చేయగలిగేదే చెప్పడం… చెప్పింది చేసి చూపడం… రాజకీయాలలో ఇది రహదారి! ఇలాంటి రహదారిలో ప్రయాణించి విజయాలను అందుకున్న నాయకులు మన రాజకీయ చరిత్రలో ఎందరో వున్నారు. ఒక ఇందిరా గాంధీ, ఒక వాజ్‌పేయి, ఒక ఎన్టీఆర్, ఒక వై.యస్. రాజశేఖరరెడ్డి… వీళ్లెవరూ ప్రజలకు అరచేతిలో స్వర్గాలను చూపించలేదు. అలివిగాని హామీలతో మభ్య పెట్టలేదు. ఓట్ల కోసం బూటకపు వాగ్దానాలు చేయలేదు. చేయగలిగినవే చెప్పారు… చెప్పిన వాటిని ఆచరణలో చూపించి ప్రజల మనసులనే కాదు ఎన్నికలలోనూ గెలిచారు.
అలాంటి రాజకీయ రహదారికి, రాజమార్గా నికి భిన్నంగా తెలుగు దేశం అధినేత, ముఖ్య మంత్రి చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రయాణం కొనసాగుతుండడం గమనార్హం. అధికారం కోసం ఆయన రహదారులను కాదు, అడ్డదారులను ఎంచుకుంటుంటాడు. ప్రతి ఎన్నికల సమయంలో అధికారానికి దగ్గరిదారులపై అన్వేషిస్తుంటాడు.
తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఏరోజూ సొంతంగా అధికారంలోకి తేలేదు. 1995లో ఎన్టీఆర్‌ను దించేసి ముఖ్యమంత్రయ్యాడు. 1999 ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోవడం ద్వారా వాజ్‌పేయి సానుభూతి కలిసొచ్చి గెలవగలిగాడు. 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోవడం తెలిసిందే! 2004లో తెలుగుదేశం ప్రభుత్వ వ్యతిరేకత మీద కాంగ్రెస్ గెలిచినా, 2009లో మాత్రం ఆ పార్టీ తిరిగి గెలిచింది వై.యస్.రాజ శేఖరరెడ్డి పరిపాలనా తీరు వల్లే! వై.యస్. ఐదేళ్ళ పాటు ఒకే పాలన కొనసాగించాడు. ఎన్నికలకు రెండు, మూడు నెలల ముందర ప్రజలకు తాయిలాలు అందించ లేదు. అబద్దాల హామీలు ఇవ్వలేదు. ఐదేళ్ళ తన పనితీరు రెఫరెండంగానే ఆయన ప్రజా తీర్పు కోరాడు. ప్రజలు సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్‌ను తిరిగి అధికా రంలోకి తీసుకురావడానికి వై.యస్. రాజమార్గాన్ని అనుసరించాడు.
కాని, చంద్రబాబు 2014 ఎన్నికల్లోనే అడ్డదారిని ఎంచుకున్నాడు. ఒంటరిగా పోరాడలేక మోడీని, పవన్‌కళ్యాణ్‌ను తోడు తెచ్చుకున్నారు. అలివిగాని హామీలన్నీ నోటికొచ్చినట్లు ఇచ్చారు. అప్పుల్లో వున్న రాష్ట్రంలో ఋణమాఫీ సాధ్యం కాదని తెలిసినా, ఋణమాఫీ చేస్తానని హామీ ఇచ్చారు. ఈ అడ్డదారి ప్రయత్నాలన్నీ ఫలించబట్టే 2014లో గెలవగలిగాడు. ఆయనకు ఈ మార్గమే నచ్చినట్లుంది, మరోసారి అదే దారిలో పోతున్నాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలికకు తన అనుకూల పార్టీలను వాడుకుంటున్నాడు. పచ్చమీడియాను పచ్చిగా కొనేశాడు. ఎన్నికలకు రెండు నెలల ముందర పింఛన్ల రెట్టింపు, నిరుద్యోగుల భృతి రెట్టింపు, డ్వాక్రా మహిళలకు డబ్బులు వంటి తాయిలాలు విసురుతున్నాడు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారానూ ఆశలు పెట్టాడు. ప్రభుత్వ డబ్బుతో ప్రజల ఓట్లు కొనడం ఈ పథకాల లక్ష్యం.
ఇక ప్రభుత్వ వ్యవస్థలను వ్యక్తిగతంగా వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట! ఎన్ని కల సమయంలో పోలీసు వ్యవస్థ చాలా కీలకంగా వుంటుంది. అందుకే పోలీసు శాఖలోని అన్ని కీలక పోస్టులలో తనకు అనుకూలంగా వ్యవహరించేవారిని నియ మించుకున్నాడు. అన్ని నియోజకవర్గాల లోనూ వైసిపి సానుభూతిపరుల ఓట్లు తొలగించారు.
ప్రత్యర్థితో పోరాడి గెలవడం అన్నది ఒక ధర్మం. గెలుపు కోసం ఎలాంటి దారిని ఎంచుకున్నా ఫర్వాలేదన్నది చంద్రబాబు సూత్రం. ఐదేళ్లు సమర్ధవంతంగా పరి పాలన చేసిన వాళ్లెవరు కూడా ఎన్నికల ముందు ప్రజలకు బంపర్ ఆఫర్లు ప్రకటిం చడం, వ్యవస్థలను వాడుకోవడం వుండదు. మొన్న తెలంగాణలో కేసీఆర్ రాజమార్గం లోనే గెలిచాడు. తన నాలుగున్నరేళ్ళ పాలన పైనే తీర్పు కోరాడు. కాని, చంద్రబాబు ఇప్పటివరకు కొనసాగించిన తన పాలనపై తీర్పు కోరే సాహసం చేయలేడు. అందుకే తాత్కాలిక స్కీంలు, తాత్కాలిక తాయిలాలు, వ్యవస్థల మేనేజ్మెంట్ వంటి తనకు తెలిసిన రాజకీయ విద్యలతో మరోసారి అధికారం కోసం అర్రులు చాస్తున్నాడు.
