Home సంపాదకీయం అంతరిక్షంలో.. అద్భుత ప్రగతి

అంతరిక్షంలో.. అద్భుత ప్రగతి

ఒకప్పట్లో రాకెట్‌ ప్రయోగమంటే ఎంతో కష్టసాధ్యంగా ఉండేది. అది కక్ష్యలోకి ప్రవేశించిందనే సమాచారం వచ్చే దాకా ఎడతెగని ఉత్కంఠగా ఉండేది. ఇప్పుడు భారత్‌ తన అద్భుతమైన పరిజ్ఞానంతో అవలీలగా రాకెట్‌లను ప్రయోగిస్తూ ఇతర దేశాలకు చెందిన ఉపగ్రహాలను కూడా మోసుకెళ్ళి అంతరిక్షంలో నిర్ధేశించిన కక్ష్యలో ప్రవేశపెడుతూ..అంతరిక్ష రంగంలో ముందుకు దూసుకువెళ్తోంది. అందులోనూ ఇటీవలి కాలంలో గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహంతో రాకెట్‌లను, వాటితోపాటు ఎన్నెన్నో ఉప గ్రహాలను కూడా జతచేసి నింగిలోకి విజయవంతంగా పంపుతూ.. మన దశం అద్భుతాలను సృష్టిస్తోంది. ఒక్కమాటలో చెప్పాలంటే భారత్‌..అంతరిక్షంలో అద్భుత ప్రగతిని సాధిస్తోంది. ఇది దేశానికే గర్వకారణం. నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) షార్‌ నుంచి ఇటీవల పిఎస్‌ఎల్‌వి సి-45 ద్వారా దేశరక్షణ రంగానికి ఊతమిచ్చే ఇమిశాట్‌ అనే సరికొత్త ఉపగ్రహ ప్రయోగాన్ని చేపట్టి విజయవంతం చేయడం షార్‌ కీర్తిని..మన శాస్త్రవేత్తల ప్రతిభను ప్రపంచానికి చాటింది. ఇప్పటిదాకా షార్‌ నుంచి 71 ప్రయోగాలు చేపడితే, అందులో పిఎస్‌ఎల్‌వి శ్రేణిలోవి 47 దాకా ఉండడం..ఇవన్నీ కూడా మన శాస్త్రవేత్తలకు విజయపరంపరలను చేకూర్చినవి కావడం ఎంతైనా విశేషమే మరి.

పిఎస్‌ఎల్‌వి (పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) సి-45 రాకెట్‌ ప్రయోగాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఏప్రిల్‌ 1న జయ ప్రదంగా నిర్వహించి అంతరిక్షరంగ పరిజ్ఞానంలో అంత ర్జాతీయస్థాయిలో మరింత ఖ్యాతిని సాధించింది. ఈ రాకెట్‌తో పాటు ఒకేసారి నింగిలోకి 29 ఉపగ్రహాలను కూడా విజయవంతంగా పంపి భారత్‌ తన సత్తా మరోసారి చాటుకుంది. అందులోనూ తొలిసారిగా 3 కక్ష్యల మిషన్‌తో భారత్‌ తన శక్తిసామర్ధ్యాలను రుజువుచేసుకోవడం చరిత్రాత్మకంగా భావించవచ్చు. అంతరిక్షంలో వరుసగా 749, 504, 385 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి విజయవంతంగా ఉపగ్రహాలను మన శాస్త్రవేత్తలు పంపారు. తొలుతగా ఈ రాకెట్‌ 749 కిలోమీటర్ల ఎత్తులో డిఆర్‌డిఓకి చెందిన 436 కిలోల ఇమిశాట్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఆ తర్వాత అక్కడినుంచి 504 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని విదేశాలకు చెందిన 28 ఉపగ్రహాలను కక్ష్యలోకి వదిలి పెట్టింది. ఆ తర్వాత అక్కడి నుంచి మూడుగంటల సేపు పయనించి మరో 485 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుని అంతరిక్ష పరిశోధనకు అవసరమైన పేలోడ్స్‌ను కక్ష్యలో విడిచిపెట్టింది. ఇలా మూడు దశల్లోనూ ఎంతో క్లిష్టమైన ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తిచేసి గగనతలంలో భారత్‌ తన ఘనకీర్తిని మరోసారి రెపరెపలాడించింది. అందులోనూ ‘మిషన్‌ శక్తి’ ద్వారా అంతరిక్ష భద్రతపై పూర్తిస్థాయిలో పట్టుసాధించిన భారత్‌, నిఘా విషయంలోనూ ముందుంటూ విదేశీ రాడార్ల శక్తిసామర్ధ్యాలను పసిగట్టి ఫోటోలతో సహా సమాచారాన్ని సేకరించే ఇమిశాట్‌ ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపడం ఈసారి ప్రయోగంలో ఒక మైలురాయి అని చెప్పవచ్చు. ఇమిశాట్‌తో పాటు, నాలుగు దేశాలకు చెందిన 28 నానో ఉపగ్రహాలను (వీటి బరువు 220 కిలోలు) కూడా ఈ రాకెట్‌ నిర్ణీత కక్ష్యలోకి చేర్చింది. ఎంతో సంక్లిష్టమైన ఈ ప్రయోగాన్ని దిగ్విజయం చేయడంతో మన శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంస లందుకుంటున్నారు. అందులోనూ ఇమిశాట్‌ ఉపగ్రహాన్ని డిఆర్‌డిఓ సంస్థ రూపొందించింది. దీనికి ఆ సంస్థ అధిపతి సతీశ్‌రెడ్డి నేతృత్వం వహించారు. ఈ ఉపగ్రహం శత్రుదేశాల రాడార్ల జాడను గుర్తించడంలో ఎంతో దిట్ట కూడా. ఈ ఉపగ్రహం తక్కువ ఎత్తులోనే తిరుగుతూ పొరుగుదేశాల రాడార్ల సమాచారాన్ని కనుగొనడంలో ముందుంటుంది. అంతేకాక, సరిహద్దుల నుంచి ఉగ్రవాదుల చొరబాట్లును పసిగట్టడంలో కూడా దీని సహకారం ఎంతో ఉంటుంది. పేలోడ్‌ పరిశోధనల ద్వారా సముద్రాల్లో ప్రయాణించే నౌకల నుంచి వచ్చే సమాచారాన్ని సేకరించేందుకు తగు పరిశోధనలు చేయనుంది.

ఇకపోతే, అంతరిక్షంలో 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపగ్రహాన్ని క్షిపణితో కూల్చగల సామర్ధ్యాన్ని కూడా భారత్‌ సొంతం చేసుకోగలగడం ఎంతైనా అద్భుతం!.. చరిత్రాత్మకం!.. ఇటీవల బాలాసోర్‌లోని డాక్టర్‌ ఏపిజె అబ్దుల్‌కలాం సెంటర్‌ నుంచి నిర్వహించిన ఉపగ్రహ విధ్వంసక క్షిపణి ప్రయోగం అటు అంతరిక్ష రంగంలోనూ, ఇటు సైనిక పాటవంలోనూ కీలక మలుపుగా భావించవచ్చు. ప్రపంచంలో ఇంతవరకు అమెరికా, రష్యా, చైనాల వద్ద మాత్రమే ఉన్న ఈ సాంకేతికతను భారత్‌ సొంతం చేసుకోవడం అంతరిక్షరంగ పరిజ్ఞానంలో ఒక ముందడుగేనని చెప్పవచ్చు. ఇలాంటి ప్రయోగాల వల్ల మనదేశం ఇప్పటికే ప్రయోగించివున్న అనేక

ఉపగ్రహాలను రక్షించుకునేందుకు కూడా ఉప యోగంగానే ఉంటుందని అనుకోవచ్చు. అందు లోనూ ఈ సాంకేతికత పూర్తి స్వదేజీ పరిజ్ఞానంతో రూపొందించ గలిగామని రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డిఆర్‌డిఓ) ఛైర్మెన్‌ సతీశ్‌రెడ్డి వెల్లడించడం మన శాస్త్రవేత్తల అద్వితీయ ప్రతిభకు నిదర్శనం. మనదేశంపై కన్నేసే గూఢచారి ఉపగ్రహాలను ధ్వంసం చేసే క్షిపణిని తయారుచేయాలని రెండున్నర సంవత్సరాల క్రితం ప్రధాని మోడీ ఆదేశించారని, ఆ మేరకు డిఆర్‌డిఓ శాస్త్రవేత్తలు రేయింబవళ్ళు శ్రమించి ‘మిషన్‌ శక్తి’ క్షిపణిని రూపొందించారని సతీశ్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఏదేమైనా అంతరిక్షరంగంలో భారత్‌ తన అద్వితీయమైన..అద్భుతమైన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ నిరంతర కృషి..పట్టుదలతో విరామమెరుగక శ్రమిస్తూ అనేకానేక ఘనమైన గగన విజయాలను సొంతం చేసుకుంటుండడం మన దేశానికీ..ప్రతి ఒక్క భారతీయునికీ ఎంతైనా గర్వకారణం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here