన్ని పండుగ అనే స్థాయి నుండి దండగ అనుకునే స్థాయికి ఎందుకొచ్చాడు. గ్రామాలలో వ్యవసాయాన్ని వదిలేసి పట్టణాలకు ఎందుకు వలసపోతున్నాడు. అరకు పట్టిన చేతితో కర్ర పట్టి ఎందుకు నైట్‌వాచ్‌మెన్‌ డ్యూటీ చేస్తున్నాడు. అన్నం పెట్టిన చేత్తోనే అన్నమో రామచంద్రా అని ఎందుకు అడుక్కుంటున్నాడు?

రైతు ఆరు నెలలు కష్టపడి పంట పండిస్తాడు. అప్పులు చేసి పెట్టుబడి పెడతాడు. రెక్కలు ముక్కలు చేసుకుంటాడు. ప్రకృతితో పోరాటం చేస్తాడు. పరిస్థితులతో తలపడతాడు. ఒక్కోసారి కాలాను గుణంగా వర్షాలు రావు, ఒక్కోసారి వరదలు ముంచెత్తవచ్చు… ఈ రెండు సందర్భాలలోనూ చివరగా నష్టపోయేది రైతే! నారు వేసింది మొదలుకొని పైరు చేతికొచ్చేదాకా మధ్యలో రైతు చేసేదంతా యుద్ధమే! ఇంత పోరాటం చేసి పంట చేతికొచ్చిన తర్వాత తీరా చూస్తే గిట్టుబాటు ధరలుండవు. రైతు శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతుంది. అలాగని మార్కెట్‌లో ప్రజలకు రైతు ఉత్పత్తులు చౌకగా వస్తున్నాయా అంటే అదీ వుండదు. ఉదాహరణకు రైతు కిలో టమోటాలను నాలుగు రూపాయలకు అమ్మాడనుకుందాం. మార్కెట్‌లో అదే టమోటా కిలో 20రూపాయలుగా వుంటుంది. విత్తనం నాటి మొలకెత్తి టమోటా కోత కొచ్చేసరికి మూడు నాలుగు నెలలన్నా పడుతుంది. ఇంతకాలం కష్టపడితే రైతుకొచ్చేది కిలోకు నాలుగు రూపాయలనుకుందాం. దానికి పెట్టుబడి 3రూపాయలు తీసేస్తే మిగిలేది రూపాయి. కాని, అదే టమోటాను ఒక్కరోజులో కొన్న దళారికి కిలో మీద 5రూపాయల దాకా ఆదాయముంటుంది. వీటిని మార్కెట్‌లో అమ్ముకునే వ్యాపారికి ఇంకో 5రూపాయల ఆదాయం వుంటుంది. చిల్లర దుకాణాలలోకి వెళ్లేసరికి మరో 5రూపాయలు ఆదాయం ఉంటుంది. అంటే మూడు నాలుగు నెలల్లో పెట్టుబడి పెట్టి, కష్టపడి పంటను తెచ్చిన రైతుకంటే కూడా ఒక్కరోజులో మిగతా స్థాయిలలో వాళ్ళు పొందే ఆదాయం ఎక్కువ. ఇక్కడ ఒక వాస్తవం ఏంటంటే రైతు శ్రమ మీద, రైతు లాభాల త్యాగం మీదే వీళ్లంతా… కాదు కాదు మనమంతా బ్రతుకుతున్నాం. ఇది ఒప్పుకోవాల్సిన సత్యం.

భూమిని నమ్ముకుని బ్రతికే రైతులకు స్వతహాగానే భూదేవంత ఓర్పు వుంటుంది. అయితే ఇటీవల కాలంలో ఆ ఓర్పు కూడా పోతోంది. ఎంతకాలమని ఇలా తమను తాము మోసం చేసుకుంటూ ఇతరుల కోసం బ్రతగ్గలరు. ఎంతకాలమని ఇలా అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకోగలరు. అందుకే ఈ దేశంలో రైతులు సైతం ఉద్యమబాట పడుతున్నారు. తమ హక్కుల కోసం కాదు… రైతాంగ మనుగడ కోసం ఆందోళనలకు దిగుతున్నారు.

మొన్న ఢిల్లీలో రైతు ఆగ్రహం ఎలా వుంటుందో అన్ని రాజకీయ పక్షాలు చవిచూసాయి. కిసాన్‌ ముక్తి మోర్చా పేరుతో నిర్వహించిన ర్యాలీలో దేశ వ్యాప్తంగా లక్షలాదిమంది రైతులు పాల్గొన్నారు.

రైతులను బాగా ఇబ్బంది పెడుతున్న అంశాలు మద్దతుధరలు, ఋణభారం. ఇవి ప్రభుత్వాల పరంగా రైతుకు చేయాల్సిన ఉపకారం. ఇక ప్రకృతి కరుణిస్తేనే సాగునీళ్ళు, విద్యుత్‌ వంటివి అందుబాటులో వుంటాయి. 12ఏళ్ల క్రితం ప్రతిపాదించిన స్వామి నాథన్‌ కమిషన్‌ సిఫార్సులను అమలు చేయాలని, మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, రైతు సమస్యలపై చర్చించేందుకు 21రోజులు పాటు పార్లమెంటు సమావేశాలు జరపాలని ఈ కిసాన్‌ ర్యాలీలో రైతుల ప్రధాన డిమాండ్లు. 23 రాజకీయ పక్షాలు ఈ ర్యాలీకి మద్దతు తెలిపాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం దీనిని రైతు ర్యాలీగా కాకుండా వామపక్ష, ఇతర పార్టీల ప్రోద్భలంతో జరిగిన ర్యాలీగా భావిస్తోంది. వారి ఆలోచన ప్రకారం రైతుల ర్యాలీ వెనుక రాజకీయ కోణం వుండొచ్చు. కాని, రైతుల సమస్యల వెనుక ఎలాంటి కోణం లేదు. వారి అప్పులు నిజం, ఆత్మహత్యలు నిజం, దగా పడుతున్న వారి బ్రతుకులు నిజం! రైతు బ్రతుకుకు ముందు ప్రభుత్వాలు గ్యారంటీ ఇవ్వాలి. వ్యవసాయం చేసి నష్టపోతే మేమున్నామనే ధైర్యం ఇవ్వాలి. పరిశ్రమలు పెట్టి ఎత్తిపోయిన వాళ్ళకు వేలకోట్లు ఋణాలు మాఫీ చేస్తున్నట్లుగానే వ్యవసాయం చేసి ఫలసాయం రాక, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న రైతుకు చేయినందించి చేయూతనిచ్చినప్పుడే ఈ దేశానికి వెన్నెముక విరగకుండా గట్టిగా వుంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here