Home జిల్లా వార్తలు అందరి రాళ్ళు… ఆయనపైనే!

అందరి రాళ్ళు… ఆయనపైనే!

రాజకీయాలలో రెండురకాల పోరాటాలుంటాయి. ఒకటి అవతలి పార్టీలోని ప్రత్యర్థులతో పోరాడడం, రెండోది సొంత పార్టీలోని వ్యతిరేకులతో తలపడడం. ఈ తరహా రాజకీయాలను తలచుకుంటే మొదట మనకు దివంగత నేత డాక్టర్‌ వై.యస్‌.రాజశేఖరరెడ్డి గుర్తుకు వస్తారు. ఆయన తన రాజకీయ జీవితంలో రాజకీయ ప్రత్యర్థులతో ఎంతగా పోరాడాడో, ప్రజాసమస్యల విషయంలో తన పార్టీ ముఖ్య మంత్రులు, ఇతర నాయకులతో కూడా అంతే పోరాడాడు.

నెల్లూరుజిల్లా రాజకీయాలను చూస్తే ఆ పాత్రల్లో మనకు మొదటగా గుర్తొచ్చేది ఆ కాలంలో స్వర్గీయ నల్లపరెడ్డి శ్రీనివాసులురెడ్డి. ప్రస్తుత కాలంలో చూస్తే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి. వీళ్ళకు అవతల పార్టీలోకంటే కూడా సొంత పార్టీలోనే ప్రత్యర్థులెక్కువుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు వ్యవసాయమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి పరిస్థితిని చూద్దాం..! తెలుగుదేశంలోని పలువురు ప్రధాన నాయకులు తమ చేతిలోని రాళ్ళను సోమిరెడ్డి మీదకే విసురుతున్నారు. మొన్నటికి మొన్న మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డిని చూసాం. జిల్లాలో జరిగిన మినీమహానాడు కార్యక్రమాలలో పాల్గొన్న ఆయన సోమిరెడ్డి మీద దుమ్మెత్తి పోశాడు. జిల్లాలో పార్టీని నాశనం చేస్తు న్నాడంటూ విమర్శలు చేశాడు. సరే, సోమిరెడ్డి పార్టీని నాశనం చేశాడనే అను కుందాం! మరి ఆనం రామనారాయణరెడ్డి తెలుగుదేశంలోనే వుండి ఆ పార్టీని బాగు చేయొచ్చు కదా! అదేం లేదు… సోమిరెడ్డి మీద టన్నుల కొద్ది బండలేసి ఆయన మాత్రం తెలుగుదేశాన్ని వదిలేసి వైసిపిలో చేరడానికి సిద్ధమయ్యాడు. తాను వైసిపిలో చేరాలనుకుంటే దానికి అభ్యంతరం లేదు. కాని సోమిరెడ్డి వల్ల పార్టీ పాడైపోతుం దంటూ సర్టిఫికేట్‌ ఇచ్చి రావడమెందుకో?

తాజాగా ఆదాల ప్రభాకర్‌రెడ్డి కూడా సోమిరెడ్డి మీద రాళ్ళేసే పని మొదలుపెట్టాడు. ఆదాల తెలుగుదేశం పార్టీ నెల్లూరు పార్ల మెంట్‌ ఇన్‌ఛార్జ్‌తో పాటు నెల్లూరు రూరల్‌, ఆత్మకూరు అసెంబ్లీల ఇన్‌ఛార్జ్‌గా కూడా వున్నాడు. 1999కి ముందు సోమిరెడ్డి, ఆదాల సఖ్యతగానే వుండేవాళ్లు. 1999లో ఆదాలకు మంత్రి పదవి వచ్చింది. అప్పటి నుండి సోమిరెడ్డికి, ఆదాలకు పడకుండా వచ్చింది. 2001లో ఆదాలకు మంత్రి పదవి పోయి సోమిరెడ్డి మంత్రయ్యాడు. వీళ్ల మధ్య విభేదాలు 2004 దాకా కొన సాగాయి. 2004 ఎన్నికల్లో ఆదాల కాంగ్రెస్‌లో చేరి సోమిరెడ్డికే రాజకీయ ప్రత్యర్థి అయ్యాడు. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఆదాల చేతిలో సోమి రెడ్డి పరాజయం పొందాడు. కాంగ్రెస్‌ ప్రభుత్వమున్న పదేళ్ళు ఆదాల, సోమిరెడ్డిల మధ్య పాము – ముంగిసల పోరాటమే నడిచింది. 2014ఎన్నికలొచ్చేసరికి ఇద్దరూ ఒకే పార్టీలో వున్నారు. అయితే ఆదాల నెల్లూరు పార్లమెంటు ఇన్‌ఛార్జ్‌ కావడం, సోమిరెడ్డి ఇన్‌ఛార్జ్‌గా వున్న సర్వేపల్లి నియోజకవర్గం నెల్లూరు పార్లమెంట్‌ పరిధిలోకి రాకపోవడంతో వీరిద్దరూ ఒకరి వ్యవహారాలలో ఒకరు వేలు పెట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఒకే పార్టీలో వున్న వీళ్ళిద్దరి మధ్య ఇప్పటిదాకా ఎలాంటి అంతర్గత విభేదాలు కనిపించలేదు. కాని ఇప్పుడు అకస్మాత్తుగా సోమిరెడ్డి చంద్ర మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని ఆత్మ కూరు సమావేశాలలో ఆదాల విమర్శలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.

ఇక మరో మంత్రి నారాయణ స్వత హాగా రాజకీయ నాయకుడు కాదు కాబట్టి సోమిరెడ్డిపై ప్రత్యక్ష విమర్శలు చేయడం లేదుగాని, సోమిరెడ్డికి వ్యతిరేకంగా ఎంత చేయాలో అంత నారాయణ చేస్తున్నాడు. సోమిరెడ్డిని రాజకీయంగా, అధికారికంగా ప్రాధాన్యత తగ్గించడం కోసం చంద్రబాబు వద్ద తనకున్న పలుకుబడిని ఉపయోగిస్తు న్నాడు. జిల్లాలో సోమిరెడ్డి వ్యతిరేకులకు తనవంతు సాయం అందిస్తూ వస్తున్నాడు. ఇలా తెలుగుదేశం పార్టీలో అందరి టార్గెట్‌ సోమిరెడ్డే కావడం గమనార్హం! అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సోమిరెడ్డి మీద రాళ్ళు విసిరేవాళ్ళలో ఎవరు ఎంతవరకు తెలుగుదేశం పార్టీ పటిష్టతకు కష్టపడ్డారన్నది!

ఆదాల తెలుగుదేశం అధికారంలో వున్నప్పుడు పార్టీలో వున్నాడు. పార్టీ పదేళ్ళు ప్రతిపక్షంలో వుంటే ఆయన అధికార కాంగ్రెస్‌లో వున్నాడు. మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చే సమయానికి ఆ పార్టీలో చేరాడు. రేపు అదే పార్టీలో కొనసాగుతాడా అనే గ్యారంటీ లేదు. ఆనం రామనారాయణరెడ్డి అవసరం కోసం అవకాశం కోసం తెలుగుదేశంలో కొచ్చాడు. నాలుగేళ్ళు కాకముందే వైసిపిలో చేరుతున్నాడు. ఇక నారాయణ చూస్తే పార్టీకి ఇతరత్రా ఉపయోగపడివుండొచ్చు కాని రాజకీయంగా ఎలాంటి ఉపయోగం లేదు. ముఖ్యంగా ఈ జిల్లాలో తెలుగు దేశం ప్రతిపక్షంలో వున్నప్పుడు ఈ నాయ కులెవరు కూడా పార్టీలో లేరు. పార్టీని మోయలేదు. ప్రతిపక్షంలో వుండి పదేళ్ళు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై పోరాడింది, ఉద్య మాలు నడిపింది సోమిరెడ్డే! ఆనాడు వై.యస్‌. ప్రజాదరణ ధాటికి తెలుగుదేశం పోటీకి కూడా భయపడుతున్న తరుణంలో ఆఖరకు జడ్పీటీసీ పదవికి కూడా పోటీకి దిగింది సోమిరెడ్డే! 2011లో కోవూరు ఉపఎన్నికల్లో జగన్‌ ధాటికి టీడీపీ నుండి పోటీ చేయడానికి ఎవరూ ముందుకురా కుంటే, ఓడిపోతానని తెలిసి కూడా పార్టీ పరువును కాపాడడం కోసం కోవూరు బరిలో నిలిచింది ఆయనే! పార్టీ అధికా రంలో వున్నప్పుడు కాదు… పార్టీ ప్రతి పక్షంలో వున్నప్పుడు భుజాల మీదనుండి కాడెను దించకుండా భారంగా బాధ్యతగా ముందుండి నడిచింది సోమిరెడ్డే!

నెల్లూరుజిల్లాలో తెలుగుదేశం బల హీనపడడానికి, బలపడడానికి ఎవరూ కారణం కాదు, ఎందుకంటే స్వతహాగా ఇది ఒకప్పుడు కాంగ్రెస్‌ ప్రాబల్యం, ఇప్పుడు వైసిపి ప్రాబల్యం వున్న జిల్లా! ఎవరొచ్చి పొడిచినా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఇంతకంటే లేచేదేమీ లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here